జీవిత కథను తెరకెక్కిస్తా
ముంబై: కంగనా రనౌత్ ఇప్పటిదాకా కెమెరా ముందు నటించిన కథానాయిక మాత్రమే. ఇకపై ఈమెను నటి కంగనా.. అనేకంటే దర్శకురాలు కంగనా అనాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సుందరి త్వరలో దర్శకురాలిగా మారనుంది. దర్శకురాలిగా ఈమెకు అనుభవం కూడా ఉందండోయ్. అమెరికాలో ఓ లఘు చిత్రానికి దర్శకత్వం వహించింది. నాలుగేళ్ల చిన్నారి, ఓ కుక్కను కథావస్తువుగా తీసుకొని తెరకెక్కించిన ఈ లఘుచిత్రానికి మంచి స్పందనే వచ్చింది. అయితే ఈసారి ఈ చిన్నాచితకా సినిమాలు తీయడం కాకుండా ఓ జీవితకథను పూర్తిస్థాయి సినిమాగా తెరకెక్కించాలని ఉవ్విళ్లూరుతోంది.
ఎవరి జీవితకథను తెరకెక్కిస్తున్నారు? అనే ప్రశ్నను అడిగితే.. ‘అది మాత్రం సస్పెన్స్’ అని చెబుతోంది. అయితే దర్శకురాలిగా మారేందుకు ఇంకా సమయముందని, తానిప్పుడు రెండు పలు చిత్రాల చిత్రీకరణతో తీరికలేకుండా గడుపుతున్నానని చెప్పింది. దర్శకత్వం వహించేందుకు ముందు కాస్తా సిద్ధం కావాల్సి ఉంటుందని, అందుకు తనకు కనీసం ఏడాదైనా అవసరమని చెబుతోంది. అయితే బాలీవుడ్‌లో చాలామంది తారలు నిర్మాతలుగా స్థిరపడ్డారని, తనకు మాత్రం అలాంటి ఆలోచన లేదని చెప్పింది.
నిర్మాతగా మారడం చాలా సులభమైన విషయమని, దర్శకురాలిగా మారాలంటే మాత్రం భారీగానే కసరత్తు చేయాల్సి ఉంటుందని చెప్పింది. ఇక ‘క్రిష్-3’ చిత్రంలో తన పాత్ర విశేషాలను వివరిస్తూ... ‘చిత్రంలో నా పాత్ర భిన్నమైంది. ఓ రకంగా సూపర్ ఉమెన్ పాత్ర. గ్రహాంతరవాసిని పోలి ఉంటుంది. ఇందులో నా పేరు కాయా. ఈ పాత్ర కోసం బాగానే శ్రమించాల్సి వచ్చింది. సవాలు విసిరే ఇటువంటి పాత్రలంటే నాకెంతో ఇష్టమ’ని చెప్పింది.