సిక్స్ ప్యాక్ జర్నలిస్ట్
మాటల్లో వగరు.. చూపుల్లో పొగరు.. ఫైట్స్‌లో పవరు.. పూరి జగన్నాథ్ హీరోల్లో అన్నీ సూపరు. పూరి స్టైలే సపరేటు. ఆ స్టైల్ నందమూరి కల్యాణ్‌రామ్‌కి బాగా సూటైనట్లు కనిపిస్తోంది. కళ్లలో కసి.. నోట్లో సిగరెట్.. సిక్స్‌ప్యాక్ బాడీతో చాలా కొత్తగా కనిపిస్తున్నారాయన. కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తూ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘ఇజం’. అదితీ ఆర్య హీరోయిన్. ప్యాచ్‌వర్క్ మినహా చిత్రీకరణ పూర్తయింది. విజయ దశమికి చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నారు.
పూరి మాట్లాడుతూ - ‘‘జర్నలిస్టుగా కల్యాణ్‌రామ్ ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. హీరోగా కల్యాణ్‌రామ్‌కు, దర్శకుడిగా నాకు ఓ డిఫరెంట్ సినిమా అవుతుంది. ఇటీవల స్పెయిన్‌లో జరిగిన భారీ షెడ్యూల్‌తో షూటింగ్ దాదాపుగా పూర్తయింది’’ అన్నారు. జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ల భరణి, పోసాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కళ: జానీ, కూర్పు: జునైద్, కెమేరా: ముఖేశ్, సాహిత్యం: భాస్కరభట్ల, సంగీతం: అనూప్ రూబెన్స్.