స్టీరియోఫోనిక్‌లో అయితే రెండు వినపడతాయి
ఇది 2డీలో 3డీ.. అంటే... కళ్లజోడు పెట్టుకోకుండానే
ఎన్టీఆర్ మూడు డైమన్షన్స్‌లో కనపడతాడు
చూసి ‘జై’ కొట్టాల్సిందే... చూసినంతసేపు లవ్ చేయాల్సిందే
చూశాక ఖుష్ అవ్వాల్సిందే.
జై లవకుశ... తీన్ తారక్... ఎన్టీఆర్.
‘జై లవకుశ’ల కహానీ ఏంటి?
ఎన్టీఆర్‌లాంటి ఎనర్జిటిక్ హీరో సింగిల్ రోల్‌లో కనిపించినా సూపరే. ఇక, డబుల్ రోల్‌లో ‘అదుర్స్’. ఏకంగా ట్రిపుల్ రోల్స్ అంటే దుమ్ము దుమారమే. అందుకే ‘జై లవకుశ’పై బోలెడన్ని ఎక్స్‌పెక్టేషన్స్. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ వీర లెవల్లో రెచ్చిపోతారని ఫ్యాన్స్ ఫిక్సయ్యారు. ఇంతకీ, ఈ ‘జై లవకుశ’ కథేంటి? సినిమా రిలీజ్‌కు ముందే ఫుల్ స్టోరీ చెప్పేస్తే ఎలా? జస్ట్ లైన్ తెలుసుకుందాం. ఇది ముగ్గురు అన్నదమ్ముల (జై, లవ, కుశ) కథ. విధి వీళ్ల పట్ల చిన్న చూపు చూడటంతో విడిపోతారు. ఫైనల్‌గా ఎలా కలుసుకున్నారు?... అనేది కథ అట. బోలెడన్ని ట్విస్టులతో ఈ లైన్‌ని ఓ స్టోరీగా రాసుకున్నారట. ఒక ట్విస్ట్ ఏంటంటే.. సెకండాఫ్‌లో మూడు పాత్రలూ ఒక పాత్రలా మారి, కన్‌ఫ్యూజ్ చేసే సీన్స్ ఉన్నాయట. ఈ సీన్స్ ఆడియన్స్‌ని ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేస్తాయట.
అన్నదమ్ముల కాంబినేషన్‌లో ఫస్ట్ సినిమా
చిత్రదర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) గతేడాది అక్టోబర్‌లో ఎన్టీఆర్–కల్యాణ్‌రామ్‌లకు ఈ స్టోరీ లైన్ చెప్పారు. లైన్ నచ్చడంతో డెవలప్ చేయమన్నారు. డిసెంబర్‌కి బౌండ్ స్క్రిప్ట్ రెడీ. కథ విన్నాక అన్నదమ్ములు... అంటే కల్యాణ్‌రామ్–ఎన్టీఆర్‌లు ‘నందమూరి తారక రామారావు ఆర్ట్స్’ బేనర్‌పై ఈ సినిమా నిర్మించాలనుకున్నారు. అన్నయ్య ప్రొడ్యూసర్. తమ్ముడు హీరో. అన్నదమ్ములిద్దరి కాంబినేషన్‌లో ఇది ఫస్ట్ సినిమా. అది కూడా అన్నదమ్ముల నేపథ్యం ఉన్న సినిమా కావడం విశేషం. గెటప్, మేకప్, కాస్ట్యూమ్స్, షెడ్యూల్స్, ఇలా రెండు నెలల పాటు పక్కా ప్లాన్ చేసుకుని, మార్చిలో షూటింగ్ మొదలుపెట్టేశారు. షూటింగ్‌కి దాదాపు 150 రోజులు పట్టిందని టాక్.
ఎన్టీఆర్ ట్రిపుల్‌కి 150 కాస్ట్యూమ్స్
జనరల్‌గా సింగిల్ రోల్ అంటే హీరోకి 40 నుంచి 50 కాస్ట్యూమ్స్ తయారు చేయిస్తారు. ఇక, ట్రిపుల్ రోల్ అంటే మాటలా? ఎన్టీఆర్ చేసిన మూడు క్యారెక్టర్స్‌కి 130 నుంచి 150 కాస్ట్యూమ్స్ కుట్టించారు. కాస్ట్యూమ్స్ అన్నింటినీ డిజైనర్ అశ్విన్ మాల్వే తయారు చేశారు. ఇంట్రస్టింగ్ పాయింట్ ఏంటంటే... ‘జై లవకుశ’లు ఒకే రకం డ్రెస్సులో కనిపించే సీన్స్ కొన్ని ఉన్నాయట. ఆ సీన్స్ ఐ–ఫీస్ట్ అంటున్నారు.
‘జై లవకుశ’ల స్కిన్ టోన్ డిఫరెంట్!
జనరల్‌గా హీరో ఒకటికన్నా ఎక్కువ క్యారెక్టర్స్‌ని చేసినప్పుడు ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్‌గా ఉండేలా చూసుకుంటారు. కానీ, ఇక్కడ ‘జై–లవ–కుశ’ల రంగు కూడా డిఫరెంట్. ‘జై’ కొంచెం నల్లగా, ‘లవ’ తెల్లగా, ‘కుశ’ మధ్యస్తంగా కనిపిస్తారట. ఈ తేడా చూపించడం కోసం హాలీవుడ్ నుంచి వాన్స్ హార్ట్‌వెల్‌ని ఇండియాకి రప్పించారు. హాలీవుడ్ మూవీస్ ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’, ‘ఐరన్ మ్యాన్’, ‘లైఫ్ ఆఫ్ పై’ తదితర చిత్రాల్లో ఆర్టిస్టులకు ఈయన ప్రొస్థెటిక్ మేకప్ చేశారు. వాన్స్ హార్ట్‌వెల్ ‘జై లవకుశ’కు మేకప్ సూపర్‌వైజర్‌గా వ్యవహరించారు.
14 షాట్స్... 42 కాస్ట్యూమ్స్
జై లవకుశ... ఈ మూడు పాత్రలకు సంబంధించిన సీన్స్‌ని ఒకే రోజున తీసినప్పుడు ఎన్టీఆర్‌కి తంటాలే. ఉదయం 6 గంటలకు మొదలుపెడితే రాత్రి 2 గంటల వరకూ మూడు పాత్రల చిత్రీకరణకు పట్టేదట. ఒకరోజు మూడు పాత్రల మీద 14 షాట్స్ తీస్తే 14 ఇంటూ 3 కాస్ట్యూమ్స్... మొత్తం 42 డ్రెస్సులు మార్చుకున్నారట ఎన్టీఆర్. నిజంగా చాలా ఓపిక కావాలండీ బాబూ. అలాగే మూడు పాత్రల హెయిర్ స్టైల్ వేరు కావడంతో స్టైలింగ్‌కి కూడా బాగా టైమ్ పట్టేదట. ఒక్కో క్యారెక్టర్ హెయిర్ స్టైల్‌కి గంట పట్టేదట. ఎన్టీఆర్ వెరైటీ హెయిర్‌స్టైల్‌తో హ్యాండ్‌సమ్‌గా కనిపించిన ‘నాన్నకు ప్రేమతో..’కి స్టైలిస్ట్‌గా చేసిన హకీమ్ అలీయే ఈ చిత్రానికీ హెయిర్ స్టైలిస్ట్.
డ్రామా కంపెనీలో ‘జై లవకుశ’లు
సినిమాలో ఇంట్రస్టింగ్ ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. అందులో డ్రామా కంపెనీ ఎపిసోడ్ ఒకటని భోగట్టా! ఈ నాటకాల కంపెనీతో జై, లవకుశలకు ఓ లింక్ ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలనుందా? వెయిట్ అండ్ సీ.
