అప్పట్లో నా జీవితం భయంకరంగా ఉండేది
అప్పట్లో నా జీవితం భయంకరంగా ఉండేది
Published Tue, Nov 12 2013 1:23 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న తారల్లో ప్రియాంక చోప్రా తొలి వరుసలో నిలుస్తారు. సినిమాలు, వాణిజ్య ప్రకటనల ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న ఈ బ్యూటీ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. అందుకే, ‘‘మిడిల్ క్లాస్ కష్టాలు నాకు బాగా తెలుసు. బాక్సింగ్ చాంపియన్ మేరీ కోమ్ జీవితమూ నాదీ ఒకటే తరహా’’ అంటున్నారు ప్రియాంక. మేరీ కోమ్ పేరుని ఆమె ప్రస్తావించడానికి ఓ కారణం ఉంది. ఈ బాక్సింగ్ క్వీన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘మేరీ కోమ్’ చిత్రంలో ప్రియాంక టైటిల్ రోల్ చేస్తున్నారు.
అసలు సిసలైన బాక్సింగ్ చాంపియన్‌లా కనిపించడానికి ఆమె చాలా కసరత్తులు చేశారు. మేరీ శరీరాకృతిలానే తన శరీరాకృతిని మార్చుకున్నారు. ఇప్పటివరకు ఏ సినిమాకీ పడనంత కష్టం ఈ సినిమాకి పడుతున్నారట ప్రియాంక. ఇటీవల ఈ చిత్రం గురించి ప్రియాంక మాట్లాడుతూ -‘‘మేరీ కోమ్ పాత్ర అంగీకరించిన తర్వాత ఆమె జీవితం గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నా. ఓ నిరుపేద రైతు కుటుంబంలో పుట్టారామె. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశారు. ప్రపంచంలో ఉన్నత బాక్సర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
నేనూ మేరీ కోమ్‌లానే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిని కాబట్టి సరైన పోషణ ఉండేది కాదు. నా కాళ్ల నిండా తెల్ల మచ్చలు ఉండేవి. కానీ, ఇవాళ అవే కాళ్లు 12 ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తున్నాయి. ఇక, సినిమాల్లోకొచ్చిన కొత్తలో నా జీవితం భయంకరంగా ఉండేది. ఎవరికి చెప్పుకోవాలో తెలిసేది కాదు. ఒంటరిగా కూర్చుని ఏడ్చేసేదాన్ని. జీవితంలో మంచి స్థాయికి ఎదగాలనే తపన ఉన్న అమ్మాయిలకు సమస్యలు సహజం. వాటిని అధిగమిస్తే.. అనుకున్నది సాధించవచ్చు’’ అని చెప్పారు.
Advertisement
Advertisement