
అమెరికాలో పాఠాలు!
కంగనా రనౌత్ ఇప్పుడు విద్యార్థినిలా మారిపోయారు. బుద్ధిగా పాఠాలు నేర్చుకుంటున్నారు. విచిత్రంగా ఉంది కదూ. విషయం ఏంటంటే... స్క్రిప్ట్ రైటింగ్ కోసం ఆమె అమెరికాలోని ఓ ఫిలిం స్కూల్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. కంగనాకి రచయిత్రిగా చేయాలని, దర్శకురాలిగా మారాలని.. ఇలా చాలా లక్ష్యాలున్నాయి. వాటిలో ఓ లక్ష్యం నెరవేర్చుకునే దిశలోనే ఆమె యూఎస్ వెళ్లారు. రెండు నెలల పాటు స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్ చేసి, ఇండియా వస్తారు. అనంతరం దూర విద్య ద్వారా ఈ కోర్స్‌ని కొనసాగిస్తారు. ఇక్కడికి వచ్చీ రావడంతోనే ‘తను వెడ్స్ మను’ సీక్వెల్ షూటింగ్‌లో పాల్గొంటారు కంగనా. తొలి భాగానికి దర్శకత్వం వహించిన ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలోనే ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో కంగనా ద్విపాత్రలు చేయనున్నారట. ఒకటి గ్లామరస్, ఇంకోటి డీ గ్లామరైజ్డ్ రోల్ అని సమాచారం.
సినిమాల పరంగా కంగనా మంచి ఫామ్‌లో ఉన్నారు. మరి.. వ్యక్తిగత విషయానికొస్తే... ‘పెళ్లెప్పుడు చేసుకుంటారు?’ అనే ప్రశ్న కంగనా ముందుంచితే -‘‘పెళ్లి గురించి ప్రస్తుతానికి ఆలోచించడంలేదు. ఒంటరిగా ఉండటం బాగుంది. కంపెనీ లేకపోయినా హాయిగా బతికేయగలుగుతాను. అయినా పెళ్లికన్నా ముఖ్యమైనవి నా జీవితంలో ఇంకా చాలా ఉన్నాయి. అందుకే పెళ్లి అనే ఆ ‘కమిట్‌మెంట్’ గురించి ప్లాన్ చేయడంలేదు’’ అని చెప్పారు.