నాన్నగారి లవకుశలా సూపర్ హిట్టవ్వాలి
– హరికృష్ణ
‘నాన్నగారు (సీనియర్ ఎన్టీఆర్) పిల్లలకు ఇచ్చిన ఆస్తి మీ (ప్రేక్షకుల) అభిమానమే. మీ వల్లే నందమూరి వంశం ముందుకెళ్తోంది. ఈ సినిమా పేరు చూస్తుంటే... నాన్నగారు నటించిన ‘లవకుశ’ గుర్తొస్తోంది. ఆ సినిమాలా ఇదీ సూపర్ హిట్టవ్వాలి. అన్నదమ్ముల నేపథ్యంలో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రమిది. ఇక్కడ విచిత్రం ఏంటంటే... అన్న నిర్మాత, తమ్ముడు హీరో. రామకృష్ణ స్డూడియోస్‌లో బాలయ్య హీరోగా నేను సినిమాలు నిర్మించిన రోజులు గుర్తొస్తున్నాయి’’ అన్నారు హరికృష్ణ.
ఆయన చిన్న కుమారుడు ఎన్టీఆర్ హీరోగా పెద్ద కుమారుడు కల్యాణ్‌రామ్ నిర్మించిన సినిమా ‘జై లవకుశ’. కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఆదివారం హైదరాబాద్‌లో పాటల సీడీలను హరికృష్ణ విడుదల చేశారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘మనసుకు నచ్చింది చేయాలా? ట్రెండ్ ఫాలో కావాలా? ‘జనతా గ్యారేజ్’ తర్వాత కన్‌ఫ్యూజన్‌లో పడ్డా. బాబీ కథ చెప్పగానే... మనసుకు నచ్చిందే చేయాలనుకున్నా. అంత ఎమోషన్ ఉందీ సినిమాలో.
మా పెద్దన్నయ్య జానకిరామ్‌గారు కూడా ఈ వేదికపై ఉండుంటే... ‘జై లవకుశ’ పేరుకి సార్థకం అయ్యుండేదేమో. భౌతికంగా ఆయన మా మధ్య లేకున్నా అన్నయ్య ఆత్మ ఎప్పుడూ మాతోనే ఉంటుంది. ఈ సినిమా సూపర్‌హిట్ అవ్వాలనే కంటే... నాన్నగారికి 60వ బర్త్‌డే గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నాం. ఈ నెల 2న ఆయన బర్త్‌డే. రెండు అయితే ఏముంది? 21 అయితే ఏముంది? అన్నదమ్ములుగా మేం చేసిన చిత్రమిది.
మా నాన్నను, అమ్మలను కూర్చొబెట్టి మేం సాధించిన విజయం ఇదని ఈ సినిమాతో చెప్పాలని మా కోరిక. తప్పకుండా వాళ్లు గర్వపడేలా చేశామని నమ్ముతున్నా. పెదనాన్న, బాబాయ్ కలసి చేసిన చిత్రమని మా పిల్లల్లు చెప్పుకోవాలి. నా కెరీర్‌లో మంచి సంతృప్తినిచ్చిన చిత్రమిది’’ అన్నారు. ‘‘మా కుటుంబ వేడుక ఇది. తారక్ (ఎన్టీఆర్) గురించి చాలా మాట్లాడాలి. ఈ నెల 10న జరగబోయే ప్రీ–రిలీజ్ వేడుకలో మాట్లాడతా. ఈ 21న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు కల్యాణ్‌రామ్. ‘‘నాకు దర్శకుడిగా మూడో చిత్రమిది.
ఎన్టీఆర్ హీరోగా మూడు పాత్రలతో చేశా. ఆయన కథకు న్యాయం చేశారు. అసిస్టెంట్, కో–రైటర్‌గా ఉన్నప్పట్నుంచి కల్యాణ్‌రామ్‌గారితో పరిచయముంది. ఆయన సంస్థలో సినిమా చేయడం హ్యాపీ. దేవిశ్రీ మంచి పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతం ఇచ్చారు’’ అన్నారు బాబీ. ‘‘జై, లవ, కుశ.. ముగ్గురిలా ‘నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్’ల తర్వాత తారక్‌తో మూడో చిత్రమిది. ఓ హీరోకి వరుసగా మూడు సినిమాలు చేయడం నా కెరీర్‌లో ఇదే తొలిసారి’’ అన్నారు దేవిశ్రీ. నటుడు బ్రహ్మజీ, రచయిత కోనవెంకట్, పాటల రచయితలు చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు.