
జాకీ ఏరిపారేశాడు!
మార్షల్ ఆర్ట్స్ కింగ్ జాకీ చాన్ ప్రస్తుతం ఇడియాలో ఉన్న విషయం తెలిసిందే. ఇండో-చైనీస్ సంయుక్త సమర్పణలో జాకీ చాన్ హీరోగా రూపొందుతున్న ‘కుంగ్ ఫూ యోగా’ చిత్రం షూటింగ్ రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో జరుగుతోంది. ఇందులో మన భారతీయ నటీనటులు అమైరా దస్తర్, సోనూ సూద్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఓ భారీ పోరాట దృశ్యం చిత్రీకరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న నటుడు జాకీతో షూటింగ్ అంటే ఎలా ఉంటుందో అని ఇక్కడి టెక్నికల్ టీమ్ అనుకున్నారట.
కానీ, జాకీ అందరితో కలిసిపోయి, చాలా సరదాగా షూటింగ్ చేస్తున్నారట. షాట్ గ్యాప్‌లో అమైరాతో ఈల వేసి, గోల చేస్తున్నారట కూడా. అది మాత్రమే కాదు.. షూటింగ్ లొకేషన్‌లో చిత్తు కాగితాలు కనిపిస్తే ఏరిపారేస్తున్నారని సమాచారం. జాకీ చాన్ అంతటి గొప్ప వ్యక్తే ఆ పని చేస్తుంటే, తామెందుకు చేయకూడదని అమైరా, సోనూ వంటి తారలు, ఇతర సాంకేతిక బృందం కూడా కంటికి కనిపించిన చెత్తను ఏరిపారేస్తున్నారట.