
ఆ చిత్రం తొమ్మిది వేల కోట్లకు పైగానే..
లాస్ ఎంజెల్స్: ఇటీవల విడుదలై చిన్నా పెద్దలను అబ్బురపరిచిన ప్రముఖ హాలీవుడ్ చిత్రం జురాసిక్ వరల్డ్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. భారీ వసూళ్లు రాబట్టి ప్రపంచంలోనే అతి పెద్ద మూడో చిత్రంగా నిలిచింది. జేమ్స్ కెమరాన్ రూపొందించిన అవతార్, టైటానిక్ చిత్రాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. దీంతో ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన యూనివర్సల్ స్టూడియో ఒక్క ఏడాదిలో రెండు పెద్ద చిత్రాలు రూపొందించిన సంస్థగా కూడా రికార్డు సొంతం చేసుకుంది.
ఈ ఏడాదిలో మొత్తం ఐదు చిత్రాలు రికార్డు వసూళ్లు సాధించగా అందులోని రెండు చిత్రాలు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7, జురాసిక్ వరల్డ్ ఈ సంస్థ నుంచి వచ్చినవే కావడం విశేషం. మరోపక్క, జపాన్లో ఈ చిత్రం ఆగస్టు 5 న విడుదల కానుంది. ఇదిలా ఉండగా, జురాసిక్ వరల్డ్ చిత్రానికి అత్యధిక వసూళ్లు అమెరికా, చైనా నుంచే వచ్చాయి. ఇంతకీ ఈ చిత్రం ఎన్నికోట్లు సాధించిందో తెలుసా.. అక్షరాల తొమ్మిది వేల కోట్లకు పైగానే.