Jai Lava Kusha
-
హీరోకు జబ్బు.. నిర్మాతకు డబ్బు
-
స్పెషల్ గాళ్
స్వింగ్ జర స్వింగ్ జర... స్వింగ్ స్వింగ్ అంటూ తమన్నా ఆ మధ్య ‘జై లవ కుశ’లో చేసిన ఐటమ్ సాంగ్ గుర్తుండే ఉంటుంది. థియేటర్లో ఫ్యాన్స్ ఊగిపోయారు. తమన్నా అంత బాగా డ్యాన్స్ చేశారు. అంతకుముందు ‘అల్లుడు శీను’లో ‘లబ్బర్ బొమ్మ..’, ‘స్పీడున్నోడు’లో ‘బ్యాచిలర్ బాబు..’ అంటూ ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్‌కూ మంచి స్పందన వచ్చింది. ఇంతేనా కన్నడ ‘జాగ్వార్’లోనూ ఓ ఐటమ్ సాంగ్‌కి కాలు కదిపి, శాండిల్వుడ్నీ తన ఆటతో కట్టిపడేశారు. ఇప్పుడు మరోసారి కన్నడ ప్రేక్షకులకు ఐ–ఫీస్ట్ లాంటి ఐటమ్ సాంగ్‌లో కనిపించనున్నారు తమన్నా. అన్నట్లు.. రీసెంట్గా నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమాలో ఫేమస్ సాంగ్ ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు’లో నర్తించడానికి ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కన్నడ చిత్రం ‘కేజీఎఫ్’లో స్పెషల్ సాంగ్ గురించి చెప్పాలంటే.. నవీన్ కుమార్, శ్రీనిధి జంటగా నటిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహి స్తున్నారు. ఇందులో తమన్నా చేయబోయే స్పెషల్ సాంగ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ 1970లో నటించిన కన్నడ చిత్రం ‘పరోపకారి’ సినిమాలోని ‘జోకే నన్ను బలియా మించు’ సాంగ్ రీమిక్స్‌లో తమన్నా నటించబోతున్నారు. ఈ సినిమాను కన్నడతో పాటు తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రబృందం. అదండీ సంగతి. తమన్నాకి ఇక్కడ కూడా క్రేజ్ ఉంది కదా అందుకే.. స్పెషల్ సాంగ్ చేయించి ఉంటారు. మొత్తంగా హీరోయిన్గా, స్పెషల్గాళ్గా తమన్నా కెరీర్ ఫుల్ స్వీంగ్‌లో ఉంది. -
పోటీ లేకుండాపోయింది
గతేడాది సెప్టెంబర్ చివరి వారంలో ముగ్గరు పెద్ద హీరోల సినిమాలు ఒకే వారంలో బాక్సాఫీస్ వద్ద క్లాష్ అవుతాయనుకున్నారు. అవే.. బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందిన ‘పైసా వసూల్’, మహేశ్‌బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ, తెలుగు బైలింగ్వల్ ‘స్పైడర్’, బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ త్రిపాత్రిభినయం చేసిన ‘జై లవ కుశ’. అనుకున్నట్లుగా అయితే.. సెప్టెంబర్ 21న ‘జై లవ కుశ’, 27న ‘స్పైడర్’, ‘పైసా వసూల్’ రిలీజ్ కావాల్సింది. కానీ.. చెప్పిన టైమ్కన్నా ముందే ‘పైసా వసూల్’ చిత్రాన్ని సెప్టెంబర్ 1న రిలీజ్ చేశారు చిత్రబృందం. ‘జై లవ కుశ’ స్టెప్టెంబర్ 21న, ‘స్పైడర్’ 27న వచ్చాయి. మొత్తం మీద పోటీ లేకుండాపోయింది. -
ఆ ఇద్దరు.. వీరే.. వీరే..వీరే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా సినిమా 'జైలవకుశ'.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను అంగీకరించడానికి కారణం ఇద్దరు వ్యక్తులు అని, సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత వారి పేర్లు వెల్లడిస్తానని ఎన్టీఆర్ ప్రీరిలీజ్ వేడుకలో ప్రకటించాడు. అన్నట్టుగానే 'జైలవకుశ' ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేసిన జూనియర్‌కూ మంచి పేరు వచ్చింది. మరి ఈ సినిమాను ఎన్టీఆర్ చేయడానికి కారణమైన ఆ ఇద్దరు ఎవరంటే.. ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ... ఈ టాప్ డైరెక్టర్లే ఎన్టీఆర్ 'జైలవకుశ' చేయడానికి కారణం. ఈ విషయాన్ని ప్రముఖ మాటల రచయిత కోన వెంకట్ తాజాగా ట్విట్టర్లో వెల్లడించారు. ప్రిరిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ ఇచ్చిన మాటను గుర్తుచేస్తూ ఓ నెటిజన్ రిక్వెస్ట్ చేయడంతో కోన వెంకట్ ఈ ఇద్దరు పేర్లను వెల్లడించారు. నిజానికి ఎస్ఎస్ రాజమౌళి ఎన్టీఆర్‌కు సన్నిహితుడు. ఎస్ఎస్ రాజమౌళి, వీ వినాయక్‌లు తనకు సన్నిహితులు అని ఎన్టీఆర్ చెప్తుంటారు. 'జైలవకుశ' ఎన్టీఆర్ చేయడం వెనుక ఆ ఇద్దరు ఉండి ఉండొచ్చునని భావించారు. కానీ వినాయక్ ప్లేస్‌లో కొరటాల శివ వచ్చాడు. ఎన్టీఆర్‌కు 'జనతా గ్యారేజ్' వంటి భారీ విజయాన్ని అందించిన కొరటాల శివతోనూ ఎన్టీఆర్ మంచి స్నేహబంధం కలిగి ఉన్నాడని సినీ వర్గాలు అంటున్నాయి. S.S.R & Koratala Shiva https://t.co/mxenAEjDs6 — kona venkat (@konavenkat99) 28 October 2017 -
ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఎవరితో?
వరుస సూపర్ హిట్లతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోరుమీద ఉన్నాడు. తాజాగా ఎన్టీఆర్ త్రిపాత్రభినయం చేసిన 'జైలవకుశ' ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంచి వసూళ్లతో ఎన్టీఆర్ స్టామినాను చాటింది. ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తాడన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ సినిమా చేస్తాడన్న టాక్ ఎప్పటినుంచో ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్‌కల్యాణ్‌తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అయినా దీని గురించి అధికారిక ప్రకటన ఏదీ లేదు. ప్రస్తుతం 'జైలవకుశ' విజయాన్ని ఆస్వాదిస్తున్న ఎన్టీఆర్ త్వరలోనే కుటుంబసభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. కుటుంబసభ్యులతో గడిపిన అనంతరం తదుపరి సినిమా కోసం ఎన్టీఆర్ కసరత్తు మొదలుపెట్టే అవకాశముంది. కాగా, ఇటీవల ప్రముఖ దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఎన్టీఆర్‌కు ఓ పాయింట్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ పాయింట్‌కు ఎన్టీఆర్ ఓకే చెప్పినట్టు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. 'ఇష్క్', 'మనం' వంటి చిత్రాలను రూపొందించి విక్రమ్ ప్రస్తుతం అఖిల్‌తో 'హాలో' సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అటు తివ్రికమ్తో ప్రొసీడ్ అవుతాడా? లేక విక్రమ్ కే కుమార్ చాన్స్ ఇస్తాడా?.. లేదా మరో కొత్త డైరెక్టర్ తెరపైకి వస్తాడా చూడాలి. -
హాట్ టాపిక్‌గా తారక్ కామెంట్స్!
సాక్షి, హైదరాబాద్: 'జై లవ కుశ' విజయోత్సవంలో వేడి రాజుకుంది. సినీ విమర్శకులు వ్యవహరిస్తున్న తీరుపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ మండిపడ్డాడు. కష్టపడి తెరకెక్కిస్తున్న చిత్రాలకు కొందరు విమర్శకులు నెగిటివ్ సమీక్షలు ఇస్తున్నారని చెప్పాడు. తారక్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. బాబీ దర్శకత్వంలో వచ్చిన 'జై లవ కుశ' చిత్రంలో జూనియర్ మూడు పాత్రల్లో నటించాడు. బాక్సాఫీస్ దగ్గర బంపర్ ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రానికి క్రిటిక్స్ బిలో యావరేజ్ రేటింగ్స్ తో సరిపెట్టారు. ఇలా నెగిటీవ్ రివ్యూలు ఇవ్వడంతో తారక్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. 'జై లవ కుశ' విజయోత్సవంలో తారక్ మాట్లాడుతూ.. 'హాస్పటల్లో మన కుటుంబసభ్యులెవరైనా క్రిటికల్ కండిషన్‌తో ఎమర్జెన్సీ వార్డులో ఉంటే.. డాక్టర్లు ఏం చెబుతారో? మనం ఆశలు పెట్టుకోవచ్చో? లేదో? అని ఎదురు చూస్తుంటాం. టెస్టులు చేసిన తర్వాత చెబుతామని ఎన్నో ఏళ్లు అనుభవం గల, చదువుకున్నటువంటి డాక్టర్లు చెబుతారు. ఈలోపు దారినపోయే దానయ్యలు కొందరు అన్నీ తెలిసినట్టే ‘బతకడు. పోతాడు’ అంటుంటారు. భయంలో ఉన్న మనకు ధైర్యాన్ని ఇవ్వకపోగా... చావు బతుకుల మధ్య ఉన్నోణ్ణి చంపేయడం, వాడి మీద ఆశలు పెట్టుకున్నోణ్ణి ఇంకా చంపేసేయడం... ఇటీవల ఇలాంటి ప్రక్రియ మన తెలుగు ఇండస్ట్రీలో మొదలైంది. విడుదలైన సిన్మా ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్ లాంటిది. పేషెంట్ బతుకుతాడా? లేదా? అనుకునే చుట్టాలు మేము (సిన్మా టీమ్). ప్రేక్షకులు డాక్టర్లు. విశ్లేషకులు దారినపోయే దానయ్యలు. పేషెంట్ చచ్చిపోయాడని వాళ్లు (ప్రేక్షకులు) చెబితే ఓకే. ఆశలు వదిలేసి, ఒప్పేసుకుంటాం. కానీ, ఆ క్లారిటీ రాకుండా... ముందే పోయాడనో! అదనో! ఇదనో! ఎందుకు? డాక్టర్లను చెప్పనివ్వండి. ఎమర్జెన్సీ వార్డుకి ఇంకొకణ్ణి తెచ్చుకుంటాం. మాకే కాదు, అందరికీ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది. దయచేసి... ఒక సిన్మా వచ్చినప్పుడు ప్రేక్షకుల్ని స్పందించనివ్వండి. అఫ్కోర్స్... 101 శాతం మనందరికీ వాక్ స్వాతంత్య్రం ఉంది. కానీ, మనం మాట్లాడే ఒక మాట అవతలి వ్యక్తికి ఉన్నటువంటి ఆశను ఎంత దిగజారుస్తుందో ఒక్కసారి ఆలోచించండి. నా మాటల్లో తప్పులుంటే క్షమించండి! అర్థం లేకుంటే వదిలేయండి. నా బాధను మీ అందరికీ ఒక్కసారి వెల్లడిద్దామనుకున్నా’’ అంటూ ఎన్టీఆర్ ఆవేదనగా పేర్కొన్నాడు. ‘‘ఎమర్జెన్సీ వార్డుకి వచ్చిన మా పేషెంట్ ‘జై లవకుశ’ హెల్త్ బ్రహ్మాండంగా ఉందని చెప్పిన మా డాక్టర్లందరికీ ధన్యవాదాలు’’ అంటూ ఆయన ముగించాడు. ఆయన వ్యాఖ్యలపై ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్ ఎందుకింత ఎమోషనల్‌గా స్పందించారు? ఆయనను బాధపరిచిన నెగిటివ్ రివ్యూలేమిటి? అన్నది చర్చనీయాంశమైంది. -
హాట్ టాపిక్‌గా తారక్ కామెంట్స్!
