తమిళసినిమా: ఎంత పెద్ద నటికైనా జీవితంలో ఎత్తుపల్లాలు ఎదుర్కోకతప్పదు. కెరీర్ కాస్త డల్ అవగానే ఆ నటి పనైపోయిందనే భావనకు రావడం కరెక్ట్ కాదు. నటి కాజల్ అగర్వాల్ కూడా దక్షిణాదిలో ప్రస్తుతం అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. ముఖ్యంగా కోలీవుడ్‌లో ప్యారిస్ ప్యారిస్ అనే ఒక్క చిత్రం మాత్రమే చేతిలో ఉంది. అయితే తను మాత్రం ఈ చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకుంది. ప్యారిస్ ప్యారిస్ ఇది బాలీవుడ్ చిత్రం క్వీన్‌కు రీమేక్. ఇదే చిత్రం తెలుగులో దటీజ్ మహాలక్ష్మి పేరుతోనూ, కన్నడంలో బటర్‌ఫ్లై పేరుతోనూ, మలయాళంలో జామ్ జామ్ పేరుతోనూ నాలుగు భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతోంది. హిందీలో నటి కంగనా రణౌత్ నటించిన పాత్రను తమిళంలో కాజల్‌అగర్వాల్, తెలుగులో తమన్నా, మలయాళంలో మంజిమామోహన్, కన్నడంలో ఫరూఖ్ యాదవ్ పోషిస్తున్నారు.
తమిళ వెర్షన్‌లో నటిస్తున్న అనుభవం గురించి కాజల్ తెలుపుతూ హిందీ చిత్రం క్వీన్‌లో కంగనా రణౌత్ నటన చూసి మైమరచి పోయానని చెప్పింది. నాలుగు గోడల మధ్య నుంచే గొంగళి పురుగు లాంటి అమ్మాయి సీతాకోకచిలుకగా మారిన కథే ఇదని చెప్పింది. ఇలాంటి కథా చిత్రాల్లో నటించాలన్నది తన చిరకాల ఆశ అని పేర్కొంది. అయితే మొదట ఈ చిత్ర దర్శక నిర్మాతలు తనను కలిసి నటించమని కోరినప్పుడు కాస్త సంకోచించానని చెప్పింది. అయితే ఇప్పుడు చిత్రం రూపొందుతున్న తీరు చూసి చాలా సంతృప్తిగా ఉందని అంది. ఈ చిత్రం ఒక్కో భాషలో ఒక్కో నటి నటించడం స్వాగతించదగ్గ విషయంగా పేర్కొంది. తమిళ వెర్షన్ ప్యారిస్ ప్యారిస్‌లో తాను నటించడం ఘనంగా భావిస్తున్నానని చెప్పింది. చిత్ర దర్శకుడు రమేశ్ అరవింద్ ఒక నటుడు కావడంతో తన పాత్రలో సహజంగా నటించడంలోనూ, ప్రతి సన్నివేశం భావాన్ని గ్రహించి అర్థవంతంగా నటించి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు వారి అంచనాలను పూర్తి చేయడానికి ఎంతగానో సహకరిస్తున్నారని తెలిపింది. ప్యారిస్ ప్యారిస్ చిత్రం తన కెరీర్‌లో గుర్తుండిపోతుందనే అభిప్రాయాన్ని కాజల్‌అగర్వాల్ వెలిబుచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment