
డాక్టర్ రానా... ప్రెగ్నెంట్ కాజల్!!
ప్రెగ్నెంట్ కాజల్ అగర్వాల్ మెడికల్ టెస్టులు చేయించుకోవడం కోసం కర్నూల్ జిల్లాలోని ఓ హాస్పటల్‌కి వెళ్లారు. అక్కడ డాక్టర్ రానా దగ్గుబాటి ఆమెకు స్కానింగ్, గట్రా చేశారు. చట్టరీత్యా నేరం కాబట్టి కాజల్‌కు పుట్టబోయేది అమ్మాయా? అబ్బాయా? అనేది మాత్రం చెప్పలేదు. వెయిట్... వెయిట్... ఒక్క నిమిషం ఆగండి! రానా డాక్టర్ అయ్యిందెప్పుడు? కాజల్ ప్రెగ్నెంట్ కావడం ఏంటి? అనుకుంటున్నారా!! తేజ దర్శకత్వంలో నటిస్తున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ కోసం ఒకరు డాక్టర్, మరొకరు ప్రెగ్నెంట్ అయ్యారు.
ఇటీవలే డాక్టర్‌గా రానా, ప్రెగ్నెంట్‌గా కాజల్ నటించిన సన్నివేశాలు తెరకెక్కించారట! ‘నేనే రాజు నేనే మంత్రి’లో రాజకీయ నాయకుడి పాత్రలో రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డాక్టర్ అంటే... వైద్య వృత్తిలో నుంచి రాజకీయాల్లో వచ్చిన వ్యక్తిగా రానా కనిపిస్తారేమో మరి! లేదంటే... డ్యూయల్ రోల్ ఏమైనా చేస్తున్నారా! వెయిట్ అండ్ సీ!! రానా సరసన కాజల్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను డి. సురేశ్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్ చౌదరి నిర్మిస్తున్నారు.
నెం.1 ఎవరు?
ఎవరు? నంబర్ వన్ ఎవరు? అంటున్నారు రానా! ఇప్పుడీ నంబర్ల గోల ఎందుకు? అంటే... త్వరలో ఆయన బుల్లితెరపై అడుగుపెట్టనున్నారు. ‘నెం.1 యారి’ అనే టీవీ కార్యక్రమానికి రానా వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ‘యారి’ అంటే ‘ఎవరు’ అని అర్థం అయ్యుండొచ్చు. ఈ కార్యక్రమం జెమిని టీవీలో ప్రసారం కానుంది. నిన్న ఈ న్యూస్ కన్ఫర్మ్ చేసిన రానా, ‘నెం.1 యారి’ టీజర్ విడుదల చేశారు. ‘బిగ్ బాస్’కి ఎన్టీఆర్, ఇప్పుడీ ‘నెం.1 యారి’కి రానా... మరి హోస్ట్‌గా టీవీపై అడుగుపెట్టే నెక్స్›్ట యంగ్ హీరో ఎవరో? వీళ్ల బాటలో ఇంకెంతమంది నడుస్తారో!!