-
నా మాటల్లో తప్పులుంటే క్షమించండి : తారక్
‘‘హాస్పటల్లో మన కుటుంబ సభ్యులెవరైనా క్రిటికల్ కండిషన్లో ఎమర్జెన్సీ వార్డులో ఉంటే.. డాక్టర్లు ఏం చెబుతారో? మనం ఆశలు పెట్టుకోవచ్చో? లేదో? అని ఎదురు చూస్తుంటాం. టెస్టులు చేసిన తర్వాత చెబుతామని ఎన్నో ఏళ్లు అనుభవం గల, చదువుకున్నటువంటి డాక్టర్లు చెబుతారు. ఈలోపు దారినపోయే దానయ్యలు కొందరు అన్నీ తెలిసినట్టే ‘బతకడు. పోతాడు’ అంటుంటారు. భయంలో ఉన్న మనకు ధైర్యాన్ని ఇవ్వకపోగా... చావు బతుకుల మధ్య ఉన్నోణ్ణి చంపేయడం, వాడి మీద ఆశలు పెట్టుకున్నోణ్ణి ఇంకా చంపేసేయడం... ఇటీవల ఇలాంటి ప్రక్రియ మన తెలుగు ఇండస్ట్రీలో మొదలైంది’’ అన్నారు ఎన్టీఆర్. ఆయన హీరోగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ నిర్మించిన ‘జై లవకుశ’ జయోత్సవం సోమవారం జరిగింది. ఎన్టీఆర్ మాట్లాడుతూ – ‘‘విడుదలైన సిన్మా ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్ లాంటిది. పేషెంట్ బతుకుతాడా? లేదా? అనుకునే చుట్టాలు మేము (సిన్మా టీమ్). ప్రేక్షకులు డాక్టర్లు. విశ్లేషకులు దారినపోయే దానయ్యలు. పేషెంట్ చచ్చిపోయాడని వాళ్లు (ప్రేక్షకులు) చెబితే ఓకే. ఆశలు వదిలేసి, ఒప్పేసుకుంటాం. కానీ, ఆ క్లారిటీ రాకుండా... ముందే పోయాడనో! అదనో! ఇదనో! ఎందుకు? డాక్టర్లను చెప్పనివ్వండి. ఎమర్జెన్సీ వార్డుకి ఇంకొకణ్ణి తెచ్చుకుంటాం. మాకే కాదు, అందరికీ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది. దయచేసి... ఒక సిన్మా వచ్చినప్పుడు ప్రేక్షకుల్ని స్పందించనివ్వండి. అఫ్కోర్స్... 101 శాతం మనందరికీ వాక్ స్వాతంత్య్రం ఉంది. కానీ, మనం మాట్లాడే ఒక మాట అవతలి వ్యక్తికి ఉన్నటువంటి ఆశను ఎంత దిగజారుస్తుందో ఒక్కసారి ఆలోచించండి. నా మాటల్లో తప్పులుంటే క్షమించండి! అర్థం లేకుంటే వదిలేయండి. నా బాధను మీ అందరికీ ఒక్కసారి వెల్లడిద్దామనుకున్నా’’ అన్నారు. చివరగా, ‘‘ఎమర్జెన్సీ వార్డుకి వచ్చిన మా పేషెంట్ ‘జై లవకుశ’ హెల్త్ బ్రహ్మాండంగా ఉందని చెప్పిన మా డాక్టర్లందరికీ ధన్యవాదాలు’’ అని ముగించారు. అంతకు ముందు సినిమా గురించి మాట్లాడుతూ– ‘‘నటుడిగా నేను చాలా గర్వపడే, ఆనందపడే, పూర్తి సంతృప్తిపడే చిత్రాన్ని తీసుకొచ్చినందుకు బాబీకి థ్యాంక్స్. మేమిద్దరం (ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్) అన్నదమ్ముల ఔన్నత్యాన్ని, బంధాన్ని చాటిచెప్పే చిత్రం చేయడం మా అదృష్టం. కోనగారు చెప్పినట్టు ఇదంతా దైవ నిర్ణయమే. బహుశా... దేవుడే నిర్ణయించి బాబీ రూపంలో మాకీ కథను ఇచ్చుంటాడు. ఇక, ‘జై’ ఊయల్లో ఉన్నప్పుడు (క్లైమాక్స్ ఫైట్‌కి ముందు) పోసానిగారి నటన, ఆయన చేసిన ఆ ఒక్క సీన్ ‘జై లవకుశ’ హిట్టవ్వడానికి ముఖ్య కారణమని చెప్పగలను. సినిమా వసూళ్లకు ప్రాముఖ్యత ఇవ్వను. అభిమానులకు నచ్చిందా? లేదా? అనేదే నాకు ముఖ్యం. ‘టెంపర్’ నుంచి ‘జై లవకుశ’ వరకూ మీ అందర్నీ తలెత్తుకునేలా చేశానని భావిస్తున్నా’’ అన్నారు. బాబీ మాట్లాడుతూ– ‘‘తారక్ లేకపోతే ఈ సిన్మా లేదు. అటక మీద ఫైల్లో ఉండుండేది. ‘ఆయన తల్లిదండ్రులకు పాదాభివందనాలు’ అని ఎందుకు అంటున్నానంటే... వాళ్లు జన్మనిచ్చి ఉండకపోతే, నాలాంటి దర్శకుడికి ఇంత పెద్ద గౌరవం వచ్చే సినిమా చేసే అవకాశం వచ్చి ఉండేది కాదు’’ అన్నారు. కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ– ‘‘తమ్ముడితో సిన్మా అనగానే బాధ్యత ఎక్కువనిపించింది. వరుస విజయాల్లో ఉన్నాడు. తనతో ప్రెస్టీజియస్ ఫిల్మ్ చేయాలనుకున్నా. తారక్ తప్ప ఎవరూ ఈ సినిమా చేయలేరని ట్రైలర్ విడుదల రోజే చెప్పా. ఇప్పుడందరూ అదే అంటుంటే హ్యాపీగా ఉంది. తన పర్ఫార్మెన్సే సిన్మాను నిలబెట్టింది. కాసేపు నేను నిర్మాతననుకుంటే... నాన్నా (తారక్) థ్యాంక్స్’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘జనతా గ్యారేజ్’ విడుదలైన తొలి నాలుగు రోజుల్లో నైజాంలో 15.60 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, ‘జై లవకుశ’ నాలుగు రోజుల్లో 18.60 కోట్లు కలెక్ట్ చేసింది. డిస్ట్రిబ్యూటర్‌గా నాకు లెక్కలే ముఖ్యం. ఎంతకు కొన్నాం, ఎంతొస్తుందనేది చూస్తా. ‘జనతా గ్యారేజ్, జై లవకుశ’లను మేమే డిస్ట్రిబ్యూట్ చేశాం. ఎన్టీఆర్ కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్ అవుతుందీ సినిమా’’ అన్నారు. ఈ జయోత్సవంలో నటుడు పోసాని కృష్ణమురళి, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు, రచయిత కోన వెంకట్, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, పాటల రచయితలు చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
ఆ తర్వాతే డ్రామా ఎపిసోడ్ యాడ్ చేశాం!
‘‘ఎన్టీఆర్‌లాంటి గొప్ప నటుడు దొరికాడు కాబట్టి ‘జైలవకుశ’ వంటి బిగ్ స్పాన్ మూవీ చేయడానికి స్కోప్ దొరికింది. లేకపోతే ఆరు నెలల్లో ఇలాంటి సినిమాను కంప్లీట్ చేయడం చాలా కష్టం’’ అని బాబీ (కె.యస్. రవీంద్ర) అన్నారు. ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వం లో కల్యాణ్‌రామ్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ‘జైలవకుశ’కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు బాబీ. మరిన్ని విశేషాలను పంచుకున్నారు. ‘జైలవకుశ’ 30 నిమిషాల కథ ఎప్పట్నుంచో నా దగ్గర ఉంది. కథ చెప్పేటప్పుడు ఎన్టీఆర్‌గారి ఎక్స్ప్రెషన్స్ చూసి ఇంప్రెస్ అయ్యారనుకున్నా. అది నిజమైంది. వారం రోజుల తర్వాత ఆయన్నుంచి పిలుపొచ్చింది. వెంటనే సినిమా స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. ఎగై్జట్ అయ్యాను. క్లైమాక్స్ గురించి నేను, తారక్ (ఎన్టీఆర్), కల్యాణ్‌రామ్‌గారు చాలా డిస్కస్ చేసుకున్నాం. అనుకున్నట్లుగానే క్లైమాక్స్ తీశాం. జై క్యారెక్టర్ చనిపోకపోయి ఉన్నట్లయితే ఇది సాధారణ సినిమా అయ్యుండేది. క్లైమాక్స్ విషయంలో ఎన్టీఆర్‌కి ఎలాంటి అపనమ్మకం లేదు. ఆయన అనుకున్నట్లుగానే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో కీలకమైన ముగ్గురు అన్నదమ్ముల మధ్య వచ్చే నాటకం సీన్ కథ చెప్పినప్పుడు అనుకోలేదు. అయితే కథను డిస్కస్ చేసే టైమ్‌లో ఓసారి ఎన్టీఆర్‌గారిని కలిశాను. అదే టైమ్‌లో కల్యాణ్‌రామ్, హరిగారు కూడా అక్కడే ఉన్నారు. నాటకాల కారణంగా విడిపోయిన అన్నదమ్ములు తిరిగి నాటకాలతోనే కలిస్తే బాగుంటుంది కదా అనుకున్నాం. అప్పుడే ఆ డ్రామా ఎపిసోడ్ యాడ్ చేశాం. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ లీనమై నటించడం వల్ల స్క్రిప్ట్ దశలో ఉన్న కష్టం మేకింగ్ సమయంలో కనిపించలేదు. ముందుగా జై పాత్రకే గుర్తింపు వస్తుందనుకున్నప్పటికీ, లవ, కుశ పాత్రలకు కూడా మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది. సినిమా రిలీజైన రోజు నేను ఎన్టీఆర్గారింట్లో రాజమౌళిగారిని కలిశాను. ఆయన దాదాపు అరగంటసేపు ఈ సినిమా గురించే మాట్లాడారు. చైల్డ్ ఎపిసోడ్ బాగుందన్నారు. ఆయన మెచ్చుకోవడం చాలా ఆనందం కలిగించింది. నెక్ట్స్ మూవీ గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. రెండు నెలలు గ్యాప్ తీసుకుందామని అనుకుంటున్నాను. -
హిట్ చేసినందుకు ధన్యవాదాలు
జై లవ కుశ చిత్రం విజయంతో నటి నివేధితా థామస్ తెగసంబర పడుతున్నారు. తాను నటించి మూడు చిత్రాలు హిట్ చేసినందుకు అభిమానులకు ట్విట్టర్లో ఓ లేఖ పోస్ట్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. 'ఒక్క సినిమా హిట్ అవ్వడం స్పెషల్. నా మొదటి మూడు చిత్రాలని ఆదరించారు. తెలుగు చిత్రపరిశ్రమలో 'మా అమ్మాయి' అని పిలవడం కన్నా పెద్ద అభినందన ఏమీ ఉండదు. అది నా అదృష్టంగా భావిస్తున్నా. నా అభిమానులు, కుటుంబ సభ్యులు అయిపోయారు. మీకు ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే. జై లవ కుశని ఇంత బాగా ఆదరించినందుకు కృతజ్ఞతలు. మరో చిత్రంలో ఓ మంచి పాత్రతో మీ ముందుకు వస్తా' అని ప్రేమతో మీ నివేధితా థామస్ అంటూ లేఖలో పేర్కొన్నారు. Thank you all :) pic.twitter.com/PiwN5n1Xge — Nivetha Thomas (@i_nivethathomas) 23 September 2017 -
రెండేళ్ల కష్టాన్నే మీరిప్పుడు చూస్తున్నారు!
