
రేవతీ రాయ్ ఎవరో చాలామందికి తెలుసు. అయినా చెప్పుకోవాలి. అప్పుల బాధ, అనారోగ్యంపాలైన భర్త, ముగ్గురు పిల్లల ఆలనాపాలనా... ఇలా రేవతి జీవితం కష్టాలకు కేరాఫ్ అడ్రస్ అనే పరిస్థితి. చివరికి భర్త కూడా చనిపోతాడు. ఇక ముగ్గురు పిల్లల బాధ్యత తన మీదే. ఒంటరి మహిళ. ఉద్యోగం కోసం వెతికితే ఎవరూ ఇవ్వలేదు. అప్పుడు వచ్చిన ఆలోచనే ‘ఫర్ షీ’. తనకు తెలిసిన డ్రైవింగ్‌నే ఉపాధిగా ఎంచుకున్నారు రేవతి. క్యాబ్ డ్రైవర్‌గా మారారు. తనలా కష్టపడే వారి కోసం ‘ఫర్ షీ’ అనే క్యాబ్ సర్వీస్ స్టార్ట్ చేసి, ఉపాధి కల్పించారు. ఆ తర్వాత ఒక్క ఫోన్ కొట్టి, మందులు, నిత్యావసర వస్తువులు కావాలని చెబితే, తక్కువ సమయంలో మహిళా సిబ్బంది అందజేసేలా ‘హే దీదీ’ పేరుతో డెలివరీ సర్వీస్ ప్రారంభించారామె.
ముంబైకి చెందిన రేవతీ రాయ్ జీవితంలో ఒక సినిమాకి సరిపోయే కథ ఉంది. మహిళలకు ఆదర్శంగా నిలిచిన ఆమె జీవితంతో హిందీ నటుడు జాన్ అబ్రహామ్ సినిమా నిర్మించనున్నారు. ఈ బయోపిక్‌ని జాన్‌తో కలిసి మరో ఇద్దరు నిర్మాతలు నిర్మిస్తారు. రాబ్బీ గ్రేవాల్ దర్శకుడు. ‘‘ఎన్నో కష్టనష్టాలను తట్టుకుని నిలబడి, ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన రేవతి జీవితాన్ని సినిమాగా తీస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు జాన్. ‘‘ఇది నా కథ మాత్రమే కాదు. ఇతర మహిళలకు ఓ బాట చూపించిన మహిళలందరి కథ కూడా. పుట్టుకతోనే పోరాట యోధులుగా పుడతారు మహిళలు. వారికి ఒక్క అవకాశం ఇస్తే వృథా కాదు’’ అన్నారు రేవతీ రాయ్. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment