
మనసులో ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొడతారనే పేరుంది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌కి. అది ఏ విషయం అయినా సరే సుత్తి లేకుండా సూటిగా చెబుతుంటారామె. ఇది చాలా మందికి నచ్చదు. అయినప్పటికీ ముక్కుసూటిగా మాట్లాడటంలో వెనకంజ వేయడం లేదు కంగన. తాజాగా ‘మణికర్ణిక’ ప్రమోషన్‌లో భాగంగా ఆమిర్ ఖాన్, ఆలియా భట్‌లపై మండిపడ్డారామె. ‘‘ఆలియా నాకు ‘రాజీ’ ట్రైలర్ పంపించి, సపోర్ట్ చేయమన్నారు.
ఆమిర్ ‘దంగల్’ మూవీ ప్రమోషన్‌లో పాల్గొనమని చెప్పారు. ఇవి రెండూ సందేశాత్మక చిత్రాలు కావటంతో సపోర్ట్ చేశాను. ఇప్పుడు ధీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి నేపథ్యంలో నేను చేసిన ‘మణికర్ణిక’ సినిమాకి ఎవరూ సహకరించడం లేదు. బాలీవుడ్‌లో బంధుప్రీతికి వ్యతిరేకంగా గతంలో నేను మాట్లాడటం వల్లే అందరూ నాపై కక్ష కట్టారు’’ అని పేర్కొన్నారు. ఈ విమర్శలకు ఆలియా స్పందిస్తూ – ‘‘ఒక వ్యక్తిగా, నటిగా కంగన అంటే ఇష్టమే. ఆమెలా మాట్లాడటానికి ధైర్యం కావాలి. షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్లే ‘మణికర్ణిక’ గురించి స్పందించలేకపోయా. కంగనాను కలిసి క్షమించమని అడుగుతా’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment