‘‘హాస్పటల్లో మన కుటుంబ సభ్యులెవరైనా క్రిటికల్ కండిషన్‌లో ఎమర్జెన్సీ వార్డులో ఉంటే.. డాక్టర్లు ఏం చెబుతారో? మనం ఆశలు పెట్టుకోవచ్చో? లేదో? అని ఎదురు చూస్తుంటాం. టెస్టులు చేసిన తర్వాత చెబుతామని ఎన్నో ఏళ్లు అనుభవం గల, చదువుకున్నటువంటి డాక్టర్లు చెబుతారు. ఈలోపు దారినపోయే దానయ్యలు కొందరు అన్నీ తెలిసినట్టే ‘బతకడు. పోతాడు’ అంటుంటారు.
భయంలో ఉన్న మనకు ధైర్యాన్ని ఇవ్వకపోగా... చావు బతుకుల మధ్య ఉన్నోణ్ణి చంపేయడం, వాడి మీద ఆశలు పెట్టుకున్నోణ్ణి ఇంకా చంపేసేయడం... ఇటీవల ఇలాంటి ప్రక్రియ మన తెలుగు ఇండస్ట్రీలో మొదలైంది’’ అన్నారు ఎన్టీఆర్. ఆయన హీరోగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ నిర్మించిన ‘జై లవకుశ’ జయోత్సవం సోమవారం జరిగింది. ఎన్టీఆర్ మాట్లాడుతూ – ‘‘విడుదలైన సిన్మా ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్ లాంటిది.
పేషెంట్ బతుకుతాడా? లేదా? అనుకునే చుట్టాలు మేము (సిన్మా టీమ్). ప్రేక్షకులు డాక్టర్లు. విశ్లేషకులు దారినపోయే దానయ్యలు. పేషెంట్ చచ్చిపోయాడని వాళ్లు (ప్రేక్షకులు) చెబితే ఓకే. ఆశలు వదిలేసి, ఒప్పేసుకుంటాం. కానీ, ఆ క్లారిటీ రాకుండా... ముందే పోయాడనో! అదనో! ఇదనో! ఎందుకు? డాక్టర్లను చెప్పనివ్వండి. ఎమర్జెన్సీ వార్డుకి ఇంకొకణ్ణి తెచ్చుకుంటాం. మాకే కాదు, అందరికీ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది. దయచేసి... ఒక సిన్మా వచ్చినప్పుడు ప్రేక్షకుల్ని స్పందించనివ్వండి.
అఫ్‌కోర్స్... 101 శాతం మనందరికీ వాక్ స్వాతంత్య్రం ఉంది. కానీ, మనం మాట్లాడే ఒక మాట అవతలి వ్యక్తికి ఉన్నటువంటి ఆశను ఎంత దిగజారుస్తుందో ఒక్కసారి ఆలోచించండి. నా మాటల్లో తప్పులుంటే క్షమించండి! అర్థం లేకుంటే వదిలేయండి. నా బాధను మీ అందరికీ ఒక్కసారి వెల్లడిద్దామనుకున్నా’’ అన్నారు. చివరగా, ‘‘ఎమర్జెన్సీ వార్డుకి వచ్చిన మా పేషెంట్ ‘జై లవకుశ’ హెల్త్ బ్రహ్మాండంగా ఉందని చెప్పిన మా డాక్టర్లందరికీ ధన్యవాదాలు’’ అని ముగించారు.
అంతకు ముందు సినిమా గురించి మాట్లాడుతూ– ‘‘నటుడిగా నేను చాలా గర్వపడే, ఆనందపడే, పూర్తి సంతృప్తిపడే చిత్రాన్ని తీసుకొచ్చినందుకు బాబీకి థ్యాంక్స్. మేమిద్దరం (ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్) అన్నదమ్ముల ఔన్నత్యాన్ని, బంధాన్ని చాటిచెప్పే చిత్రం చేయడం మా అదృష్టం. కోనగారు చెప్పినట్టు ఇదంతా దైవ నిర్ణయమే. బహుశా... దేవుడే నిర్ణయించి బాబీ రూపంలో మాకీ కథను ఇచ్చుంటాడు. ఇక, ‘జై’ ఊయల్లో ఉన్నప్పుడు (క్లైమాక్స్ ఫైట్‌కి ముందు) పోసానిగారి నటన, ఆయన చేసిన ఆ ఒక్క సీన్ ‘జై లవకుశ’ హిట్టవ్వడానికి ముఖ్య కారణమని చెప్పగలను.
సినిమా వసూళ్లకు ప్రాముఖ్యత ఇవ్వను. అభిమానులకు నచ్చిందా? లేదా? అనేదే నాకు ముఖ్యం. ‘టెంపర్’ నుంచి ‘జై లవకుశ’ వరకూ మీ అందర్నీ తలెత్తుకునేలా చేశానని భావిస్తున్నా’’ అన్నారు. బాబీ మాట్లాడుతూ– ‘‘తారక్ లేకపోతే ఈ సిన్మా లేదు. అటక మీద ఫైల్‌లో ఉండుండేది. ‘ఆయన తల్లిదండ్రులకు పాదాభివందనాలు’ అని ఎందుకు అంటున్నానంటే... వాళ్లు జన్మనిచ్చి ఉండకపోతే, నాలాంటి దర్శకుడికి ఇంత పెద్ద గౌరవం వచ్చే సినిమా చేసే అవకాశం వచ్చి ఉండేది కాదు’’ అన్నారు.
కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ– ‘‘తమ్ముడితో సిన్మా అనగానే బాధ్యత ఎక్కువనిపించింది. వరుస విజయాల్లో ఉన్నాడు. తనతో ప్రెస్టీజియస్ ఫిల్మ్ చేయాలనుకున్నా. తారక్ తప్ప ఎవరూ ఈ సినిమా చేయలేరని ట్రైలర్ విడుదల రోజే చెప్పా. ఇప్పుడందరూ అదే అంటుంటే హ్యాపీగా ఉంది. తన పర్‌ఫార్మెన్సే సిన్మాను నిలబెట్టింది. కాసేపు నేను నిర్మాతననుకుంటే... నాన్నా (తారక్) థ్యాంక్స్’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘జనతా గ్యారేజ్’ విడుదలైన తొలి నాలుగు రోజుల్లో నైజాంలో 15.60 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, ‘జై లవకుశ’ నాలుగు రోజుల్లో 18.60 కోట్లు కలెక్ట్ చేసింది.
డిస్ట్రిబ్యూటర్‌గా నాకు లెక్కలే ముఖ్యం. ఎంతకు కొన్నాం, ఎంతొస్తుందనేది చూస్తా. ‘జనతా గ్యారేజ్, జై లవకుశ’లను మేమే డిస్ట్రిబ్యూట్ చేశాం. ఎన్టీఆర్ కెరీర్‌లో హయ్యెస్ట్ గ్రాసర్ అవుతుందీ సినిమా’’ అన్నారు. ఈ జయోత్సవంలో నటుడు పోసాని కృష్ణమురళి, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు, రచయిత కోన వెంకట్, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, పాటల రచయితలు చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
నా మాటల్లో తప్పులుంటే క్షమించండి : తారక్
Published Tue, Sep 26 2017 2:11 AM | Last Updated on Tue, Sep 26 2017 8:45 AM
Advertisement