అవుటాఫ్ కంట్రీలో ఆడియో వర్క్
మామూలుగా మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే సమ్ టైమ్స్ నెల పైనే పడుతుంది. ఈ సినిమాకి పట్టింది జస్ట్ వారం రోజులు మాత్రమే. ఎన్టీఆర్–బాబీ–మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఆడియో ఫైనలైజ్ చేయడం కోసం అవుటాఫ్ కంట్రీ వెళ్లారు. అక్కడ వారం రోజులు ఉన్నారని సమాచారం. అక్కడే నాలుగు ట్యూన్స్ ఫైనలైజ్ చేసుకుని, ఇండియా వచ్చారు. ఇక్కడికొచ్చాక దేవి ఐటమ్ సాంగ్ కంపోజ్ చేశారు. ఈ పాటలోనే మిల్కీ బ్యూటీ తమన్నా కనువిందు చేస్తారు. ఈ పాట కోసం భారీ సెట్ వేశారు. ఈ పాటలో తమన్నా చిందేసింది జైతోనే అని సమాచారం.
హీరోయిన్లను ఎలా సెలక్ట్ చేశారంటే?
ఈ సినిమాలో 20, 30 సినిమాలు చేసిన కథానాయిక లను కాకుండా ఇప్పుడిప్పుడే పైకొస్తున్న, వీలైతే ఒకట్రెండు సినిమాలు మాత్రమే చేసిన నాయికలను తీసుకోవాలను కున్నారట. ఎవరైతే బాగుంటుందా? అనుకుంటున్న టైమ్ లో నాని ‘జెంటిల్‌మన్’ రిలీజైంది. అందులో మలయాళ భామ నివేథా థామస్ యాక్టింగ్ సూపర్బ్. ఈ చిత్రంలో మంచి పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న కథానాయిక పాత్ర కోసం ఆమెను తీసుకున్నారు. అలాగే, పర్ఫార్మెన్స్ ప్లస్ గ్లామర్... రెంటికీ స్కోప్ ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ కోసం పలు పేర్లను పరిశీలించారు. సరిగ్గా అప్పుడే బొద్దుగుమ్మ రాశీఖన్నా స్లిమ్‌గా మారి, ఫొటోషూట్ చేయించుకున్న ఫొటోలు బయటికొచ్చాయట. అంతే... రాశీ ఖన్నాను ఫిక్స్ చేశారు. నందితను ఓ నాయికగా తీసుకున్నారు.
నాన్‌స్టాప్ టు నత్తి... ఏదైనా!
నందమూరి కుటుంబం అంటే పవర్‌ఫుల్ డైలాగ్స్‌కి కేరాఫ్ అడ్రస్ అన్నట్లు. ఆ కుటుంబం నుంచి వచ్చిన ఎన్టీఆర్‌కి నాన్‌స్టాప్‌గా డైలాగులు పలికే కెపాసిటీ ఉంది. అలాంటిది ఆయన్ను నత్తిగా నత్తిగా మాట్లాడమంటే? కొంచెం కాదు... చాలా కష్టం. కానీ, సిన్మా కోసం ఎంతైనా కష్టపడే మనస్తత్వం ఉన్న నటుడు ఎన్టీఆర్. అందుకే నత్తిగా మాట్లాడటం ప్రాక్టీస్ చేశారు. దీనికోసం ఎవరి హెల్పూ తీసుకోలేదట. తనంతట తాను ప్రాక్టీస్ చేసి, వాయిస్ రికార్డ్ చేసేవారు. ఫైనల్లీ... వాటిలో ‘ది బెస్ట్’ అనిపించినది సెలక్ట్ చేసుకుని, యూనిట్ సభ్యులకు వినిపిస్తే అందరూ ఆశ్చర్యపోయారట. ‘ఆ రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాల... ఈ రావణున్ని సంపాలంటే సముద్రం అంత దద్ద.. ధైర్యం ఉండాల... ఉందా’ అంటూ ‘జై’ పాత్ర కోసం ఎన్టీఆర్ నత్తి నత్తిగా మాట్లాడిన టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది.
