ముంబై: తన కెరీర్ ప్రమాదంలో పడుతుందన్న భయం కారణంగానే పెళ్లి విషయాన్ని కొన్నాళ్లపాటు దాచిపెట్టానని బాలీవుడ్ ప్రముఖ నటి జూహీ చావ్లా తెలిపారు. తనను అత్యంత జాగ్రత్తగా చూసుకునే వ్యక్తే తనకు భర్తగా దొరికారని మురిసిపోయారు. అగ్ర హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలోనే జూహీ చావ్లా తన స్నేహితుడు, వ్యాపారవేత్త జై మెహతాను రహస్యంగా వివాహమాడిన సంగతి తెలిసిందే. జై మెహతా మొదటి భార్య మరణించిన దాదాపు ఆరేళ్ల తర్వాత వీరిద్దరి పెళ్లి జరిగింది. కాగా ఇటీవల రాజీవ్ మసంద్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూహీ చావ్లా తన పెళ్లి నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు.
సర్వం కోల్పోయినట్లు అనిపించింది..
‘‘సినిమాల్లో ప్రవేశించకముందే నాకు జైతో పరిచయం ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల చాలాకాలం పాటు కలుసుకోలేదు. కొన్నేళ్ల తర్వాత మా ఇద్దరి స్నేహితుడు ఒకరు ఏర్పాటు చేసిన డిన్నర్ పార్టీలో మరోసారి తనను చూశాను. అప్పటికే ఆయన సుజాత బిర్లా(జై మొదటి భార్య)ను కోల్పోయారు. విమాన ప్రమాదంలో 1990లో ఆమె మరణించారు. తర్వాత కొన్నేళ్లకు నేను షూటింగ్‌లో ఉన్న సమయంలో మా అమ్మ మోనా చావ్లా యాక్సిడెంట్‌లో చనిపోయారనే దుర్వార్త విన్నాను. నా జీవితంలో అతి అత్యంత కఠిన సమయం. సర్వం కోల్పోయినట్లు అనిపించింది.
అలాంటి విపత్కర సమయంలో జై నాకు అండగా నిలిచాడు. నేను ఎక్కడ ఉన్నా ప్రతిరోజూ పువ్వులు, లేఖలు, బహుమతులతో ముంచెత్తేవాడు. నా పుట్టినరోజున ట్రక్కు నిండా గులాబీలు పంపించాడు. వీటన్నింటినీ ఏం చేసుకోవాలని ప్రశ్నించాను. నన్ను సంతోషంగా ఉంచడానికి తను చేయని ప్రయత్నం లేదు. అలా ఏడాది గడిచిన తర్వాత నాకు ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత 1996లో మేం పెళ్లి చేసుకున్నాం. కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్న కారణంగా నేను పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచాను’’ అని జూహీ చెప్పుకొచ్చారు. కాగా జూహీ చావ్లా- జై మెహతాకు ఇద్దరు పిల్లలు జాహ్నవి(19), అర్జున్(16) ఉన్నారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు షారూక్ ఖాన్‌తో కలిసి జూహీ సహ యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే.(అప్పుడు చాలా బాధ కలిగింది : సమంత)
Comments
Please login to add a commentAdd a comment