‘‘గ్లామర్, పర్ఫార్మెన్స్... మీ ఓటు దేనికి? అనడిగితే... హీరోయిన్స్ ఎవరైనా రెండోదానికే ఓటేస్తారు. మంచి క్యారెక్టర్స్ చేయాలనుందని చెబుతారు. నేనూ అంతే. కానీ, తెలుగు సినిమాల్లో అలాంటి పాత్రలు దొరకడం కొంచెం కష్టం. నాకు దొరుకుతున్నాయి. ‘సుప్రీమ్’లో బెల్లం శ్రీదేవిగా నటనకు ఆస్కారమున్న పాత్రలోనూ, కొన్ని సిన్మాల్లో గ్లామరస్‌గా కనిపించా. గ్లామర్, పర్ఫార్మెన్స్... రెండిటినీ నేను ఎంజాయ్ చేస్తా’’ అన్నారు హీరోయిన్ రాశీ ఖన్నా. ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మించిన ‘జై లవకుశ’లో ఓ హీరోయిన్గా నటించారీమె. వచ్చే గురువారం (ఈ నెల 21న) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా రాశీ ఖన్నాతో చిట్‌చాట్... ► ట్రైలర్లో మీ ఫ్రెండ్‌తో నిశ్చితార్థానికి రెడీ అయ్యి, పీటల మీద కూర్చున్నాక ‘లవ’ మీకు ఐలవ్యూ చెబుతాడు... అతన్నెలా లవ్ చేశారు? (నవ్వుతూ...) సినిమా చూస్తే తెలుస్తుందది. ఇప్పుడు చెబితే... సినిమా చూస్తున్నప్పుడు కిక్ ఏముంటుంది? ► పోనీ, మీ పాత్రేంటో చెప్తారా? ప్రియ అనే అమ్మాయిగా నటించా. మ్యారేజ్ బ్యూరో నడుపుతుంటుంది. ప్రచార చిత్రాల్లో చూపించినట్టుగా ‘లవ’ ప్రేయసి. ► జై, లవ, కుశ... మూడు పాత్రల్లో మీకేది నచ్చింది? సెట్స్‌లో ఎన్టీఆర్ ఎలా ఉండేవారు? మూడింటిలో ఒకటి సెలక్ట్ చేయడం కష్టమే. కానీ, నాకు ‘జై’ అంటే ఇష్టం. ‘ఎన్టీఆర్ ఈజ్ ఎ బ్రిలియంట్ యాక్టర్’ అని అందరూ చెబుతుంటే విన్నా. సెట్స్‌లో లైవ్‌గా నేనే చూశాను. హి ఈజ్ వెరీ ఎనర్జిటిక్, డెడికేటెడ్, టాలెంటెడ్ అండ్ ప్యాషనేటెడ్! ఇప్పటికి ఇటువంటి మాటలు వందసార్లు వినుంటారు. కానీ, నేను లైవ్‌గా చూశా. ఒక్కో రోజు సెట్స్‌లో 70 డ్రస్సులు ఛేంజ్ చేసుకునేవారు. ఎంతో ఓపికగా ఉంటే తప్ప అలా చేయలేం. ఓ పక్క సినిమా... మరో పక్క బిగ్ బాస్... నిద్ర లేకున్నా ఎక్కడా ఎనర్జీ తగ్గకుండా షూటింగ్ చేసేవారు. ఎన్టీఆర్ డెడికేషన్, హార్డ్‌వర్క్‌కి హ్యాట్సాఫ్. ► స్టార్... యాక్టర్... డ్యాన్సర్... ఎన్టీఆర్‌లో మీరు ఇష్టపడేది? అతని వ్యక్తిత్వం ఇష్టం. వెరీ డౌన్ టు ఎర్త్! చాలా మంచి వ్యక్తి. గర్వం అనేది అసలు లేదు. ► ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేయడానికి కష్టపడ్డారా? ఆల్రెడీ సాయిధరమ్ తేజ్, రామ్‌లతో సిన్మాలు చేశా కదా. అందువల్ల, అంత కష్టంగా అనిపించలేదు. కానీ, కొంచెం కష్టమే. మేనేజ్ చేశా! ► మీరు, నివేథా థామస్, నందిత... ముగ్గురు హీరోయిన్లున్నారు. మీ పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది? నా పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందా? లేదా? అనే భయం ముందు నాలోనూ ఉండేది. కానీ, బాబీ ప్రతి పాత్రను బాగా రాశారు. అతను కథ చెప్పినప్పుడు నా పాత్ర బాగా నచ్చింది. నాతో పాటు మిగతా పాత్రలకూ ఇంపార్టెన్స్ ఉంది! సినిమా చూస్తే... అరే, రాశీ పాత్ర పాసింగ్ క్లౌడ్‌లా ఉందని ఎవరూ అనుకోరు. ‘ప్రియ’ ఎవ్వరినీ డిజప్పాయింట్ చేయదు. నివేథా పాత్ర కూడా బాగుంటుంది. సెట్స్‌లో తనని కలవడానికి ముందే నేను ‘నిన్ను కోరి’ చూశా. నువ్వు చాలా దూరం వెళ్తావనీ, నటిగా మరింత పేరు తెచ్చుకుంటావనీ నివేథాతో చెప్పా! షి ఈజ్ ఫ్రెండ్లీ. ► తెలుగు బాగా మాట్లాడుతున్నారు. డబ్బింగ్ ఎప్పుడు చెబుతారు? నాకూ చెప్పాలనుంది. బాబీ కూడా డబ్బింగ్ చెప్పమన్నారు. కానీ, టైమ్ లేదు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్నా. బిజీగా ఉండడంతో చెప్పలేకపోయా! మోహన్‌లాల్‌గారితో మలయాళంలో ‘విలన్’ చేయడం మంచి ఎక్స్పీరియన్స్. ► దేవిశ్రీ స్టార్స్‌తో పాటలు పాడిస్తారు. మీరు సింగర్ కూడానూ! ఇందులో ఒక్క పాట కూడా పాడలేదెందుకు? తారక్‌తో, నాతో ‘ట్రింగ్... ట్రింగ్..’ పాటను దేవిశ్రీ పాడించాలనుకున్నారు. అప్పుడు తారక్ ‘బిగ్ బాస్’తో బిజీ. సో, కుదరలేదు. వరుణ్‌తేజ్‌తో నటిస్తున్న ‘తొలిప్రేమ’లో పాడుతున్నా. ‘ఊహలు గుసగుసలాడే’ తర్వాత నేను చేస్తున్న ప్రేమకథా చిత్రమది. ‘విలన్ ’లో టైటిల్ సాంగ్, నారా రోహిత్ ‘బాలకృష్ణుడు’లో రెండు పాటలు పాడా. ► ‘రాజా... ది గ్రేట్’లో స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తున్నారు. కథేంటి? ఓ పాటలో చిన్న అతిథి పాత్ర చేశా. దర్శకుడు అనిల్ రావిపూడి అడిగితే నేను, సాయిధరమ్ తేజ్ చిన్న బిట్లో స్టెప్పులేశామంతే. దీనికి నేను చాలా రెమ్యునరేషన్ తీసుకున్నానని కొందరు రాశారు. ► రీసెంట్గా రెమ్యునరేషన్ పెంచారని టాక్? ‘జై లవ కుశ’ తర్వాత తప్పకుండా రెమ్యునరేషన్ పెరుగుతుంది! కానీ, ఎంతని మాత్రం అడగొద్దు! ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ► ఏంటి... ఈ మధ్య బాగా సన్నబడ్డారు? ఫిట్నెస్ కోసమే. నేనేమీ ఒక్క రోజులో సన్నబడలేదు. రెండేళ్ల నుంచి కష్టపడుతున్నా. రిజల్ట్ ఇప్పుడు కనబడుతోంది. -
తీన్ తారక్
స్టీరియోఫోనిక్లో అయితే రెండు వినపడతాయి ఇది 2డీలో 3డీ.. అంటే... కళ్లజోడు పెట్టుకోకుండానే ఎన్టీఆర్ మూడు డైమన్షన్స్‌లో కనపడతాడు చూసి ‘జై’ కొట్టాల్సిందే... చూసినంతసేపు లవ్ చేయాల్సిందే చూశాక ఖుష్ అవ్వాల్సిందే. జై లవకుశ... తీన్ తారక్... ఎన్టీఆర్. ‘జై లవకుశ’ల కహానీ ఏంటి? ఎన్టీఆర్‌లాంటి ఎనర్జిటిక్ హీరో సింగిల్ రోల్లో కనిపించినా సూపరే. ఇక, డబుల్ రోల్లో ‘అదుర్స్’. ఏకంగా ట్రిపుల్ రోల్స్ అంటే దుమ్ము దుమారమే. అందుకే ‘జై లవకుశ’పై బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ వీర లెవల్లో రెచ్చిపోతారని ఫ్యాన్స్ ఫిక్సయ్యారు. ఇంతకీ, ఈ ‘జై లవకుశ’ కథేంటి? సినిమా రిలీజ్‌కు ముందే ఫుల్ స్టోరీ చెప్పేస్తే ఎలా? జస్ట్ లైన్ తెలుసుకుందాం. ఇది ముగ్గురు అన్నదమ్ముల (జై, లవ, కుశ) కథ. విధి వీళ్ల పట్ల చిన్న చూపు చూడటంతో విడిపోతారు. ఫైనల్‌గా ఎలా కలుసుకున్నారు?... అనేది కథ అట. బోలెడన్ని ట్విస్టులతో ఈ లైన్‌ని ఓ స్టోరీగా రాసుకున్నారట. ఒక ట్విస్ట్ ఏంటంటే.. సెకండాఫ్‌లో మూడు పాత్రలూ ఒక పాత్రలా మారి, కన్ఫ్యూజ్ చేసే సీన్స్ ఉన్నాయట. ఈ సీన్స్ ఆడియన్స్‌ని ఫుల్‌గా ఎంటర్టైన్ చేస్తాయట. అన్నదమ్ముల కాంబినేషన్లో ఫస్ట్ సినిమా చిత్రదర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) గతేడాది అక్టోబర్‌లో ఎన్టీఆర్–కల్యాణ్‌రామ్‌లకు ఈ స్టోరీ లైన్ చెప్పారు. లైన్ నచ్చడంతో డెవలప్ చేయమన్నారు. డిసెంబర్‌కి బౌండ్ స్క్రిప్ట్ రెడీ. కథ విన్నాక అన్నదమ్ములు... అంటే కల్యాణ్‌రామ్–ఎన్టీఆర్‌లు ‘నందమూరి తారక రామారావు ఆర్ట్స్’ బేనర్‌పై ఈ సినిమా నిర్మించాలనుకున్నారు. అన్నయ్య ప్రొడ్యూసర్. తమ్ముడు హీరో. అన్నదమ్ములిద్దరి కాంబినేషన్లో ఇది ఫస్ట్ సినిమా. అది కూడా అన్నదమ్ముల నేపథ్యం ఉన్న సినిమా కావడం విశేషం. గెటప్, మేకప్, కాస్ట్యూమ్స్, షెడ్యూల్స్, ఇలా రెండు నెలల పాటు పక్కా ప్లాన్ చేసుకుని, మార్చిలో షూటింగ్ మొదలుపెట్టేశారు. షూటింగ్‌కి దాదాపు 150 రోజులు పట్టిందని టాక్. ఎన్టీఆర్ ట్రిపుల్కి 150 కాస్ట్యూమ్స్ జనరల్‌గా సింగిల్ రోల్ అంటే హీరోకి 40 నుంచి 50 కాస్ట్యూమ్స్ తయారు చేయిస్తారు. ఇక, ట్రిపుల్ రోల్ అంటే మాటలా? ఎన్టీఆర్ చేసిన మూడు క్యారెక్టర్స్‌కి 130 నుంచి 150 కాస్ట్యూమ్స్ కుట్టించారు. కాస్ట్యూమ్స్ అన్నింటినీ డిజైనర్ అశ్విన్ మాల్వే తయారు చేశారు. ఇంట్రస్టింగ్ పాయింట్ ఏంటంటే... ‘జై లవకుశ’లు ఒకే రకం డ్రెస్సులో కనిపించే సీన్స్ కొన్ని ఉన్నాయట. ఆ సీన్స్ ఐ–ఫీస్ట్ అంటున్నారు. ‘జై లవకుశ’ల స్కిన్ టోన్ డిఫరెంట్! జనరల్‌గా హీరో ఒకటికన్నా ఎక్కువ క్యారెక్టర్స్‌ని చేసినప్పుడు ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్‌గా ఉండేలా చూసుకుంటారు. కానీ, ఇక్కడ ‘జై–లవ–కుశ’ల రంగు కూడా డిఫరెంట్. ‘జై’ కొంచెం నల్లగా, ‘లవ’ తెల్లగా, ‘కుశ’ మధ్యస్తంగా కనిపిస్తారట. ఈ తేడా చూపించడం కోసం హాలీవుడ్ నుంచి వాన్స్ హార్ట్‌వెల్‌ని ఇండియాకి రప్పించారు. హాలీవుడ్ మూవీస్ ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’, ‘ఐరన్ మ్యాన్’, ‘లైఫ్ ఆఫ్ పై’ తదితర చిత్రాల్లో ఆర్టిస్టులకు ఈయన ప్రొస్థెటిక్ మేకప్ చేశారు. వాన్స్ హార్ట్వెల్ ‘జై లవకుశ’కు మేకప్ సూపర్వైజర్గా వ్యవహరించారు. 14 షాట్స్... 42 కాస్ట్యూమ్స్ జై లవకుశ... ఈ మూడు పాత్రలకు సంబంధించిన సీన్స్‌ని ఒకే రోజున తీసినప్పుడు ఎన్టీఆర్‌కి తంటాలే. ఉదయం 6 గంటలకు మొదలుపెడితే రాత్రి 2 గంటల వరకూ మూడు పాత్రల చిత్రీకరణకు పట్టేదట. ఒకరోజు మూడు పాత్రల మీద 14 షాట్స్ తీస్తే 14 ఇంటూ 3 కాస్ట్యూమ్స్... మొత్తం 42 డ్రెస్సులు మార్చుకున్నారట ఎన్టీఆర్. నిజంగా చాలా ఓపిక కావాలండీ బాబూ. అలాగే మూడు పాత్రల హెయిర్ స్టైల్ వేరు కావడంతో స్టైలింగ్‌కి కూడా బాగా టైమ్ పట్టేదట. ఒక్కో క్యారెక్టర్ హెయిర్ స్టైల్‌కి గంట పట్టేదట. ఎన్టీఆర్ వెరైటీ హెయిర్‌స్టైల్‌తో హ్యాండ్సమ్గా కనిపించిన ‘నాన్నకు ప్రేమతో..’కి స్టైలిస్ట్‌గా చేసిన హకీమ్ అలీయే ఈ చిత్రానికీ హెయిర్ స్టైలిస్ట్. డ్రామా కంపెనీలో ‘జై లవకుశ’లు సినిమాలో ఇంట్రస్టింగ్ ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. అందులో డ్రామా కంపెనీ ఎపిసోడ్ ఒకటని భోగట్టా! ఈ నాటకాల కంపెనీతో జై, లవకుశలకు ఓ లింక్ ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలనుందా? వెయిట్ అండ్ సీ. అవుటాఫ్ కంట్రీలో ఆడియో వర్క్ మామూలుగా మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే సమ్ టైమ్స్ నెల పైనే పడుతుంది. ఈ సినిమాకి పట్టింది జస్ట్ వారం రోజులు మాత్రమే. ఎన్టీఆర్–బాబీ–మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఆడియో ఫైనలైజ్ చేయడం కోసం అవుటాఫ్ కంట్రీ వెళ్లారు. అక్కడ వారం రోజులు ఉన్నారని సమాచారం. అక్కడే నాలుగు ట్యూన్స్ ఫైనలైజ్ చేసుకుని, ఇండియా వచ్చారు. ఇక్కడికొచ్చాక దేవి ఐటమ్ సాంగ్ కంపోజ్ చేశారు. ఈ పాటలోనే మిల్కీ బ్యూటీ తమన్నా కనువిందు చేస్తారు. ఈ పాట కోసం భారీ సెట్ వేశారు. ఈ పాటలో తమన్నా చిందేసింది జైతోనే అని సమాచారం. హీరోయిన్లను ఎలా సెలక్ట్ చేశారంటే? ఈ సినిమాలో 20, 30 సినిమాలు చేసిన కథానాయిక లను కాకుండా ఇప్పుడిప్పుడే పైకొస్తున్న, వీలైతే ఒకట్రెండు సినిమాలు మాత్రమే చేసిన నాయికలను తీసుకోవాలను కున్నారట. ఎవరైతే బాగుంటుందా? అనుకుంటున్న టైమ్ లో నాని ‘జెంటిల్మన్’ రిలీజైంది. అందులో మలయాళ భామ నివేథా థామస్ యాక్టింగ్ సూపర్బ్. ఈ చిత్రంలో మంచి పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న కథానాయిక పాత్ర కోసం ఆమెను తీసుకున్నారు. అలాగే, పర్ఫార్మెన్స్ ప్లస్ గ్లామర్... రెంటికీ స్కోప్ ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ కోసం పలు పేర్లను పరిశీలించారు. సరిగ్గా అప్పుడే బొద్దుగుమ్మ రాశీఖన్నా స్లిమ్‌గా మారి, ఫొటోషూట్ చేయించుకున్న ఫొటోలు బయటికొచ్చాయట. అంతే... రాశీ ఖన్నాను ఫిక్స్ చేశారు. నందితను ఓ నాయికగా తీసుకున్నారు. నాన్‌స్టాప్ టు నత్తి... ఏదైనా! నందమూరి కుటుంబం అంటే పవర్ఫుల్ డైలాగ్స్‌కి కేరాఫ్ అడ్రస్ అన్నట్లు. ఆ కుటుంబం నుంచి వచ్చిన ఎన్టీఆర్‌కి నాన్‌స్టాప్‌గా డైలాగులు పలికే కెపాసిటీ ఉంది. అలాంటిది ఆయన్ను నత్తిగా నత్తిగా మాట్లాడమంటే? కొంచెం కాదు... చాలా కష్టం. కానీ, సిన్మా కోసం ఎంతైనా కష్టపడే మనస్తత్వం ఉన్న నటుడు ఎన్టీఆర్. అందుకే నత్తిగా మాట్లాడటం ప్రాక్టీస్ చేశారు. దీనికోసం ఎవరి హెల్పూ తీసుకోలేదట. తనంతట తాను ప్రాక్టీస్ చేసి, వాయిస్ రికార్డ్ చేసేవారు. ఫైనల్లీ... వాటిలో ‘ది బెస్ట్’ అనిపించినది సెలక్ట్ చేసుకుని, యూనిట్ సభ్యులకు వినిపిస్తే అందరూ ఆశ్చర్యపోయారట. ‘ఆ రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాల... ఈ రావణున్ని సంపాలంటే సముద్రం అంత దద్ద.. ధైర్యం ఉండాల... ఉందా’ అంటూ ‘జై’ పాత్ర కోసం ఎన్టీఆర్ నత్తి నత్తిగా మాట్లాడిన టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది. ‘జై’ టీజర్: జూలై 6న రిలీజైంది. ఇప్పటివరకు యూట్యూబ్‌లో సుమారు కోటీ 75 లక్షలమంది చూశారు. ‘లవ’ టీజర్: ఆగస్టు 24న విడుదలైంది. యూట్యూబ్‌లో అరవై ఆరు లక్షలమందికి పైగా చూశారు. ‘కుశ’ టీజర్: మూడు రోజుల క్రితం (సెప్టెంబర్ 7న) విడుదలైంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్ లిస్టులో ట్రెండ్ అవుతోంది. శనివారం రాత్రి 7 గంటల వరకు సుమారు 27 లక్షల మంది చూశారు. క్వారీలో రిస్క్ ఈ సినిమాలో రిస్కీ ఫైట్స్ నాలుగైదు ఉన్నాయి. వాటిలో క్వారీ ఫైట్ ఒకటి. ఈ ఫైట్ ఎన్టీఆర్ ఒళ్లు హూనం చేసింది. కాళ్లకు అక్కడక్కడా దెబ్బలు తగిలాయి. అయినా నో రెస్ట్. పెయిన్ కిల్లర్స్ వేసుకుని ఫైట్ లాగించేశారట. ఈ ఫైట్‌తో పాటు మిగతా ఫైట్స్ థ్రిల్‌కి గురి చేస్తాయట. ఎన్టీఆర్ కెరీర్లో హై బడ్జెట్ మూవీ ఇప్పటివరకూ ఎన్టీఆర్ చేసిన సినిమాలన్నింటì కన్నా ఇది బడ్జెట్ ఎక్కువ. తమ్ముడి మీద ప్రేమతో అన్న ఖర్చుపెట్టారేమో అనుకోవద్దు. కథ అంత డిమాండ్ చేసిందట. ఎంత అంటే? 80 కోట్ల రూపాయలని భోగట్టా. థియేట్రికల్, డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ అందుకు తగ్గట్టుగానే సేల్ అయ్యాయని టాక్. శాటిలైట్ రైట్స్‌ను దాదాపు 15 కోట్లకు జెమినీ టీవీ దక్కించుకుందట. థియేట్రికల్ రైట్స్ 86 కోట్లకు సేల్ అయ్యాయని టాక్. హిందీ డబ్బింగ్ రైట్స్ 12 కోట్ల రూపాయలని సమాచారం. మొత్తంగా 113 కోట్లు. అంటే.. రిలీజ్‌కు ముందే దగ్గర దగ్గర 30 కోట్లు లాభం అని టాక్. రిలీజయ్యాక కలెక్షన్స్ రేంజ్ రికార్డ్ స్థాయిలో ఉంటుందని అంచనా. ఒక్క ఎన్టీఆర్ స్క్రీన్ మీద ముగ్గురిలా ఎలా కనిపిస్తాడు? ఏముంది? ఒకరు ఒరిజినల్... మిగతా రెండు పాత్రలనూ డూప్‌తో షూట్ చేసి ఉంటారనుకుంటున్నారా? అఫ్కోర్స్, అలా కూడా చేయొచ్చు. కానీ, ఒరిజినల్ ఎన్టీఆర్ స్థాయిలో డూప్స్ యాక్ట్ చేయగలుగుతారా? అందుకే ‘జై లవకుశ’లో డూప్ షాట్స్ చాలా చాలా తక్కువ. మరి.. ఒకే ఎన్టీఆర్ మూడు పాత్రల్లో ఒకేసారి స్క్రీన్‌పై ఎలా కనిపించారు? ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా చేసిన ఛోటా కె. నాయుడు ఆ టెక్నిక్ గురించి చెప్పారు. ఈ సినిమా గురించి ఆయన మాటల్లో... ‘‘ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ‘అదుర్స్’ మూవీకి నేనే కెమెరామేన్. ఆ సినిమాలో ఇద్దరు ఎన్టీఆర్‌లు కనిపించే సీన్స్ తక్కువ. కానీ, ‘జై లవకుశ’ సినిమా సెకండాఫ్‌లో ఒకేసారి మూడు పాత్రలు కనిపించే సీన్స్ ఎక్కువ. లవ, కుశ పాత్రలు ఓకే కానీ, ‘జై’ క్యారెక్టర్ షూట్ మాత్రం టెన్షన్‌గా అనిపించేది. రావణాసురుడి షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అది. ఫుల్ ఎమోషనల్‌గా ఉంటుంది. ఈ క్యారెక్టర్ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న లవ, కుశ కూడా అందుకు తగ్గట్టుగా రియాక్ట్ అవుతుంటారు. డైలాగ్స్ కూడా ఉంటాయి. డూప్స్‌తో వర్కవుట్ అవ్వదు. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్‌ని ఎవరూ మ్యాచ్ చేయలేరు. అందుకే ముందు ఒక క్యారెక్టర్ని లైవ్‌లో షూట్ చేసి, మిగతా రెండు క్యారెక్టర్స్‌ని గ్రీన్ మ్యాట్ బ్యాక్‌డ్రాప్‌లో షూట్ చేసేవాళ్లం. ఆ తర్వాత సీజీ వర్క్‌లో లైవ్‌లో షూట్ చేసిన క్యారెక్టర్‌తో గ్రీన్ మ్యాట్ బ్యాక్‌డ్రాప్‌లో షూట్ చేసిన క్యారెక్టర్స్‌ని మ్యాచ్ చేసేవాళ్లు. సో.. ఎక్కువ క్రెడిట్ సీజీ వర్క్‌కే ఇస్తా. హరి (కల్యాణ్‌రామ్ బంధువు)కి సొంత సీజీ స్టూడియో ఉంది. అక్కడ అనిల్ ఆధ్వర్యంలో జరిగిన సీజీ వర్క్ ఫెంటాస్టిక్. నిజానికి టెక్నికల్‌గా ఏం చేశాం? అనేది మాటల్లో చెప్పడం కష్టం. విజువల్‌గా చూస్తేనే అర్థమవుతుంది. ఈ సినిమాకి కొత్త కెమేరాలు వాడలేదు. అయితే ఆస్ట్రేలియా, ముంబై నుంచి ‘మోషన్ కంట్రోల్ కెమెరా’ని తెప్పించాం. అది ఎందుకంటే, జనరల్‌గా షూటింగ్లో క్యారెక్టర్స్ మూవ్ అవుతాయి. కానీ, కెమెరా ఒకేచోట ఉంటుంది. కానీ, ఈ సినిమాకి కెమెరానే ఎక్కువగా మూవ్ అయింది. ఇది చాలా ఎక్స్పెన్సివ్ కెమెరా. రెంటే ఐదు కోట్లు. టోటల్లీ ఈ మూవీ అందరికీ ఓ ఛాలెంజ్. ఎన్టీఆర్‌కి పెద్ద సవాల్. ఒకే రోజున మూడు పాత్రలు చేసినప్పుడు ఇన్‌డోర్‌లో మేం లైట్ సెట్ చేసుకుంటాం కానీ, అవుట్డోర్ అప్పుడు ఇబ్బందిపడే వాళ్లం. ఎన్టీఆర్ లవ, కుశ పాత్రలు చేశాక, సరిగ్గా ‘జై’ షూట్ మొదలుపెట్టేటప్పటికి సన్ లైట్ డ్రాప్ అయ్యేది. మళ్లీ ఆ లైట్ వచ్చేంతవరకూ వెయిట్ చేయాలి. మాకంటే ఓకే. కానీ, ఓ ఆర్టిస్ట్ అంతసేపు ఆ క్యారెక్టర్ మూడ్‌లో ఉండటం మామూలు విషయం కాదు. చాలా ఓపిక కావాలి. అందుకే ఎన్టీఆర్‌కు హ్యాట్సాఫ్. ఈ సిన్మాలో ఎన్టీఆర్ ‘బెస్ట్ పర్ఫార్మెన్స్’ని చూస్తారు. – డి.జి. భవాని -
కొట్టేయడంతో పాటు కొట్టడమూ వచ్చురా!
కుశ... ఓ మంచి దొంగ! అంటే... చిలిపి కృష్ణుడు టైప్ అన్నమాట. కృష్ణుడు వెన్న దొంగిలిస్తే... మనోడు డబ్బులు దోచేస్తాడు. ఆ డబ్బులతో బాధల్లో ఉన్నోళ్ల బాధలను తీరుస్తాడు. ఒకవేళ ఎవరైనా మనోడి దగ్గర్నుంచి డబ్బులు కొట్టేయాలని చూస్తే చితక్కొడతాడు. టీజర్ చూస్తే అచ్చం అలానే ఉన్నాడు మరి! ముఖ్యంగా ‘కొట్టేయడంతో పాటు కొట్టడం కూడా వచ్చురా’ అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న సినిమా ‘జై లవ కుశ’. ఇందులో ముగ్గురన్నదమ్ములుగా ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ జై, లవ టీజర్లు విడుదలైన విషయం తెలిసిందే. కుశ టీజర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. రేపు (ఆదివారం) జరగబోయే ప్రీ–రిలీజ్ వేడుకలో ట్రైలర్‌ను విడుదల చేస్తారట. ఈ సినిమా విజయదశమి కానుకగా ఈ నెల 21న విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
ముగ్గురూ ఒక్కటై
‘ఐకమత్యం మహాబలం’ అన్నారు పెద్దలు. అదెలా ఉంటుందో చూపిస్తామంటున్నారు ముగ్గురు అన్నదమ్ములు. వాళ్లే... జై, లవ, కుశ. ఈ ముగ్గురూ కలసి ఐకమత్యంగా శత్రువులను ఎలా అంతం చేశారనేది క్లుప్తంగా ‘జై లవ కుశ’ కథ. ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న చిత్రమిది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ముగ్గురిలో జై, లవకుమార్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయనేది టీజర్స్ ద్వారా తెలిసింది. ఇప్పుడు కుశ టీజర్ కోసం ప్రేక్షకులు వెయిటింగ్. మూడు పాత్రలు వేర్వేరు, పాత్ర చిత్రణలు వేర్వేరు అయినప్పటికీ... వాళ్ల టార్గెట్ మాత్రం ఒక్కరే! అదెవరు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ నెల 10న థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. అందులో ఏమైనా క్లూ ఇస్తారేమో? చూడాలి! 10నే ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించిన పాటల్ని ఇటీవలే విడుదల చేశారు. ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నారు. -
‘జై లవకుశ’ ఆడియో లాంచ్
-
నాన్నగారి లవకుశలా సూపర్ హిట్టవ్వాలి
– హరికృష్ణ ‘నాన్నగారు (సీనియర్ ఎన్టీఆర్) పిల్లలకు ఇచ్చిన ఆస్తి మీ (ప్రేక్షకుల) అభిమానమే. మీ వల్లే నందమూరి వంశం ముందుకెళ్తోంది. ఈ సినిమా పేరు చూస్తుంటే... నాన్నగారు నటించిన ‘లవకుశ’ గుర్తొస్తోంది. ఆ సినిమాలా ఇదీ సూపర్ హిట్టవ్వాలి. అన్నదమ్ముల నేపథ్యంలో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రమిది. ఇక్కడ విచిత్రం ఏంటంటే... అన్న నిర్మాత, తమ్ముడు హీరో. రామకృష్ణ స్డూడియోస్‌లో బాలయ్య హీరోగా నేను సినిమాలు నిర్మించిన రోజులు గుర్తొస్తున్నాయి’’ అన్నారు హరికృష్ణ. ఆయన చిన్న కుమారుడు ఎన్టీఆర్ హీరోగా పెద్ద కుమారుడు కల్యాణ్‌రామ్ నిర్మించిన సినిమా ‘జై లవకుశ’. కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఆదివారం హైదరాబాద్‌లో పాటల సీడీలను హరికృష్ణ విడుదల చేశారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘మనసుకు నచ్చింది చేయాలా? ట్రెండ్ ఫాలో కావాలా? ‘జనతా గ్యారేజ్’ తర్వాత కన్ఫ్యూజన్లో పడ్డా. బాబీ కథ చెప్పగానే... మనసుకు నచ్చిందే చేయాలనుకున్నా. అంత ఎమోషన్ ఉందీ సినిమాలో. మా పెద్దన్నయ్య జానకిరామ్‌గారు కూడా ఈ వేదికపై ఉండుంటే... ‘జై లవకుశ’ పేరుకి సార్థకం అయ్యుండేదేమో. భౌతికంగా ఆయన మా మధ్య లేకున్నా అన్నయ్య ఆత్మ ఎప్పుడూ మాతోనే ఉంటుంది. ఈ సినిమా సూపర్‌హిట్ అవ్వాలనే కంటే... నాన్నగారికి 60వ బర్త్‌డే గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నాం. ఈ నెల 2న ఆయన బర్త్‌డే. రెండు అయితే ఏముంది? 21 అయితే ఏముంది? అన్నదమ్ములుగా మేం చేసిన చిత్రమిది. మా నాన్నను, అమ్మలను కూర్చొబెట్టి మేం సాధించిన విజయం ఇదని ఈ సినిమాతో చెప్పాలని మా కోరిక. తప్పకుండా వాళ్లు గర్వపడేలా చేశామని నమ్ముతున్నా. పెదనాన్న, బాబాయ్ కలసి చేసిన చిత్రమని మా పిల్లల్లు చెప్పుకోవాలి. నా కెరీర్లో మంచి సంతృప్తినిచ్చిన చిత్రమిది’’ అన్నారు. ‘‘మా కుటుంబ వేడుక ఇది. తారక్ (ఎన్టీఆర్) గురించి చాలా మాట్లాడాలి. ఈ నెల 10న జరగబోయే ప్రీ–రిలీజ్ వేడుకలో మాట్లాడతా. ఈ 21న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు కల్యాణ్‌రామ్. ‘‘నాకు దర్శకుడిగా మూడో చిత్రమిది. ఎన్టీఆర్ హీరోగా మూడు పాత్రలతో చేశా. ఆయన కథకు న్యాయం చేశారు. అసిస్టెంట్, కో–రైటర్‌గా ఉన్నప్పట్నుంచి కల్యాణ్‌రామ్‌గారితో పరిచయముంది. ఆయన సంస్థలో సినిమా చేయడం హ్యాపీ. దేవిశ్రీ మంచి పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతం ఇచ్చారు’’ అన్నారు బాబీ. ‘‘జై, లవ, కుశ.. ముగ్గురిలా ‘నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్’ల తర్వాత తారక్‌తో మూడో చిత్రమిది. ఓ హీరోకి వరుసగా మూడు సినిమాలు చేయడం నా కెరీర్లో ఇదే తొలిసారి’’ అన్నారు దేవిశ్రీ. నటుడు బ్రహ్మజీ, రచయిత కోనవెంకట్, పాటల రచయితలు చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు. -
త్రీ ఇన్ వన్!
