ఇక్కడేమో సిమ్రన్ తండ్రి ఆమె చేతిని పట్టుకుని నిల్చున్నాడు.. అటు చూస్తే సిమ్రన్ తన జీవితంలోకి రాలేదనే బాధతో రాజ్ బేలగా చూస్తుంటాడు. పాపం సిమ్రన్ ఇటు తండ్రిని కాదనలేక.. అటు దూరమవుతున్న ప్రియున్ని దక్కించుకోలేక అసహాయంగా చూస్తుంటోంది. ఇంతలో రైలు కదులుతుంది. అంతా అయిపోయింది అనుకుంటున్న సమయంలో సిమ్రన్ తండ్రి కూతురుని చూస్తు ‘వెళ్లు సిమ్రన్ నువ్వు కోరుకున్న ప్రపంచంలోకి’ అంటూ కూతురి చేయిని వదిలేస్తాడు. అంతే దూరమవుతున్న ప్రియున్ని చేరుకోవడం కోసం సిమ్రన్ కదులుతున్న రైలుతో పాటే తాను పరిగెడుతుంది. రాజ్, సిమ్రన్ చేతిని అందుకుని రైలులోకి ఎక్కిస్తాడు. దాంతో కథ సుఖాంతం అవుతుంది. ఈ సన్నివేశం 23 ఏళ్ల క్రితం హిందీ సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరగ రాసిన ఓ హిట్ చిత్రంలోనిది. ఇంతకు ఆ సినిమా ఏదో గుర్తుకొచ్చిందా.. అదే ‘దిల్ వాలే దుల్హానియే లే జాయేంగే’.
ఆదిత్య చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సిమ్రన్‌గా ‘కాజోల్’, ‘రాజ్’గా షారుక్ ఖాన్ జీవించారు. నాటి నుంచి కాజోల్ అబ్బాయిల ‘డ్రీమ్‌గర్ల్’గా, కింగ్ ఖాన్ షారుక్ అయితే ‘రొమాన్స్ కింగ్’గా నిలిచిపోయారు. ఈ చిత్రం విడుదలై నేటికి రెండు దశాబ్దాలు కావొస్తోన్నా ఇప్పటికీ ఈ సినిమాకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. అయితే ఈ క్రెడిట్ అంతా దర్శకుడు ఆదిత్య చోప్రాకే దక్కుతుందంటున్నారు ‘సిమ్రన్’ కాజోల్. ఈ మధ్యే ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా కాజల్ ‘దిల్‌వాలే దుల్హానియే లే జాయేంగే’ చిత్రం షూటింగ్ విశేషాలను గుర్తుచేసుకున్నారు.
కాజోల్ మాటల్లో.. ‘డీడీఎల్‌జే చిత్రంలో నేను పరిగెత్తుతూ రైలులోకి ఎక్కే ఆ సీన్ ఒక ఐకానిక్ సీన్‌గా నిలిచిపోయింది. ఈ సీన్ ఇప్పటికే చాలా సినిమాల్లో వాడారు కూడా. అంత క్రేజ్ వచ్చిన ఈ సీన్ షూట్ చేయడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ సీన్ తీసే సమయంలో వాతావరణం చాలా వేడిగా ఉండటంతో చిరాకు వచ్చేది. నా జుట్టు గాలికి ఎగురుతూ వీర విహారం చేసేది. దానికి తోడు ఆ రైలు మేము అనుకున్న స్పీడ్‌లో కాకుండా మరింత వేగంగా వెళ్లేది. రీ షూట్ చేయాలంటే మళ్లీ ఆ రైలు వచ్చే వరకూ అంటే దాదాపు 20 నిమిషాల పాటు ఎదురు చూడాల్సిందే. ఆ సమయంలో రాజ్ నన్ను అలా పరిగెత్తించే బదులు చైన్ లాగి రైలు ఆపితే అయిపోయేది కదా అనిపించేది’ అంటూ కాజల్ చెప్పుకొచ్చారు.
అంతేకాక ‘ఇంత శ్రమకోర్చి తీసిన ఈ సన్నివేశం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రిలోనే ఒక మైలురాయిగా నిలిచి పోయింది. కానీ ఇందులో నా గొప్పతనం ఏం లేదు. ఈ క్రెడిటంతా ఆదిదే’(దర్శకుడు ఆదిత్య చోప్రా) అంటూ కాజోల్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment