
ఎవరికైనా గాయాలు తగిలితే నవ్వుతారా? పోనీ ఏడవకపోయినా కాస్త అయినా బాధగా కనిపిస్తారు కదా! కానీ, కంగనా రనౌత్ డిఫరెంట్. గాయాన్ని కూడా లైట్‌గా తీసుకునేంత బోల్డ్. రాణీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘మణికర్ణిక’లో ఆమె నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కంగన టైటిల్ రోల్ చేస్తున్నారు. రాణి అంటే కత్తియుద్ధాలు చేయాలి. అందుకే ఈ సినిమా కోసం స్వోర్డ్ ఫైటింగ్, హార్స్ రైడింగ్ నేర్చుకున్నారామె. యుద్ధ సన్నివేశాలను కంగన అద్భుతంగా చేస్తున్నారని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం జోథ్‌పూర్‌లో ఓ సీన్ తీస్తుండగా ఆమె గాయపడ్డారు. గోడ మీద నుంచి గుర్రం పైకి దూకే సన్నివేశం అది.
ఈ సీన్ తీస్తున్న సమయంలో కంగన పొరపాటున పడిపోయారు. అంతే.. కుడి కాలు బెణికింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళితే, ఫ్రాక్చర్ కాలేదు కానీ, ఓ వారం రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందేనని డాక్టర్ సూచించారు. దాంతో జోథ్‌పూర్ టు ముంబై వెళ్లిపోయారు కంగన. ఆస్పత్రి నుంచి బయటికొస్తున్నప్పుడు ‘గాయపడ్డానోచ్’ అని చెబుతున్నట్లుగా చిరునవ్వులు చిందించారామె. అన్నట్లు.. ఈ సినిమా షూటింగలో కంగన గాయపడడం ఇది మొదటిసారి కాదు. నాలుగు నెలల క్రితం హైదరాబాద్‌లో కత్తి యుద్ధం సన్నివేశాలు తీస్తున్నప్పుడు చిన్నపాటి గాయం తగిలింది. అయినా ఇలాంటి గాయాలను లెక్క చేసే టైప్ కాదు కంగన.