‘జై’ టీజర్: జూలై 6న రిలీజైంది. ఇప్పటివరకు యూట్యూబ్‌లో సుమారు కోటీ 75 లక్షలమంది చూశారు.
‘లవ’ టీజర్: ఆగస్టు 24న విడుదలైంది. యూట్యూబ్‌లో అరవై ఆరు లక్షలమందికి పైగా చూశారు.
‘కుశ’ టీజర్: మూడు రోజుల క్రితం (సెప్టెంబర్ 7న) విడుదలైంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్ లిస్టులో ట్రెండ్ అవుతోంది. శనివారం రాత్రి 7 గంటల వరకు సుమారు 27 లక్షల మంది చూశారు.
క్వారీలో రిస్క్
ఈ సినిమాలో రిస్కీ ఫైట్స్ నాలుగైదు ఉన్నాయి. వాటిలో క్వారీ ఫైట్ ఒకటి. ఈ ఫైట్ ఎన్టీఆర్ ఒళ్లు హూనం చేసింది. కాళ్లకు అక్కడక్కడా దెబ్బలు తగిలాయి. అయినా నో రెస్ట్. పెయిన్ కిల్లర్స్ వేసుకుని ఫైట్ లాగించేశారట. ఈ ఫైట్‌తో పాటు మిగతా ఫైట్స్ థ్రిల్‌కి గురి చేస్తాయట.
ఎన్టీఆర్ కెరీర్‌లో హై బడ్జెట్ మూవీ
ఇప్పటివరకూ ఎన్టీఆర్ చేసిన సినిమాలన్నింటì కన్నా ఇది బడ్జెట్ ఎక్కువ. తమ్ముడి మీద ప్రేమతో అన్న ఖర్చుపెట్టారేమో అనుకోవద్దు. కథ అంత డిమాండ్ చేసిందట. ఎంత అంటే? 80 కోట్ల రూపాయలని భోగట్టా. థియేట్రికల్, డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ అందుకు తగ్గట్టుగానే సేల్ అయ్యాయని టాక్. శాటిలైట్ రైట్స్‌ను దాదాపు 15 కోట్లకు జెమినీ టీవీ దక్కించుకుందట. థియేట్రికల్ రైట్స్ 86 కోట్లకు సేల్ అయ్యాయని టాక్. హిందీ డబ్బింగ్ రైట్స్ 12 కోట్ల రూపాయలని సమాచారం. మొత్తంగా 113 కోట్లు. అంటే.. రిలీజ్‌కు ముందే దగ్గర దగ్గర 30 కోట్లు లాభం అని టాక్. రిలీజయ్యాక కలెక్షన్స్ రేంజ్ రికార్డ్ స్థాయిలో ఉంటుందని అంచనా.
ఒక్క ఎన్టీఆర్ స్క్రీన్ మీద ముగ్గురిలా ఎలా కనిపిస్తాడు? ఏముంది? ఒకరు ఒరిజినల్... మిగతా రెండు పాత్రలనూ డూప్‌తో షూట్ చేసి ఉంటారనుకుంటున్నారా? అఫ్‌కోర్స్, అలా కూడా చేయొచ్చు. కానీ, ఒరిజినల్ ఎన్టీఆర్ స్థాయిలో డూప్స్ యాక్ట్ చేయగలుగుతారా? అందుకే ‘జై లవకుశ’లో డూప్ షాట్స్ చాలా చాలా తక్కువ. మరి.. ఒకే ఎన్టీఆర్ మూడు పాత్రల్లో ఒకేసారి స్క్రీన్‌పై ఎలా కనిపించారు? ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా చేసిన ఛోటా కె. నాయుడు ఆ టెక్నిక్ గురించి చెప్పారు. ఈ సినిమా గురించి ఆయన మాటల్లో...
‘‘ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ‘అదుర్స్’ మూవీకి నేనే కెమెరామేన్. ఆ సినిమాలో ఇద్దరు ఎన్టీఆర్‌లు కనిపించే సీన్స్ తక్కువ. కానీ, ‘జై లవకుశ’ సినిమా సెకండాఫ్‌లో ఒకేసారి మూడు పాత్రలు కనిపించే సీన్స్ ఎక్కువ. లవ, కుశ పాత్రలు ఓకే కానీ, ‘జై’ క్యారెక్టర్ షూట్ మాత్రం టెన్షన్‌గా అనిపించేది. రావణాసురుడి షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అది. ఫుల్ ఎమోషనల్‌గా ఉంటుంది. ఈ క్యారెక్టర్ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న లవ, కుశ కూడా అందుకు తగ్గట్టుగా రియాక్ట్ అవుతుంటారు. డైలాగ్స్ కూడా ఉంటాయి. డూప్స్‌తో వర్కవుట్ అవ్వదు. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్‌ని ఎవరూ మ్యాచ్ చేయలేరు.
అందుకే ముందు ఒక క్యారెక్టర్‌ని లైవ్‌లో షూట్ చేసి, మిగతా రెండు క్యారెక్టర్స్‌ని గ్రీన్ మ్యాట్ బ్యాక్‌డ్రాప్‌లో షూట్ చేసేవాళ్లం. ఆ తర్వాత సీజీ వర్క్‌లో లైవ్‌లో షూట్ చేసిన క్యారెక్టర్‌తో గ్రీన్ మ్యాట్ బ్యాక్‌డ్రాప్‌లో షూట్ చేసిన క్యారెక్టర్స్‌ని మ్యాచ్ చేసేవాళ్లు. సో.. ఎక్కువ క్రెడిట్ సీజీ వర్క్‌కే ఇస్తా. హరి (కల్యాణ్‌రామ్ బంధువు)కి సొంత సీజీ స్టూడియో ఉంది. అక్కడ అనిల్ ఆధ్వర్యంలో జరిగిన సీజీ వర్క్ ఫెంటాస్టిక్. నిజానికి టెక్నికల్‌గా ఏం చేశాం? అనేది మాటల్లో చెప్పడం కష్టం. విజువల్‌గా చూస్తేనే అర్థమవుతుంది. ఈ సినిమాకి కొత్త కెమేరాలు వాడలేదు. అయితే ఆస్ట్రేలియా, ముంబై నుంచి ‘మోషన్ కంట్రోల్ కెమెరా’ని తెప్పించాం.
అది ఎందుకంటే, జనరల్‌గా షూటింగ్‌లో క్యారెక్టర్స్ మూవ్ అవుతాయి. కానీ, కెమెరా ఒకేచోట ఉంటుంది. కానీ, ఈ సినిమాకి కెమెరానే ఎక్కువగా మూవ్ అయింది. ఇది చాలా ఎక్స్‌పెన్సివ్ కెమెరా. రెంటే ఐదు కోట్లు. టోటల్లీ ఈ మూవీ అందరికీ ఓ ఛాలెంజ్. ఎన్టీఆర్‌కి పెద్ద సవాల్. ఒకే రోజున మూడు పాత్రలు చేసినప్పుడు ఇన్‌డోర్‌లో మేం లైట్ సెట్ చేసుకుంటాం కానీ, అవుట్‌డోర్ అప్పుడు ఇబ్బందిపడే వాళ్లం. ఎన్టీఆర్ లవ, కుశ పాత్రలు చేశాక, సరిగ్గా ‘జై’ షూట్ మొదలుపెట్టేటప్పటికి సన్ లైట్ డ్రాప్ అయ్యేది. మళ్లీ ఆ లైట్ వచ్చేంతవరకూ వెయిట్ చేయాలి. మాకంటే ఓకే. కానీ, ఓ ఆర్టిస్ట్ అంతసేపు ఆ క్యారెక్టర్ మూడ్‌లో ఉండటం మామూలు విషయం కాదు. చాలా ఓపిక కావాలి. అందుకే ఎన్టీఆర్‌కు హ్యాట్సాఫ్. ఈ సిన్మాలో ఎన్టీఆర్ ‘బెస్ట్ పర్ఫార్మెన్స్’ని చూస్తారు.
– డి.జి. భవాని