లారెన్స్‌కు నో చెప్పిన కాజల్ | Kajal says no to Lawrence | Sakshi
Sakshi News home page

లారెన్స్‌కు నో చెప్పిన కాజల్

Published Sun, Jul 5 2015 3:52 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

లారెన్స్‌కు నో చెప్పిన కాజల్ - Sakshi

లారెన్స్‌కు నో చెప్పిన కాజల్

ప్రముఖ నృత్యదర్శకుడు లారెన్స్ ఇప్పుడు నటుడుగా, దర్శకుడుగా, నిర్మాత గానూ మంచి ఫామ్‌లో ఉన్నారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాంచన, కాంచన-2 చిత్రాల విజయాలే అందుకు నిదర్శనం. అలాంటి లారెన్స్ చిత్రంలో నటించడానికి నటి కాజల్‌అగర్వాల్ నో చెప్పడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. నిజానికి కాజల్‌కు కోలీవుడ్‌లో సాధించిన విజయాల సంఖ్య వేళ్లలోనే. తొలి విజయాన్ని నాన్‌మహాన్ అల్ల చిత్రంతో చాలా పోరాటం తరువాత అందుకున్నారు.

అయినా తమిళసినిమా ఈ అమ్మడిని దూరంగా పెట్టింది. అలా చాలా గ్యాప్ తరువాత విజయ్‌తో జత కట్టిన తుపాకీ, జిల్లా చిత్రాల విజయాలు కాజల్ ఖాతాలో పడ్డాయి. ఆ తరువాత మళ్లీ గ్యాప్. కారణం అధిక పారితోషికం డిమాండ్, చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనక పోవడం అన్నది కోలీవుడ్ వర్గాల వెర్షన్. కొంత కాలం తరువాత ఇటీవల రీఎంట్రీ అయ్యారు. ధనుష్ సరసన మారి, విశాల్‌కు జంటగా పాయంపులి చిత్రాల్లో నటిస్తున్నారు.

ఈ రెండు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. త్వరలో విక్రమ్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరిగినా ఇప్పుడా చిత్రమే డ్రాప్ అంటున్నారు పరిశ్రమ వర్గాలు. సో కాజల్ డైరీ కోలీవుడ్‌లో నిల్ అన్నమాట. ఇలాంటి సమయంలో హిట్ చిత్రాల నటుడు,దర్శకుడు నిర్మాత లారెన్స్ నుంచి అవకాశం వస్తే కాజల్ అందుకోకపోవడం చర్చనీయాంశం అవడం సహజమేగా. ఇక్కడ విషయం ఏమిటంటే లారెన్స్ తన తమ్ముడు ఎల్విన్‌ను హీరోగా పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో ఒక చిత్రం నిర్మించనున్నారు.

ఈ చిత్రంలో ప్రముఖ నాయకి అయితే బాగుంటుందని కాజల్‌అగర్వాల్‌ను సంప్రదించారు. అయితే పెద్ద హీరోలతోనే నటించాలని నిర్ణయించుకున్నానన్న సాకుతో ఆమె నో చెప్పారట. పారితోషికం విషయంలో సంశయిస్తుందేమేన్న ఆలోచనతో లారెన్స్ రెండు కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధం అన్నా కాజల్ సారీ అన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement