
సాక్షి, హైదరాబాద్: 'జై లవ కుశ' విజయోత్సవంలో వేడి రాజుకుంది. సినీ విమర్శకులు వ్యవహరిస్తున్న తీరుపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ మండిపడ్డాడు. కష్టపడి తెరకెక్కిస్తున్న చిత్రాలకు కొందరు విమర్శకులు నెగిటివ్ సమీక్షలు ఇస్తున్నారని చెప్పాడు. తారక్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. బాబీ దర్శకత్వంలో వచ్చిన 'జై లవ కుశ' చిత్రంలో జూనియర్ మూడు పాత్రల్లో నటించాడు. బాక్సాఫీస్ దగ్గర బంపర్ ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రానికి క్రిటిక్స్ బిలో యావరేజ్ రేటింగ్స్ తో సరిపెట్టారు. ఇలా నెగిటీవ్ రివ్యూలు ఇవ్వడంతో తారక్ ఆగ్రహం వ్యక్తం చేసాడు.
'జై లవ కుశ' విజయోత్సవంలో తారక్ మాట్లాడుతూ.. 'హాస్పటల్లో మన కుటుంబసభ్యులెవరైనా క్రిటికల్ కండిషన్‌తో ఎమర్జెన్సీ వార్డులో ఉంటే.. డాక్టర్లు ఏం చెబుతారో? మనం ఆశలు పెట్టుకోవచ్చో? లేదో? అని ఎదురు చూస్తుంటాం. టెస్టులు చేసిన తర్వాత చెబుతామని ఎన్నో ఏళ్లు అనుభవం గల, చదువుకున్నటువంటి డాక్టర్లు చెబుతారు. ఈలోపు దారినపోయే దానయ్యలు కొందరు అన్నీ తెలిసినట్టే ‘బతకడు. పోతాడు’ అంటుంటారు.
భయంలో ఉన్న మనకు ధైర్యాన్ని ఇవ్వకపోగా... చావు బతుకుల మధ్య ఉన్నోణ్ణి చంపేయడం, వాడి మీద ఆశలు పెట్టుకున్నోణ్ణి ఇంకా చంపేసేయడం... ఇటీవల ఇలాంటి ప్రక్రియ మన తెలుగు ఇండస్ట్రీలో మొదలైంది. విడుదలైన సిన్మా ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్ లాంటిది. పేషెంట్ బతుకుతాడా? లేదా? అనుకునే చుట్టాలు మేము (సిన్మా టీమ్). ప్రేక్షకులు డాక్టర్లు. విశ్లేషకులు దారినపోయే దానయ్యలు. పేషెంట్ చచ్చిపోయాడని వాళ్లు (ప్రేక్షకులు) చెబితే ఓకే. ఆశలు వదిలేసి, ఒప్పేసుకుంటాం. కానీ, ఆ క్లారిటీ రాకుండా... ముందే పోయాడనో! అదనో! ఇదనో! ఎందుకు? డాక్టర్లను చెప్పనివ్వండి. ఎమర్జెన్సీ వార్డుకి ఇంకొకణ్ణి తెచ్చుకుంటాం. మాకే కాదు, అందరికీ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది. దయచేసి... ఒక సిన్మా వచ్చినప్పుడు ప్రేక్షకుల్ని స్పందించనివ్వండి.
అఫ్‌కోర్స్... 101 శాతం మనందరికీ వాక్ స్వాతంత్య్రం ఉంది. కానీ, మనం మాట్లాడే ఒక మాట అవతలి వ్యక్తికి ఉన్నటువంటి ఆశను ఎంత దిగజారుస్తుందో ఒక్కసారి ఆలోచించండి. నా మాటల్లో తప్పులుంటే క్షమించండి! అర్థం లేకుంటే వదిలేయండి. నా బాధను మీ అందరికీ ఒక్కసారి వెల్లడిద్దామనుకున్నా’’ అంటూ ఎన్టీఆర్ ఆవేదనగా పేర్కొన్నాడు. ‘‘ఎమర్జెన్సీ వార్డుకి వచ్చిన మా పేషెంట్ ‘జై లవకుశ’ హెల్త్ బ్రహ్మాండంగా ఉందని చెప్పిన మా డాక్టర్లందరికీ ధన్యవాదాలు’’ అంటూ ఆయన ముగించాడు. ఆయన వ్యాఖ్యలపై ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్ ఎందుకింత ఎమోషనల్‌గా స్పందించారు? ఆయనను బాధపరిచిన నెగిటివ్ రివ్యూలేమిటి? అన్నది చర్చనీయాంశమైంది.