మూడు... ‘జై లవకుశ’లో ఎన్టీఆర్ పోషిస్తున్న పాత్రలు. నటుడొక్కడే. కానీ, పాత్రలు వేర్వేరు, పాత్ర స్వభావాలు, హావభావాలు వేర్వేరు. ఇప్పటివరకూ ముగ్గుర్నీ విడివిడిగా పరిచయం చేశారు. ఇప్పుడు ఒక్క స్టిల్‌లో ముగ్గుర్నీ చూపించారు. స్టిల్ అదిరింది కదూ. -
డైరెక్ట్‌గా మార్కెట్లోకి!
ఎన్టీఆర్, రాశీ ఖన్నా, నివేధా థామస్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జై లవకుశ’. కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా పాటల చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోను సెప్టెంబర్ 3న డైరెక్ట్‌గా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. నిర్మాత కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘జై లవకుశ’ పాటలను గ్రాండ్‌గా రిలీజ్ చేయాలనుకున్నాం. భారీ వర్ష సూచనతో పాటు, పోలీస్ శాఖవారు వినాయక నిమజ్జనంలో నిమగ్నమై ఉండటంతో, అభిమానుల భద్రతకి ప్రాధాన్యం ఇస్తూ, పాటలను డైరెక్ట్‌గా మార్కెట్లోకి విడుదల చేస్తున్నాం. కానీ, సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో ట్రైలర్ రిలీజ్‌ను మాత్రం అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా చేస్తాం’’ అన్నారు. -
అంతా కుశలమే
అభిమానులకు వినాయక చవితి కానుకగా ఎన్టీఆర్ ఓ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అదేంటంటే... ‘కుశ’ లుక్! ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న సినిమా ‘జై లవ కుశ’. ఇందులో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో (జై, లవకుమార్, కుశ) నటిస్తున్న సంగతి తెలిసిందే. చవితి ముందు రోజున లవకుమార్ టీజర్ విడుదల చేసిన ఎన్టీఆర్, చవితి రోజున ‘కుశ’ లుక్ విడుదల చేశారు. ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే... ఇందులో ప్రియా పాత్రలో నటిస్తున్న రాశీ ఖన్నా లుక్‌ను సైతం చవితి రోజునే విడుదల చేశారు. లవ టీజర్, కుశ లుక్, ప్రియా లుక్... ప్రేక్షకులకు ట్రిపుల్ ధమాకా అనే చెప్పాలి. ముఖ్యంగా టీజర్లో ‘మంచితనం... అది పుస్తకాల్లో ఉంటే పాఠం అవుతుంది. మనలో ఉంటే గుణపాఠం అవుతుంది. అదే నా జీవితాన్ని తల్లకిందులు చేసింది’ అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్, ‘జై లవకుశ’ చిత్రబృందం అంతా కుశలమే. -
లవ్లీకుమార్
‘జై’ వచ్చి మూడు నెలలైంది. జోరుగా హల్చల్ చేశాడు. స్టైలిష్‌గా, రఫ్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. సోమవారం ‘లవ’ వచ్చాడు. స్టైలిష్‌గా ఉన్నాడు. అయితే కూల్‌గా కనిపించాడు. ఇక, ‘కుశ’ ఎలా ఉంటాడో రానున్న రోజుల్లో చూస్తాం. హీరోగా కేయస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. ‘జై’ గెటప్‌ని ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా మేలో విడుదల చేశారు. ఇప్పుడు లవకుమార్‌ని చూపించారు. వాస్తవానికి ఈ గెటప్‌కి సంబంధించి ఒక్క పోస్టర్ని మాత్రమే విడుదల చేయాలనుకున్నారు. అయితే, అన్నదమ్ములు కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్లకు రెండు పోస్టర్లు నచ్చాయి. ఏది రిలీజ్ చేస్తే బాగుంటుందా? అని ఆలోచించి.. చివరకు ఎటూ తేల్చుకోలేక అభిమానులకు డబుల్ ధమాకా ఇచ్చేశారు. రెండు ఫొటోలు విడుదల చేశారు. లవ అలియాస్ లవకుమార్ చాలా లవ్లీగా ఉన్నాడు కదూ! ఈ లుక్స్ చూసి అభిమానులు ఆనందపడిపోయారు. దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
సమ సమాజ్ పార్టీలో...!!
యస్... కొత్తగా పుట్టుకొచ్చిన రాజకీయ పార్టీ ‘సమ సమాజ్’కి ఎన్టీఆర్ జై కొట్టారు. జై కొట్టడం ఏంటి? అందులో చేరి ప్రజల వద్దకు వెళ్లారు. తమ పార్టీకి, తమ అభ్యర్థులకు ఓటేయమని ప్రజల్ని అడుగుతున్నారు. ఆల్రెడీ పూణేలో పార్టీ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. పూణెలో ఎందుకు ప్రచారం చేస్తున్నారనే డౌట్ వచ్చిందా? ఎందుకంటే... ‘జై లవకుశ’ సినిమా సెట్ ఒకటి వేసిందక్కడే మరి! యస్... ఎన్టీఆర్ చేరింది రియల్ పార్టీలో కాదు, రీల్ పార్టీలో. ఆయన హీరోగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న సినిమా ‘జై లవకుశ’. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ముగ్గురిలో ఒకరు ‘జై’, సమ సమాజ్ పార్టీ నాయకుడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం పూణెలో ‘జై’ పాత్రధారిపై ముఖ్య సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఓ పక్క ఈ సినిమా షూటింగ్ చేస్తూనే, మరోపక్క వీకెండ్స్‌లో ‘బిగ్ బాస్’ షోను హోస్ట్ చేస్తున్నారు ఎన్టీఆర్. ‘బిగ్ బాస్’ హౌస్ సెట్ కూడా పూణేలోనే ఉంది. -
ఆ ధైర్యం మా తారక్ కి ఉంది...
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ప్రశంసలతో ముంచెత్తారు. ‘జై లవ కుశ’ టీజర్ లో ఎన్టీఆర్ డైలాగ్స్‌కు ఆయన ఫిదా అయిపోయారు. ‘ఇలాంటి పాత్రలు చేయాలన్నా ధ ధ.. ధైర్యం కావాలి..మా తారక్ కి ఉంది. నేనూ ఎదురు చూస్తున్నా ఆ ధైర్యాన్ని తెర మీద చూడడానికి’ అంటూ రాఘవేంద్రరావు ట్విట్ చేశారు. కాగా ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవ కుశ టీజర్ గురువారం రిలీజైన విషయం తెలిసిందే. ఆ టీజర్లో ‘‘ఆ రావణున్ని సంపాలంటే సముద్రం దాటాల... ఈ రావణున్ని సంపాలంటే సముద్రం అంత దద్ద.. ధైర్యం ఉండాల... ఉందా’’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ‘జై’ క్యారెక్టర్ కోసం ఎన్టీఆర్ నత్తి ఉన్నవాడిలా మాట్లాడటం.. డైలాగులు చెప్పడంలో ఎన్టీఆర్ సూపర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. బాబీ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జై, లవ, కుశ అనే మూడు విభిన్నమైన పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. రాశిఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
దద్ద.. ధైర్యం ఉండాల..!
