ముంబై: పదేళ్ల తర్వాత మరోసారి వెండితెరపై భర్యాభర్తలుగా కనిపించబోతున్నారు బాలీవుడ్ జంట కాజోల్- అజయ్ దేవ్‌గణ్. ‘తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరాఠా అధినేత ఛత్రపతి శివాజీ సామ్రాజ్యంలో సుబేదార్‌గా పనిచేసిన మరాఠా యోధుడు తానాజీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న కాజోల్.. సోషల్ మీడియా బ్లాగ్ హ్యూమన్స్ ఆఫ్ బాంబేతో తన ప్రేమకథ, పెళ్లి గురించి చెప్పుకొచ్చారు. తానూ, అజయ్ నాలుగేళ్ల పాటు ప్రేమలో మునిగితేలామని.. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత పెద్దల అనుమతితో ఒక్కటమయ్యామని తెలిపారు. చాలా రోజులపాటు హనీమూన్ ఎంజాయ్ చేద్దామనుకుంటే.. అజయ్ అనారోగ్యం బారిన పడటంతో ఇంటికి తిరిగి రావాల్సి వచ్చిందంటూ చిలిపి సంఘటనలను గుర్తుచేసుకున్నారు.
అలా మొదలైంది..
‘25 ఏళ్ల క్రితం హల్చల్ సినిమా సెట్లో మేం కలుసుకున్నాం. షాట్ రెడీ అనగానే.. నా హీరో ఎక్కడ ఉన్నాడు అడిగాను. అక్కడున్న వాళ్లు అజయ్ వైపు చూపించారు. ఓ మూలన గంభీరంగా కూర్చుని ఏదో ఆలోచిస్తున్న హీరోను అప్పుడే చూశాను. తర్వాత మాటలు కలిపాం. మంచి స్నేహితులమయ్యాం. నిజానికి నేను అప్పుడు వేరే అబ్బాయితో డేటింగ్లో ఉన్నాను. అతడి గురించి అజయ్‌కు అప్పుడప్పుడు చాడీలు చెప్పేదాన్ని. కొన్నాళ్ల తర్వాత బ్రేకప్ అయ్యింది. ఒకరి గురించి ఒకరం పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నేను అజయ్ చేతిని పట్టుకున్నాను. చిత్రమేమిటంటే మేం ఎప్పుడూ ఒకరికొకరం ప్రపోజ్ చేసుకోలేదు.
కార్లలోనే ఎక్కువ జీవితం గడిపాం!
మా ప్రేమ ప్రయాణంలో ఎక్కువ జీవితం కార్లలోనే గడిపాం. తరచుగా డిన్నర్లు, లాంగ్‌డ్రైవ్‌లకు వెళ్లేవాళ్లం. నేనేమో దక్షిణ బాంబేలో.. తను జుహులో. తనతో కలిసి వెళ్తున్న ప్రతీసారీ నా స్నేహితులు నన్ను హెచ్చరించేవారు. కానీ తను నాతో ఎంతో మర్యాదగా ప్రవర్తించేవాడు. సరదాగా ఉండేవాడు. అలా నాలుగేళ్లు ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత మా పెద్దలకు చెప్పాం. అజయ్ తల్లిదండ్రులు వెంటనే సరే అన్నారు గానీ.. మా నాన్న మాత్రం ముందు కెరీర్ మీద దృష్టి పెట్టమని సూచించారు. అయితే నేను మాత్రం పట్టు వదలకపోవడంతో ఆయన కూడా అంగీకరించారు.
పూజారికి లంచం ఇవ్వబోయాడు..
మేము ఎంతగానో ఎదురుచూసిన పెళ్లిరోజు రానే వచ్చింది. పంజాబీ, మరాఠీ సంప్రదాయాల్లో మా వివాహం జరిగింది. అగ్నిహోత్రం చుట్టూ తిరిగేటప్పుడు అజయ్.. పూజారిని వేగిరపెట్టాడు. తంతు తొందరగా పూర్తి చేయాలంటూ లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడు. అలా పెళ్లి జరిగిపోయింది. తర్వాత హనీమూన్ ట్రిప్‌లో భాగంగా సిడ్నీ, హవాయి, లాస్ ఏంజెల్స్ చుట్టివచ్చాం. ఇంకో ఐదు వారాల పాటు ట్రిప్ కొనసాగాల్సింది. ఈజిప్టు కూడా వెళ్లాలనుకున్నాం. కానీ అజయ్ ఆరోగ్యం పాడవడంతో..‘ బేబీ.. నాకు తర్వాతి ఫ్లైట్ బుక్ చెయ్యి.. వెళ్లిపోతా’ అని ముఖం పెట్టాడు. అంతే వెంటనే తిరిగి వచ్చేశాం అంటూ కాజోల్ తమ మధురు ఙ్ఞాపకాల గురించి చెప్పుకొచ్చారు.(తాన్హాజీ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
తరచూ గర్భస్రావాలు.. వేదనకు గురయ్యాం
పెళ్లైన వెంటనే తాము పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నామని... అయితే వరుసగా గర్భస్రావాలు కావడంతో తీవ్ర వేదనకు గురయ్యామని కాజోల్ పేర్కొన్నారు. కొన్నాళ్ల తర్వాత నైసా జన్మించిందని.. ఆ తర్వాత యుగ్ కూడా రావడంతో తమ కుటుంబం పరిపూర్ణమైందని హర్షం వ్యక్తం చేశారు. తర్వాత అజయ్ సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెట్టాడని.. తను ఇప్పుడు ‘సెంచరీ’ కొట్టబోతున్నాడని(వందో సినిమాలో నటిస్తున్నాడని) చెప్పుకొచ్చారు. తనతో జీవితం తృప్తిగా ఉందని.. హనీమూన్‌లో అజయ్ తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు... తనను తొందరగా ఈజిప్టు ట్రిప్‌నకు వెళ్లమని పోరు పెడుతున్నానని సరదాగా వ్యాఖ్యానించారు. కాగా హల్చల్ సినిమా తర్వాత గూండారాజ్, ఇష్క్, దిల్ క్యా కరే, రాజూ చాచా, ప్యార్ తో హోనా హై థా వంటి సినిమాల్లో వీరిద్దరు కలిసి నటించారు. 1999లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు కూతురు నైసా, కుమారుడు యుగ్ సంతానం.
Comments
Please login to add a commentAdd a comment