
కాలా.. అదిరిపోలా...
ఆ దేవుడు శాసిస్తాడు.. ఈ అరుణాచలం పాటిస్తాడు’.. రజనీకాంత్ నటించిన ‘అరుణాచలం’ సినిమాలోని పాపులర్ డైలాగ్ ఇది. రియల్ లైఫ్‌లో దర్శకుడు పా. రంజిత్ ఈ డైలాగ్‌ను పాటిస్తున్నట్లున్నారు. ఎందుకంటే, రజనీకి ‘కరికలాన్’ అనే పేరంటే ఇష్టమట. రంజిత్ దగ్గర ఈ విషయం చెప్పగానే ఆ టైటిల్ పెట్టేశారు.
మరి.. సూపర్ స్టార్ ఇష్టాన్ని కాదంటారా? ‘కబాలి’ తర్వాత రజనీకాంత్ హీరోగా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గురువారం సాయంత్రం విడుదల చేశారు. ఈ లుక్ చూసి రజనీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రజనీ అల్లుడు, హీరో ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ‘కాలా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ కింద క్యాప్షన్‌గా ‘కరికాలన్’ అని పెట్టారు. ‘‘సినిమాలో రజనీ పాత్ర పేరు కాలా. ఫుల్ నేమ్ కరికాలన్’’ అని రంజి పేర్కొన్నారు.
కాలా అంటే తమిళనాడులోని నెల్లై జిల్లాలో యముడు అని, కరికలాన్ అంటే యోధుడు అని అర్థం అట. ముంబయ్‌లో నివసిస్తున్న నెల్లై ప్రజల జీవితాల గురించి ఈ సినిమా ఉంటుందట. ఇందులో రజనీ అండర్ వరల్డ్ డాన్‌గా కనిపిస్తారని సమాచారం. ఆయన సరసన బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషీ నటించనున్నారు. ‘నా బంగారు తల్లి’ ఫేమ్ అంజలీ పాటిల్ ఈ చిత్రానికి ఛాన్స్ దక్కించుకున్నారు. మరి.. కథానాయికగానా? కీలక పాత్రకా? అనేది తెలియాల్సి ఉంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ స్వరకర్త. ఈ నెల 28న రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవుతుంది.