
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా ‘భరత్ అనే నేను’ భారీ విజయపథం వైపు దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. తన సినిమాపై అభిమానులు చూపించిన ఆదరణకు మహేష్ బాబు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల నుంచి వస్తున్న ఆదరణకు మహేష్ బాబు ధన్యవాదాలు కూడా తెలిపారు. అయితే కేవలం తెలుగు, తమిళం, ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే మహేష్ తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. దీనిపై కన్నడ ప్రజలు మహేష్ బాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘హలో సార్.. మీ సినిమా కన్నడ భాషల్లో కూడా విడుదలైంది. కర్ణాటకలో 100కిపైగా స్క్రీన్లలో భరత్ అనే నేను సినిమాను విడుదల చేశారు. భరత్ అనే సినిమా విజయానికి కన్నడ అభిమానుల పాత్ర చాలా కీలకం. ఇక్కడ కూడా మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయినప్పటికీ మీరు కన్నడ అభిమానుల విషయంలో పక్షపాతం చూపించారు. మీకు కన్నడ అభిమానులు కనిపించడం లేదా? కనీసం కన్నడలో ధన్యవాదాలు చెప్పలేకపోయారా? అంటూ’ మండిపడ్డారు.
కర్ణాటక లేకపోతే మీ సినిమా జీరో, మీరు చేసిన పని చాలా షేమ్ అంటూ కామెంట్లు పెట్టారు. అన్ని భాషలకు సమానమైన ప్రాముఖ్యత ఇవ్వండని, ఎక్కువగా అభిమానులున్న కన్నడకు కూడా కాస్త గౌరవం ఇవ్వడంటూ మహేష్‌కు సూచించారు. తెలుగు అభిమానుల కంటే కూడా ఎక్కువగా కన్నడ ఫ్యాన్సే భరత్ అనే నేను సినిమాను చూశారన్నారు. కన్నడ అభిమానులపై మీరు చూపించిన ఈ పక్షపాతం, మీలో ఉన్న తెలివి తక్కువతనాన్ని ప్రతిబింబిస్తుందని మండిపడ్డారు. త్వరలోనే మీకు కన్నడ అభిమానులు గుణపాఠం చెబుతారని కొందరు హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం చేసిన ఫేస్‌బుక్, ట్విటర్‌లో మహేష్ చేసిన ఈ పోస్టుకు పెద్ద ఎత్తున కన్నడ అభిమానుల నుంచి ఆగ్రహం వ్యక్తమవడంతో, ఫేస్‌బుక్ పోస్టును మహేష్ ఎడిట్ చేసి కన్నడలో కూడా ధన్యవాదాలు తెలిపారు. అయితే ట్విటర్‌లో మాత్రం ఎడిట్ ఆప్షన్ లేకపోవడంతో, కన్నడ భాషను కూడా చేరుస్తూ మరోసారి అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment