
సాక్షి, తమిళసినిమా : దేశంలో ఎక్కడ చూసినా #మీటూ ఉద్యమం గురించే చర్చ జరుగుతోంది. ఎంతోకాలంగా తమలో దాచుకున్న ఆవేదనను ఈ ఉద్యమం ద్వారా మహిళలు బయటపెడుతున్నారు. మృగాళ్ల వేధింపుల గురించి బయటి ప్రపంచానికి చాటి చెప్తున్నారు. మీటూ ఉద్యమంతో మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించిన బడాబాబుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒక కేంద్ర మంత్రి సహా ఎంతోమంది ప్రముఖులు ఇప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మీటూ ఉద్యమానికి చాలామంది మద్దతుగా పలుకుతుండగా.. తాజాగా నటి కాజల్ అగర్వాల్ ఈ విషయంపై స్పందించారు.
‘ఇప్పుడు చాలామంది తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా బయటకు చెప్పే సాహసం చేస్తున్నారు. ఇది స్వాగతించదగ్గ పరిణామం. ఇలా ముందుకు వస్తున్న వారందరికీ నా అభినందనలు. వారందరికీ నా మద్దతు ఉంటుంది’ అని కాజల్ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇలాంటి కష్టకాలంలో మహిళలు తమను తాము కాపాడుకోవడానికి ఒకరికొకరు అండగా నిలవాల్సిన అవసరముందని ఆమె తెలిపారు. పబ్లిసిటీ, ప్రచారం కోసం మహిళలు ఇలాంటివి విషయాలు మాట్లాడుతున్నారని కొందరు చేస్తున్న విమర్శలను కాజల్ ఈ సందర్భంగా తప్పుబట్టారు. ప్రచారం కోసమే కొందరు మహిళలు ఇలా చేస్తున్నారంటూ మీటూ ఉద్యమాన్ని చిన్నబుచ్చవద్దని, ఇలా పేర్కొనడం ద్వారా మీ ఆలోచనస్థాయిని, ఉద్దేశాలను బయటపెట్టుకుంటున్నారని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment