కె.విశ్వనాథ్‌కు ఫాల్కే అవార్డు ప్రదానం
న్యూఢిల్లీ: భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారమైన ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్టు’ను దర్శకుడు కె.విశ్వనాథ్ బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదగా అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ఈ అవార్డును విశ్వనాథ్‌కు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విశ్వనాథ్...‘ఎందరో మహానుభావులు..అందరికీ ధన్యవాదాలు అంటూ’ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
ప్రపంచంలో ఎక్కడ అభిమానులు ఉన్నా వారందరికీ నా ధన్యవాదాలు అని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు... విశ్వనాథ్‌కు అభినందనలు తెలిపారు. ఆయన చిత్రాలలో హింస, అశ్లీలత ఉండదని ప్రశంసించారు. గతంలో విశ్వనాథ్ రూపొందించిన 'శంఖరాభరణం' సినిమాకు జాతీయ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. అలాగే పది ఫిల్మ్‌ఫేర్, అయిదు నేషనల్ ఫిల్మ్‌పేర్, ఆరు నంది అవార్డులను అందుకున్నారు.
కాగా దేశ సినిమా పరిశ్రమ అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తులకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందజేస్తారు. దీన్ని భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 1969లో ఏర్పాటు చేసింది. ఈ బహుమతి కింద స్వర్ణ కమలం,శాలువా, రూ. పది లక్షలు ఇస్తారు.