
'క్వీన్' అరుదైన ఘనత
ముంబై: హీరో హృతిక్ రోషన్ తో వివాదాలతో నలిగిపోతున్న బాలీవుడ్ హీరోయిన్ కంగనా రౌనత్ కు తీపికబురు అందింది. జాతీయ ఉత్తమ నటిగా ఆమె ఎంపికైంది. 29 ఏళ్ల కంగనా రౌనత్ మూడోసారి జాతీయ అవార్డుకు ఎంపికై అరుదైన ఘనత సాధించింది. 63వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను సోమవారం ప్రకటించారు. 'తను వెడ్స్ మను రిటర్న్స్' సినిమాలో నటనగానూ కంగన ఉత్తమ నటిగా ఎంపికైంది. వరుసగా రెండో పర్యాయం ఆమె ఈ అవార్డు దక్కించుకుంది. 'క్వీన్' చిత్రానికి గతేడాది ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. 'ఫ్యాషన్' సినిమాలో నటించినందుకు 2009లో ఉత్తమ సహాయ నటి పురస్కారం సొంతం చేసుకుంది.
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నాలుగోసారి జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. 'పీకు' సినిమాలో నటనకుగానూ ఆయనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. 73 ఏళ్ల అమితాబ్ గతంలో అగ్నిపథ్, బ్లాక్, పా సినిమాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నారు.