...అవును ఎన్టీఆర్ ఇలానే నత్తినత్తిగా డైలాగ్స్ చెబుతున్నారు. నమ్మకం కుదరకపోతే ‘జై లవ కుశ’ టీజర్ చూస్తే అర్థమవుతుంది. గురువారం రిలీజైన టీజర్లో ‘‘ఆ రావణున్ని సంపాలంటే సముద్రం దాటాల... ఈ రావణున్ని సంపాలంటే సముద్రం అంత దద్ద.. ధైర్యం ఉండాల... ఉందా’’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ‘జై’ క్యారెక్టర్ కోసం ఎన్టీఆర్ నత్తి ఉన్నవాడిలా మాట్లాడటం.. డైలాగులు చెప్పడంలో ఎన్టీఆర్ సూపర్ అని మరోసారి నిరూపితమైంది. కె.ఎస్ రవీంద్ర దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
లీకుతే పీకుతా
ఇండస్ట్రీకి కోపం రాదా మరి! కాస్త అటూ ఇటుగా వంద కోట్లు. అదీ సినిమా స్పెండింగ్. మన వంద రూపాయలు ఎవరైనా కొట్టేస్తేనే... కడుపు రగిలిపోతుంది. పిచ్చి పిచ్చిగా కోపం వచ్చేస్తుంది. కండలు, బండలు లేకపోయినా దొంగను పట్టుకుని ఒకటి పీకాలనిపిస్తుంది. మరి వంద కోట్ల సినిమా లీక్ అయితే.. పీకాలనిపించదా?! రీసెంట్గా లీకైన రెండు సినిమాలు : ‘డీజే’ని ఏకంగా ఫేస్బుక్లో పెట్టారు. ‘జై లవ కుశ’ రఫ్ టీజర్‌ని యూట్యూబ్‌లో ఎక్స్పోజ్ చేశారు. డీజేలో సినిమా బయట పడితే, జై లవ కుశలో క్యారెక్టర్ బయటపడింది. ముక్కలు లీక్ అవడం మామూలే. మొత్తం మూవీనే లీకయితే?! నిర్మాత గుండె 24 ముక్కలౌతుంది. కోట్ల డబ్బు మరి! కష్టం మాత్రం.. తక్కువా?! తేడా వస్తే.. కృష్ణా నగరే మామ.. కృష్ణా నగరే... సీన్ మళ్లీ మొదటికొస్తుంది! డీజే! దువ్వాడ జగన్నాథం. గన్ పెట్టి పేల్చేస్తుంటాడు కొడుకుల్ని. మనిషి కనిపించడు. వాడు చేసే పని మాత్రమే కనిపిస్తుంది. అమ్మాయిల్ని ఏడిపిస్తే టైర్‌పంక్చర్ అవుతుంది. అగ్రో డైమండ్ రొయ్యల నాయుడి బంపర్ బద్దలౌతుంది. పైకి జంధ్యం జగన్నాథం. లోపల జగమెరిగిన జగన్నాథం. స్లోగా పికప్ అయి, ఫాస్ట్‌గా టికెట్లు కోసేస్తున్నాడు. పిక్చర్హిట్. అంతలోనే ఉపద్రవం! డీజే శుక్రవారం రిలీజ్ అయింది. మళ్లీ శుక్రవారంలోపు ఫేస్బుక్లో రీ–రిలీజ్ అయింది. ఫేస్బుక్లో రిలీజ్ అవడం ఏంటి? ‘లీక్’ కదా అవుతుంది! చిన్నముక్కయితే లీక్ అనొచ్చు. మొత్తం సినిమానే లీక్ అయితే.. అదీ రిలీజే! పట్టుకోవాలి. ఎవడు ‘రిలీజ్’ చేశాడో పట్టుకోవాలి. అవుతుందా? అంత ఈజీ ఏం కాదు. పదిమంది డీజేలు కావాలి. ‘దిల్’ రాజుకు అంతమంది డీజేలు ఎక్కడ దొరుకుతారు? పోలీసులకు కంప్లైంట్ చేశాడు. హంట్ మొదలైంది. స్మార్ట్ పోలీసులు చాలా ఫాస్ట్‌గా కేసును డీల్ చేస్తున్నారు. దొంగ దొరికితే ఏమౌతుంది? శిక్ష పడుతుంది. తర్వాత? బెయిల్ దొరుకుతుంది. తర్వాత? ఇంకో సినిమా లీక్ అవుతుంది. సినిమాలు తియ్యాలా? సర్దుకుని వెళ్లిపోవాలా? ఈ లీకుల వెర్రి ఏంటి? ఒకడెవడో చేసే మతిమాలిన పనికి ఇండస్త్రీకి బతుకే లేకుండా పోతుందే! సాయంత్రం ఎనిమిది గంటలు. సాక్షి కార్యాలయంలో సినిమా డెస్క్ బిజీగా ఉంది. ‘ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ’ స్టార్ కమెడియన్ పృథ్వీరాజ్ పర్సనల్ లైఫ్‌పై వస్తున్న వార్తలపై క్లారిటీ కోసం విదేశాల్లో ఉన్న పృథ్వీరాజ్‌తో మాట్లాడుతున్నారు సినిమా పేజ్ ఇన్చార్జి డి.జి.భవాని.అర్జెంట్‌గా దిల్ రాజుతో మాట్లాడాలి! దిల్ రాజు ఒక్కరే కాదు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌తో మాట్లాడాలి. కల్యాణ్‌రామ్‌తో మాట్లాడాలి. శోభుతో మాట్లాడాలి. పైరసీల దెబ్బల్ని, లీకుల తాకిడిని తట్టుకుని నిలబడిన వాళ్లలో ఈ నలుగురూ మెయిన్. సాక్షి ఫోటో జర్నలిస్ట్ శివ మల్లాల రంగంలోకి దిగారు. ‘‘శివా.. చెక్–ఇన్‌లో ఉన్నా. నేనే చేస్తా’’ అన్నారు దిల్ రాజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి. దిల్ రాజు యు.ఎస్. వెళ్తున్నారు. శోభు దొరకడం కష్టం. ఆయన మాస్కోలో ఫిల్మ్ ఫెస్టివల్లో ఉన్నారు. రఫ్ స్కెచ్ కూడా లీకైంది! జై లవ కుశ.హీరో జూనియర్ ఎన్టీఆర్. డైరెక్టర్ బాబీ (కె.ఎస్.రవీంద్ర). డబ్బులు పెడుతోంది నందమూరి కల్యాణ్ రామ్. పిక్చర్ ఇంకా పూర్తవలేదు. సెప్టెంబర్‌లో రిలీజ్ అనుకున్నారు. టీజర్‌ని జూలై మొదటి వారంలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అంతలోనే టీజర్ లీకై పోయింది. టీజర్ కూడా సినిమాలాగే డిఫరెంట్‌గా ఉండబోతోందని కల్యాణ్ ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు. అయితే టీజర్ ఏమీ డిఫరెంట్‌గా లేదు. ఎందుకు లేదంటే.. అది రఫ్ కాపీ. కల్యాణ్ రామ్ షాక్ తిన్నాడు. సైబర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. అప్పటికే నష్టం జరిగిపోయింది. సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ వేస్తున్న క్యారెక్టర్లలో ఒక ముఖ్యమైన క్యారెక్టర్ ఏంటో బయట పడిపోయింది. ‘భయ్యా.. ఇలా ఎలా జరిగింది?’ అడిగారు శివ. ఎలా జరిగిందో కల్యాణ్ చెప్పారు. ఇంటి దొంగే లీక్ చేసేశాడు! ప్రొడక్షన్లో పై నుంచి బాయ్ వరకు అందర్నీ ఫ్యామిలీ మెంబర్‌లానే ట్రీట్ చేస్తాడు ఏ నిర్మాతైనా. ఆ నమ్మకంతోనే ఇంట్లో చోరీ జరిగిపోతుంది. ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ.. డీజే, జై లవ కుశ. సినిమాలపై నడవాల్సిన టాక్.. సినిమాల లీకులపై నడుస్తోంది! ‘వెధవలు’ అన్నారు నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్... లీకులు చేసేవాళ్లను. కూర్చున్న కొమ్మను నరుక్కునేవాళ్లు వెధవలు కాక మరేమిటి? సినిమా రిలీజ్ అయ్యాక లీక్ అయితే కలెక్షన్లు తగ్గిపోయే ప్రమాదం ఉంది. సినిమా రిలీజ్ కాకముందే లీక్ అయితే ప్రేక్షకుల ఆసక్తి పలచబడిపోయే అవకాశం ఉంది. రెండూ నిర్మాతలకు నష్టమే. ‘బాహుబలి 2’ చివరి యుద్ధ సన్నివేశాలు కొన్ని లీక్ అయ్యాక దర్శక నిర్మాతలకు నిద్రపట్టడం మానేసింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే మిస్టరీపై ప్రేక్షకులకు ఉన్న ఉత్కంఠ కన్నా, ‘బాహుబలి – ది కంక్లూజన్’లో ఫైటింగ్ సీన్లు ఎలా లీక్ అయ్యాయనే మిస్టరీనే రాజమౌళి అండ్ టీమ్‌కి కంట కునుకు లేకుండా చేసింది. కష్టాన్ని కొల్లగొడితే ఎవరికైనా కడుపు మండుతుంది. కడుపు కొట్టడమూ కష్టాన్ని కొల్లగొట్టడమూ రెండూ ఒకటే. సినిమా నిర్మాణంలో పడే కష్టం మామూలుగా ఉండదు. ప్రతి ఫ్రేమ్‌లోనూ కష్టం ఉంటుంది. ఇరవైనాలుగు ఫ్రేమ్‌లలో ఇరవై నాలుగు కష్టాలు కలిస్తేనే ఒక సినిమా. ‘హింసించే రాజు 23వ పులకేసి’లా ఇప్పుడు.. సినిమా వాళ్లకు కొత్తగా యాడ్ అయిన 25వ కష్టం.. లీకేజ్. లీకేజ్‌తో కలుపుకొని సినిమాకు ఇప్పుడు కొత్త నిర్వచనం.. 25 ఫ్రేమ్స్! చిన్న లీక్.. పెద్ద సెలబ్రేషన్! సోషల్ మీడియాలో ఒక వర్గం రాత్రీపగలూ మేల్కొనే ఉంటుంది. దానికి పనీపాట ఉండదు. ఒక ప్రాజెక్టు ఉండదు. ఎప్పుడూ ఎగై్జట్‌మెంట్ కోసం చూస్తుంటుంది. చిన్న లీక్ దొరికినా చాలు సెలబ్రేట్ చేసుకుంటుంది. భారీ బడ్జెట్‌తో, భారీ స్టారింగ్‌తో తయారయ్యే సినిమాలను లీక్ చేస్తే అదొక భారీ అచీవ్మెంట్! ఒక లీకు.. ఐదు రూమర్లు తొలిసారి తెలుగు సినిమా ఇండస్ట్రీని కుదిపేసిన అతి భారీ లీక్.. అత్తారింటికి దారేది! 2013లో పిక్చర్ రిలీజ్ అవడానికి నెల ముందే యూట్యూబ్‌కి ఎక్కేసింది! పవన్ కల్యాణ్ స్టార్ హీరో. త్రివిక్రమ్ శ్రీనివాస్.. స్టార్ డైరెక్టర్. ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండే కాంబినేషన్. సినిమాలోని ప్రతి పార్టూ లీకైంది! యూనిట్ సభ్యులకు చూపించలేదు. ప్రివ్యూ వేయలేదు. మరి ఎలా లీకైనట్లు? అత్తారింటికి దారైతే తెలిసింది కానీ, డిజిటల్ దొంగల్ని పట్టుకునే దారే దొరకలేదు. ఎవరు లీక్ చేసి ఉంటారనే దానిపై రూమర్లు బయల్దేరాయి. అందుకు కారణం పవన్ కల్యాణ్! రూమర్ నెం.1 లీకేజ్‌పై పీకే (పవన్ కల్యాణ్) అయితే చాలా ఎమోషల్ అయ్యారు. ‘ఇది పైరసీ కాదు, కాన్స్పిరసీ’ అన్నారు. ‘నేను 365 రోజులూ నా సినిమానే ఆడాలని అనుకోను. కానీ అందరూ అలా లేరు’ అన్నాడు. ఎవరా ‘అందరూ’ అని ఇండస్ట్రీ లోపల, బయట అప్పట్లో పెద్ద పరిశోధన. పవన్ అంటున్న కాన్స్పిరసీ వెనుక నిర్మాత దిల్ రాజు ఉన్నాడని పవన్ అభిమానులు అనుమానించారు. అత్తారింటికి దారేది చిత్రానికి నైజామ్ హక్కుల్ని దిల్ రాజుకు ఇవ్వకుండా హీరో నితిన్ తండ్రికి ఇచ్చినందుకే దిల్ రాజు అలా రివెంజ్ తీర్చుకుని ఉంటాడని వాళ్ల ఎనాలిసిస్. దిల్ రాజు నవ్వేసి ఊరుకున్నారు. రూమర్ నెం.2‘కంచే చేను మేసినట్టు’ అని పీకే ఇంకోమాట కూడా అన్నారు! అంతే, కొన్ని చూపుడువేళ్లు పీకే కుటుంబ సభ్యులవైపు మళ్లాయి. రామ్ చరణ్ అండ్ టీమ్.. లీక్ చేసి ఉండొచ్చని కొందరు అనుమానించారు. రామ్‌చరణ్ నటించిన ‘తుఫాన్’ చిత్రం రిలీజ్ సమయంలో.. ఒకదానికొకటి అడ్డుపడకుండా ఏ పిక్చర్‌ని ముందు రిలీజ్ చెయ్యాలనే విషయంపై తుఫాన్ టీమ్‌కి, అత్తారింటికి దారేది టీమ్‌కి మధ్య జరిగిన చర్చలు ఫెయిల్ అయ్యాయి. దాంతో రామ్‌చరణ్ గ్రూపు పీకే మూవీని లీక్ చేయించిందని ఒక విశ్లేషణ! అబ్బాయ్.. బాబాయి నవ్వుకుని ఊరుకున్నారు. రూమర్ నెం.3 పీకే నోట్లోంచి కాన్స్పిరసీ (కుట్ర) అనే మాట రాగానే జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా ఓ లుక్కు పడింది. ‘రామయ్యా వస్తావయ్యా’కి అత్తారింటికి దారేది గట్టి పోటీ ఇస్తుందన్న భయంతో జూనియర్ ఎన్టీఆర్, అత్తారింటికి దారేది నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఆఫీస్‌లో పని చేసే ఓ కుర్రాడికి డబ్బాశ చూపించి సీడీని బయటికి తెప్పించి లీక్ చేయించాడని ఓ అనుమానం. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ తవ్వకాలకు నవ్వుకుని ఊరుకున్నారు. అత్తారింటికి దారేది లీకేజ్‌లో చివరికి తేలిందేమిటంటే.. అరుణ్ కుమార్ అనే ప్రొడక్షన్ అసిస్టెంట్ ఎడిటింగ్ రూమ్‌లో మూవీని కాపీ చేసుకుని తన కాన్స్టేబుల్ ఫ్రెండ్‌కి ఇచ్చాడనీ, అలా ఆ సినిమా లీక్ అయిందనీ! అయ్యో పాపం..! ‘అత్తారింటికి దారేది’కి ముందు.. ‘ఎవడు’ (రామ్ చరణ్ హీరో) షూటింగ్ జరుగుతుండగానే మూవీలోని ఐటమ్ సాంగ్.. ‘అయ్యో పాపం...’ లీక్ అయింది. అది హిట్ సాంగ్. దానివల్ల నష్టం కన్నా పబ్లిసిటీనే ఎక్కువగా వచ్చింది. లేటెస్టుగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చిత్రం ‘జై లవ కుశ’ టీజర్ లీక్ కావడంపై అయ్యో పాపం అనాల్సి వస్తోంది. పబ్లిసిటీ కన్నా నష్టమే ఇక్కడ ఎక్కువగా జరిగింది. ఎన్టీఆర్లోని విలనిజాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్న టీజర్లో ‘ఫినెస్’ (స్కిల్) లోపించింది. సినిమాను ఏదో హడావుడిగా తోసేయబోతున్నారనే అభిప్రాయానికి తావిచ్చేలా ఏమాత్రం క్వాలిటీ లేకుండా ఉంది. రఫ్ అలానే ఉంటుందని ఫాన్స్‌కు తెలియదా? పది కాలాలు నిలవాలి అంత డబ్బు పెట్టి ఒక నిర్మాత, అంత క్రియేటివిటీ తో ఒక దర్శకుడు, అంత యాక్షన్ చేసి ఒక హీరో.. సినిమాను తీసినప్పుడు.. ఆ కష్టం అంతా ఒక్క లీకేజీకి.. కొట్టుకుపోవడం ఎంత అన్యాయం? ఈ అన్యాయాన్ని సినిమా తీసినవాళ్లే కాదు, చూసే మనం కూడా ప్రశ్నిం చాలి. అప్పుడే పది కాలాల పాటు వాళ్లు మనకు పద్నా లుగు రీళ్ల వినోదాన్ని అందించగలరు. చచ్చిబతికినట్టు ఉంటుంది – బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ప్రముఖ నిర్మాత ‘అత్తారింటికి దారేది’ లీక్ అయినప్పుడు చచ్చిబతికినట్టయింది! హీరో, డైరెక్టర్ సపోర్ట్ ఉండబట్టి గట్టెక్కాం. ఇందులో పని చేసే కొందరు వెధవల వల్ల ఈ లీకులు జరుగుతుంటాయి. ‘ఈ సినిమాలో చేశాం’ అని చెప్పుకోవడం కోసం ఇలా చేస్తారు. ‘మగధీర’ అప్పుడు కూడా పెద్ద లీక్ అయింది. సీజీ వర్క్ చేసిన సీన్ ముందే లీక్ అయింది. దానివల్ల ఆ సీన్‌ని ఆ సినిమాలో పెట్టలేకపోయాం. లీకులు చేసేవాళ్లు ఒక సంగతి గ్రహించాలి. వేల మంది ఇండస్ట్రీ మీద బతుకుతుంటారు. లీక్ చేయడం అంటే వీళ్లందరి జీవితాలతో ఆడుకోవడమే. వీళ్ల మైండ్‌సెట్ మారాలి. మైండ్‌సెట్ మారని వాళ్ల కోసం చట్టాలు కఠినంగా మారాలి. ఇలా అరెస్ట్ అయి, అలా బెయిల్‌పై వచ్చేలా ఉండకూడదు. అందరు హీరోల ఫ్యాన్స్ ఒకటవ్వాలి – దిల్ రాజు, డీజే నిర్మాత లీకేజీ సమస్య అన్ని సినిమాలకూ, అన్నీ లాంగ్వేజీలలోనూ ఉంది. కొన్ని వేల రూపాయల కోసం ఆశపడి, కొన్ని కోట్లరూపాయల సినిమాను డ్యామేజ్ చేస్తున్నారు. మనుషుల మెంటాలిటీ మారితే తప్ప ఇలాంటివి ఆగవు. ఒక హీరో సినిమా లీక్ అయితే, ఆ హీరో అభిమానులే కాకుండా, మిగతా హీరోల అభిమానులు కూడా లీక్‌లకు వ్యతిరేకంగా సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇవ్వాళ ఒక హీరో సినిమాకు జరిగింది రేపు ఇంకో హీరో సినిమాకు జరగదని ఏముంది? పైరసీపై ఇలాగే కలసికట్టుగా అభిమానులు ఫైట్ చేశారు. ఇప్పుడు ఫిజికల్‌గా పైరసీ లేదు కానీ ఆన్లైన్లో ఉంది. దీన్ని కూడా అడ్డుకోవాలి. లేదంటే అందరం బాధపడవలసి వస్తుంది. నమ్మక ద్రోహులు ఉంటారు – కల్యాణ్ రామ్ సినీ హీరో, జై లవ కుశ నిర్మాత సినిమా సీజీ వర్క్‌కి మనుషుల అవసరం బాగా పెరుగుతుంది. రకరకాల మనుషులు వస్తారు. అంతా నమ్మకం మీద వదిలేస్తాం. అనుమానిస్తే అసలు ఏ పనీ కాదు. అప్పటికీ కేర్‌ఫుల్‌గా ఉంటాం. అయినా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అందరిదీ క్రిమినల్ మైండ్ అనలేం. ఇంటి దగ్గర అందరికీ గొప్పగా చూపించుకోవడం కోసం కొందరు ఇలా లీక్‌లు చేస్తుంటారు. జై లవ కుశ కూడా అలాగే లీక్ అయింది. ఆన్లైన్ ఎడిటర్ హెల్త్ బాగోలేకపోతే అతని ప్లేస్‌లో వేరే మనిషిని పంపాడు. అతడి వల్ల జూనియర్ ఎన్టీఆర్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడన్న సంగతి ప్రపంచానికంతటికీ తెలిసింది. ఈ లీక్ చేసిన వాడికి గుడివాడలో గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ అమ్మాయి దగ్గర షో ఆఫ్ చెయ్యడం కోసం చూపించాడు. అలా అలా అది ఫోన్లతో తిరిగి నెట్లోకి వచ్చింది. – సాక్షి ‘ఫ్యామిలీ’ -
దశమికి థియేటర్లలో...
విజయదశమికి రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయడం సంప్రదాయం. రావణ దహనాన్ని చాలామంది వీక్షిస్తారు. ఈ దసరాకు రెండు రావణ దహనాలను చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకు కలుగుతోంది. ఒకటి గుడిలో... రెండోది థియేటర్లో! ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ‘జై లవ కుశ’ను సెప్టెంబర్ 21న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. అభిమానులకు రంజాన్ కానుకగా ఈ వార్తను వెల్లడించారు. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. రావణుడి లాంటి ఓ వ్యక్తిని (జై) మరో ఇద్దరు (లవ, కుశ) ఎలా అంతం చేశారనేది చిత్రకథ అట! రాశీ ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా హిందీ నటుడు రోనిత్ రాయ్ తెలుగు తెరకు విలన్‌గా పరిచయమవుతున్నారు. జూలై తొలి వారంలో టీజర్ విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 30న విజయదశమి. 21న నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆ రోజున సినిమా విడుదల కానుందన్న మాట. -
లవ కుశలు కమింగ్ సూన్!
జై–లవ–కుశ... ముగ్గురూ అన్నదమ్ములా? స్నేహితులా? శత్రువులా? ఈ ప్రశ్నలకు సమాధానం దసరాకి దొరుకుతుంది. ఈ ముగ్గురూ ఎలా ఉంటారు? అనడిగితే.. ‘జై’ మాత్రం ఇలా ఉంటాడు అని టకీమని చెప్పేయొచ్చు. ఈ మధ్యే కదా జై జోరుగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. జై సై్టలిష్ లుక్కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మరి ‘లవ’, ‘కుశ’ లుక్స్ ఎలా ఉంటాయి? అనే చర్చ ఫిల్మ్‌నగర్‌లో జోరుగా సాగుతోంది. వాళ్లిద్దరూ కూడా ఆన్ ది వే. జస్ట్ పది, పదిహేను రోజుల్లో ఈ ఇద్దరి లుక్స్ తెలిసిపోతాయి. ‘జై’గా ఎన్టీఆర్ మాస్‌గా కనిపించి మార్కులు కొట్టేశారు. లవ్ అలియాస్ ఎన్. లవకుమార్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అట. ఆ గెటప్పూ బాగుంటుందని ఊహించవచ్చు. మరి.. కుశ ఏం చేస్తాడు? అనుకుంటున్నారా? ఫిల్మ్‌నగర్ టాక్ ప్రకారం కుశ డ్యాన్స్ మాస్టర్ అట. ఈ గెటప్పూ అదిరిపోయేలా ఉంటుందట. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ‘జై లవ కుశ’ టీజర్ వచ్చే నెల మొదటి వారంలో విడుదల కానుంది. కేయస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, నివేదా థామస్ కథానాయికలు. హీరోయిన్ నందిత ఓ కీ రోల్ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ ఏడాది దసరాకు సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారట. -
ఎన్టీఆర్ సినిమాలో లక్కీ గర్ల్
జనతా గ్యారేజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్, షార్ట్ గ్యాప్ తరువాత బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాను ప్రారంభించాడు. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించి రోజుకో ఇంట్రస్టింగ్ అప్ డేట్ సందడి చేస్తోంది. ఎన్టీఆర్ త్రిపాత్రినయం చేస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ అన్న, హీరో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మరిన్ని ఆకర్షణలు జోడిస్తున్నారు. తన ఐటమ్ సాంగ్ ఉంటే చాలు సినిమా హిట్ అన్న రేంజ్లో పేరు తెచ్చుకున్న హంసానందిని ఎన్టీఆర్ కొత్త సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయనుందట. అంతేకాదు సినిమాలో కీలకమైన పలు సన్నివేశాల్లోనూ హంస కనిపిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న జై లవకుశ సినిమాతో ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.