
అందుకే రెండు పాటలు స్వరపరిచా!
‘‘ నేను బయటి సినిమాలకు సంగీతం అందించడం చాలా అరుదు. అప్పట్లో ఎప్పుడో ‘కన్నయ్య-కిట్టయ్య’ చిత్రానికి స్వరాలందించా. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ‘ఈ సినిమా సూపర్‌హిట్ గ్యారంటీ ’ సినిమా కోసం రెండు పాటలకు మ్యూజిక్ చేశా. ఈ చిత్ర దర్శక, నిర్మాతలు నాకు బాగా కావాల్సినవారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని నా ఆకాంక్ష ’’ అని ప్రముఖ దర్శకుడు వంశీ చెప్పారు. పి.యస్. త్రిలోక్ రెడ్డి సమర్పణలో సినీ నిలయ క్రియేషన్స్ పతాకంపై చెందు ముద్దు దర్శకత్వంలో పి.యస్.
సూర్యతేజా రెడ్డి నిర్మించిన చిత్రం ‘ఈ సినిమా సూపర్‌హిట్ గ్యారంటీ’. హెచ్.హెచ్. మహాదేవ్, ఐశ్వర్య అడ్డాల, పునర్ణవి, సిరిశ్రీ హీరో హీరోయిన్లు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘వంశీగారు మాపై అభిమానంతో అడిగిన వెంటనే రెండు పాటలకు సంగీతం అందించారు. ఈ సినిమాలో మంచి ఎంటర్‌టైన్‌మెంట్, డిఫరెంట్ స్క్రీన్‌ప్లే ఉంటుంది’’ అని దర్శకుడు చెప్పారు. ‘‘కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అని మహాదేవ్ అభిప్రాయపడ్డారు. హీరోయిన్ పునర్ణవి, సంగీత దర్శకుడు మారుతీరాజా కూడా మాట్లాడారు.