కొట్టేయడంతో పాటు కొట్టడమూ వచ్చురా!
కుశ... ఓ మంచి దొంగ! అంటే... చిలిపి కృష్ణుడు టైప్ అన్నమాట. కృష్ణుడు వెన్న దొంగిలిస్తే... మనోడు డబ్బులు దోచేస్తాడు. ఆ డబ్బులతో బాధల్లో ఉన్నోళ్ల బాధలను తీరుస్తాడు. ఒకవేళ ఎవరైనా మనోడి దగ్గర్నుంచి డబ్బులు కొట్టేయాలని చూస్తే చితక్కొడతాడు. టీజర్ చూస్తే అచ్చం అలానే ఉన్నాడు మరి! ముఖ్యంగా ‘కొట్టేయడంతో పాటు కొట్టడం కూడా వచ్చురా’ అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులనూ ఆకట్టుకుంది.
ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న సినిమా ‘జై లవ కుశ’. ఇందులో ముగ్గురన్నదమ్ములుగా ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ జై, లవ టీజర్లు విడుదలైన విషయం తెలిసిందే. కుశ టీజర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. రేపు (ఆదివారం) జరగబోయే ప్రీ–రిలీజ్ వేడుకలో ట్రైలర్‌ను విడుదల చేస్తారట. ఈ సినిమా విజయదశమి కానుకగా ఈ నెల 21న విడుదల కానున్న సంగతి తెలిసిందే.