
ఎందరో కమెడియన్లను పరిచయం చేశా
ప్రముఖ దర్శకుడు వంశీ
మలికిపురం/సఖినేటిపల్లి : తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో మంది కామెడీ నటులను పరిచయం చేసిన ఘనత తనకే దక్కిందని ప్రముఖ సినీ దర్శకుడు వంశీ అన్నారు. కొత్త సినిమా కథను రూపొందించే క్రమంలో సోమవారం ఆయన మలికిపురం, మోరి గ్రామాల్లో పర్యటించారు. తొలి రోజుల్లో రూపొందించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలు ‘లేడీస్ టైలర్, శ్రీకనకమహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్’లను ఆయన మోరి , శివకోడు గ్రామాల్లో చిత్రీకరించారు.
ఆ గ్రామాలను కూడా ఆయన ప్రస్తుతం సందర్శించారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాతో తనది విడదీయరాని బంధం అన్నారు. గోదావరి నేపథ్యంలో అనేక సినిమాలు తీశానని, అవన్నీ విజయవంతం అయ్యాయని చెప్పారు. తాను రచించిన పసలపూడి కథలు ఎంతో ప్రాచుర్యం పొందాయన్నారు. కోటిపల్లి-కాకినాడ సింగిల్ రైలుపై తాను రాసిన కథ ఎంతో పేరు తెచ్చిందన్నారు.