జమున భర్త జూలూరి కన్నుమూత | jamuna's husband passes away | Sakshi
Sakshi News home page

జమున భర్త జూలూరి కన్నుమూత

Published Tue, Nov 11 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM

వెంకటరమణారావు(ఫైల్)

వెంకటరమణారావు(ఫైల్)

నేడు పంజాగుట్టలో అంత్యక్రియలు
పక్షి శాస్త్ర నిపుణుడిగా ప్రసిద్ధుడు
కృష్ణ జింకను కాపాడేందుకు అవిరళ కృషి
జువాలజీ ప్రొఫెసర్‌గా విశేష పరిశోధనలు

 
 హైదరాబాద్: వన్యప్రాణులు, పక్షుల సంరక్షణ కోసం విశేష కృషి చేసిన ప్రముఖ పక్షి శాస్త్ర నిపుణుడు, అలనాటి సినీనటి జమున భర్త జూలూరి వెంకటరమణారావు (87) ఇక లేరు. సోమవారం సాయంత్రం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని తన స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య జమునతోపాటు కుమారుడు వంశీ, కూతురు స్రవంతి ఉన్నారు. బాబు అమెరికాలో, స్రవంతి తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. జూలూరి అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం పంజాగుట్ట శ్మశానవాటికలో జరుగుతాయని ఆయన శిష్యులు, బంధువులు తెలిపారు.
 
 జువాలజీ  ప్రొఫెసర్‌గా విశేష పరిశోధనలు చేసిన ఘనత జూలూరి సొంతం. ఆయన తండ్రి జూలూరి శేషగిరిరావు బ్రిటిష్ హయాంలో విజయనగరం జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. 1940లో హైదరాబాద్‌కు వచ్చిన జూలూరి, ఉన్నత విద్య అనంతరం ఉస్మానియాలో అధ్యాపకులుగా చేరారు. 1964లో జమునను పెళ్లాడారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం జువాలజీ విభాగం ఆచార్యులుగా సుదీర్ఘకాలం పనిచేశారు. అంతరించిపోతున్న కృష్ణ జింకను కాపాడుకునేందుకు చివరి క్షణం వరకు కృషి చేశారు. తన ఆర్థిక సాయంతో ఎంతోమందిని ఉన్నత చదువులు చదివించి గొప్ప ప్రతిభావంతులుగా తీర్చిదిద్దారు. అప్పట్లో తనకొచ్చే రూ.3,500 వేతనంలోనే శిష్యులకు రూ.800 చొప్పున ఫెలోషిప్ ఇచ్చి చదివించారు.
 
 కృష్ణా, గోదావరి తీరంలో అంతరించిపోతున్న కృష్ణ జింకలపై 30 మంది విద్యార్థులు ఆయన వద్ద పరిశోధనలు చేసి పీహెచ్‌డీ పట్టాలు అందుకున్నారు. కృష్ణజింకపై తాను రాసిన కవితలను పుస్తకంగా తేవాలని చివరి క్షణంలోనూ పరితపిం చారు. ఆ రంగం లో పలు పుస్తకాలు, వ్యాసాలు రాశారు. కృష్ణజింక, గూడబాతు, నీటి పిల్లులపైనా పుస్తకాలు రాశారు. నవంబర్ 16వ తేదీన జూలూరి 87వ పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉండిందని ఆయన శిష్యుడు డాక్టర్ వాసుదేవరావు కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం సాయంత్రం 4.30 దాకా ఆరోగ్యంగానే ఉన్నారని, 6.30 సమయంలో ఆకస్మికంగా చనిపోయారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement