అంతా కుశలమే
అభిమానులకు వినాయక చవితి కానుకగా ఎన్టీఆర్ ఓ సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. అదేంటంటే... ‘కుశ’ లుక్! ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న సినిమా ‘జై లవ కుశ’. ఇందులో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో (జై, లవకుమార్, కుశ) నటిస్తున్న సంగతి తెలిసిందే. చవితి ముందు రోజున లవకుమార్ టీజర్ విడుదల చేసిన ఎన్టీఆర్, చవితి రోజున ‘కుశ’ లుక్ విడుదల చేశారు.
ఇంకో సర్‌ప్రైజ్ ఏంటంటే... ఇందులో ప్రియా పాత్రలో నటిస్తున్న రాశీ ఖన్నా లుక్‌ను సైతం చవితి రోజునే విడుదల చేశారు. లవ టీజర్, కుశ లుక్, ప్రియా లుక్... ప్రేక్షకులకు ట్రిపుల్ ధమాకా అనే చెప్పాలి. ముఖ్యంగా టీజర్‌లో ‘మంచితనం... అది పుస్తకాల్లో ఉంటే పాఠం అవుతుంది. మనలో ఉంటే గుణపాఠం అవుతుంది. అదే నా జీవితాన్ని తల్లకిందులు చేసింది’ అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్, ‘జై లవకుశ’ చిత్రబృందం అంతా కుశలమే.