భయపడుతున్న కంగనా రనౌత్
ముంబై: మొన్న ‘క్వీన్’, నేడు ‘తనూ వెడ్స్ మను రిటర్న్స్’ హిట్లతో బాలీవుడ్‌లో దూసుకుపోతున్న హీరోయిన్ కంగనా రనౌత్‌కు తాను ఎప్పుడో నటించిన సినిమా ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధంగా ఉండడంతో భయం పట్టుకుంది. దీంతో ఆ సినిమా నిర్మాతలైన టీ-సిరీస్‌కు లీగల్ నోటీసు కూడా జారీ చేసింది.
ఆ సినిమా ఇప్పుడు తమ చేతుల్లో లేదని, ఎప్పుడో అమ్మేశామని, పైగా తనకు రావాల్సిన రెమ్యూనరేషన్‌ను నయాపైసతో సహా చెల్లించేశామంటూ టీ సిరీస్ నుంచి సమాధానం రావడంతో కంగనా రనౌత్ కంగుతింది. ఆమె 2011లో ‘ఐ లవ్ న్యూ ఇయర్’ అనే సినిమాలో హీరో సన్నీ డియోల్ సరసన నటించింది. ఇప్పుడు ఆ సినిమాను జూలై 10న విడుదల చేస్తున్నట్టు ఆ సినిమాను కొనుగోలు చేసిన టీ-సిరీస్ అనుబంధ సంస్థ ప్రకటించడంతో కంగనాకు కంగారు ఎక్కువైంది. ఆ సినిమా అట్టర్ ఫ్లాపైతే తన ఇమేజ్ దెబ్బతింటుందన్నది ఆమె భయం.
రష్యన్ చిత్రం ‘ఐరనీ ఆఫ్ ఫేట్’ స్ఫూర్తితో తీసిన ‘ఐ లవ్ న్యూ ఇయర్’ చిత్రానికి రాధికా రావు, వినయ్ సాప్రులు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2011లోనే పూర్తయిన ఇప్పటి వరకు రిలీజ్‌కు నోచుకోలేదు. ట్రెయిలర్లకు ప్రేక్షకుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో విడుదల తీదీలు వరుసగా వాయిదా పడుతూ వచ్చాయి. రాధికా రావు, వినయ్ సాప్రులు ఇంతకుముందు సల్మాన్ ఖాన్ ఫ్లాప్ సినిమా ‘లక్కీ: నో టైమ్ టు లవ్’కు దర్శకత్వం వహించారు.