
పురాణాల కాలం నుంచి నేటి వరకూ మంచి భార్య ఎలా ఉండాలో చెప్పారు కానీ మంచి భర్త లక్షణాలను గురించి ఎక్కడ చెప్పలేదన్నారు సిని నటి జయప్రద. ప్రస్తుతం జయప్రద ‘పర్ఫెక్ట్ పతి’ అనే హిందీ సీరియల్‌లో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘పర్ఫెక్ట్ పతి’తో బుల్లితెరలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. ఇందులో నా పాత్ర ఓ తల్లిగా, అత్తగా చాలా బలంగా ఉంటుంది. ప్రతి తల్లి తన పిల్లల ప్రవర్తనను తెలుసుకోవాలి. వారు చేసే తప్పొప్పులు గురించి వివరించాలి. అతి ప్రేమ, జాగ్రత్తల పేరుతో వారు ఏం చేసినా ఊరుకోకూడద’న్నారు.
అంతేకాక ‘ఎన్నో ఏళ్లుగా మన భారత దేశంలో అమ్మాయిలు మంచి భార్యలుగా ఎలా ఉండాలో చెప్పడమే కాక అలానే తీర్చిదిద్దుతున్నారు. కానీ అంత మంచి భార్యలకు సరిపోయే భర్తల్ని తయారు (పెంచడం) చేయడంలో మాత్రం మన సమాజం విఫలం అవుతోంది. సమాజంలోని మగవారంతా మంచి భర్తలు కాలేకపోతున్నారు. భర్త ఎలా ఉన్నా భరించాలని చెబుతూ అమ్మాయిల్ని పెంచుతున్నారు’ అని జయప్రద అభిప్రాయపడ్డారు.
ఈ సీరియల్‌లో జయప్రద రాజ్యశ్రీ రాథోడ్ అనే పాత్రను పోషిస్తున్నారు. ఆమె కుమారుడిగా నటుడు అయుష్ ఆనంద్, కోడలిగా నటి సనా అమిన్ షేక్ కనిపించనున్నారు. ఇందులో జయప్రద కుమారుడు తన భార్యను చంపడానికి ప్రయత్నిస్తుంటారట. దాంతో కోడలికి న్యాయం చేయడానికి కన్న కుమారుడ్ని జయప్రద చంపేస్తారట. ఈ నేపథ్యంలో సాగే ఈ సీరియల్ అందర్నీ మెప్పిస్తుందని జయప్రద ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment