
కనిపించడం లేదు. ఒరలో ఉన్న కత్తి వాడి కనిపించడం లేదు. కానీ, కళ్లలో వాడి కనిపిస్తోంది. ముఖంలో రాజసం ఉట్టిపడుతోంది. ఆహార్యం అదిరిపోయేలా ఉంది. ఇదంతా ఫొటోలో మీరు చూస్తున్న మణికర్ణిక గురించే. క్రిష్ దర్శకత్వంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘మణికర్ణిక’. ‘ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ అనేది ఉపశీర్షిక. ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరుగుతోన్న ఈ సినిమా షెడ్యూల్ మంగళవారం కంప్లీట్ అయ్యింది. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోలు ఆ షెడ్యూల్‌లోనివే. చిత్రబృందం అధికారికంగా విడుదల చేసినవి కాదు. ఎలాగో బయటికొచ్చాయి.
ఎలా వస్తేనేం... కంగనా గెటప్ అదిరిపోయింది కదూ! నెక్ట్స్ షెడ్యూల్ జోద్‌పూర్‌లో జరగనుందట. ‘బాహుబలి’, ‘భజరంగీ భాయిజాన్’ వంటి హిట్ చిత్రాలకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథ అందించారు. శంకర్– ఎహసాన్–లాయ్ త్రయం స్వరకర్తలు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 27న విడుదల చేయాలనుకుంటున్నారు. ‘క్వీన్’ తర్వాత కంగనాకు ఆ స్థాయిలో పేరు తెచ్చిపెట్టే చిత్రమవుతుందనే అంచనాలున్నాయి.