
43 ఏళ్ల తరువాత డిజిటల్‌లో జయ చిత్రం
పురట్చి తలైవి, నేటి ముఖ్యమంత్రి జయలలిత, ముత్తురామన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం సూర్యకాంతి. విద్యా ఫిలింస్ పతాకంపై వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రానికి ముక్తా శ్రీనివాసన్ దర్శకుడు. భర్త కంటే భార్య అధికంగా సంపాదిస్తుందన్న ఈగో ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో 150 రోజలు ప్రదర్శింపబడి ఘన విజయాన్ని సాధించింది. ఇందులో పాటలన్నీ విశేష ప్రేక్షకాదరణను పొందాయి.
ఈ చిత్రంలో పురట్చి తలైవి జయలలిత సొంతంగా రెండు పాటలు పాడడం విశేషం. అదే విధంగా ప్రఖ్యాత గీత రచయిత కన్నదాసన్ రాసి నటించిన పరమశివన్ కళుత్తిలిరిందు పాంబు కేట్టదు గరుడా సౌక్యమా అన్న పాట నేటికీ ఎవర్‌గ్రీన్ అనే చెప్పాలి. చో రామస్వామి, మనోరమ, కాత్తాడి రామమూర్తి, ఏఏఆర్.వాసు ముఖ్య పాత్రలు పోపించారు. ఏ తరం వారైనా చూసి ఆనందించే కథాంశంతో రూపొందిన ఈ చిత్ర శతదినోత్స వేడుకలో సినీ ప్రముఖులందరూ పాల్గొనడం విశేషం.
అయితే అదే వేదికపై పురట్చి తలైవి తందై పెరియార్ అవార్డుతో ఘన సత్కారాన్ని అందుకోవడం మరో విశేషం. కాగా అప్పట్లో నలుపు తెలుపు రంగుల్లోనే ఆబాలగోపాలాన్ని అలరించిన సూర్యకాంతి చిత్రం 43 ఏళ్ల తరువాత సినిమా స్కోప్, డిజిటల్ హంగులతో మరోసారి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీన్ని ఏపీ.ఫిలింస్ పతాకంపై గజలక్ష్మి రాష్ట్రవ్యాప్తంగా విడుదలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.