రాయలసీమ రమ్మంటోంది | Telugu films with Rayalaseema backdrop | Sakshi
Sakshi News home page

రాయలసీమ రమ్మంటోంది

Jan 30 2025 12:13 AM | Updated on Jan 30 2025 6:00 AM

Telugu films with Rayalaseema backdrop

రాయలసీమ నేపథ్యం సినిమాలంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంటుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఎన్నో సినిమాలు తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీలో  బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌గా నిలిచాయి. ఇటీవలి కాలంలో బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన అల్లు అర్జున్‌ ‘పుష్ప: ది రూల్‌’ కూడా రాయలసీమ నేపథ్యంలో రూపొందిన సినిమాయే. కాగా ప్రస్తుతం ‘రాయలసీమ రమ్మంటోంది’ అంటూ కొందరు తెలుగు హీరోలు రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాల వివరాల్లోకి వెళితే...

అఖండ తాండవం
బాలకృష్ణ కెరీర్‌లో రాయలసీమ నేపథ్యంలో రూపొందిన ‘సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి, ఇటీవలి కాలంలో ‘అఖండ, డాకు మహారాజ్‌’ వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. హీరో బాలకృష్ణ–దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ‘అఖండ’ (2021) మూవీ అనంతపురం నేపథ్యంలో ఉన్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ మూవీకి సీక్వెల్‌గా బాలకృష్ణ– బోయపాటి శ్రీను కాంబినేషన్‌లోనే ‘అఖండ 2: తాండవం’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. 

ఇందులో హీరోయిన్‌ సంయుక్త ఓ కీ రోల్‌ చేస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ‘అఖండ 2: తాండవం’ కూడా ‘అఖండ’ సినిమా మాదిరి అనంతపురం నేపథ్యంలోనే ఉంటుందని ఊహించవచ్చు. ఈ సినిమాను సెప్టెంబరు 25న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

నవ్వించేకి వస్తుండా! 
‘కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈ తూరి నవ్వించేకి వస్తుండా!’ అని ఇటీవల తన కొత్త సినిమా గురించి వరుణ్‌ తేజ్‌  ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు. దీంతో వరుణ్‌ తేజ్‌ నెక్ట్స్‌ మూవీ రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని స్పష్టమైపోయింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ వియత్నాంలో జరుగుతున్నాయి. పనిలో పనిగా ఈ మూవీ చిత్రీకరణ కోసం లొకేషన్లను కూడా వెతుకుతున్నారు మేకర్స్‌. 

ఈ పనుల కోసం హీరో వరుణ్‌ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ ప్రస్తుతం వియత్నాంలోనే ఉన్నారు. హారర్‌–కామెడీ జానర్‌లో రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ మార్చి మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ సినిమా ప్రధానంగా అనంతపురం నేపథ్యంలో ఉంటుందని, ‘కొరియన్‌ కనక రాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మించనున్నాయి.

19వ శతాబ్దంలో...
‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో విజయ్‌ దేవరకొండ, దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించనున్న ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీ రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. 19వ శతాబ్దంలో 1854–1878 మధ్య కాలంలో జరిగిన కొన్ని చారిత్రక వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందనున్నట్లుగా తెలుస్తోంది. 

భారతదేశంలో బ్రిటిష్‌ పరిపాలన కాలంలో జరిగిన కొన్ని చారిత్రక అంశాలను ఈ మూవీలో ప్రస్తావించనున్నట్లు తెలిసింది. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభం కానుందట. ఈ మూవీలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలో ‘గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్‌’ చిత్రాల్లో విజయ్‌ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా నటించిన విషయం తెలిసిందే. అలాగే ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలకు అమితాబ్‌ బచ్చన్, హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ వోస్లూలను మేకర్స్‌ సంప్రదించారనే వార్త ప్రచారంలో ఉంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

యాక్షన్‌ లవ్‌స్టోరీ 
‘ఏజెంట్‌’ మూవీ తర్వాత అక్కినేని అఖిల్‌ తర్వాతిప్రాజెక్ట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ అఖిల్‌ తర్వాతి చిత్రం చిత్రీకరణ ఆల్రెడీ మొదలైందని, రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ లవ్‌స్టోరీ ఫిల్మ్‌కి ‘లెనిన్‌’ అనే టైటిల్‌ అనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఈ చిత్రంలో అఖిల్‌ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారని తెలిసింది. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్‌ దర్శకుడు మురళీ కిశోర్‌ ‘లెనిన్‌’ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలిసింది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థలు ఈ మూవీని నిర్మిస్తున్నాయని సమాచారం.  

మాస్‌ సంబరాలు 
‘ఏటి గట్టు సాచ్చిగా చెబ్తాండ ఈ తూరి నరికినానంటే అరుపు గొంతులో నుంచి కాదు... తెగిన నరాలొన్నించొచ్చాది!... ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రం కోసం సాయిదుర్గా తేజ్‌ చెప్పిన డైలాగ్‌ ఇది. దాదాపు రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ఇంటెన్స్‌ యాక్షన్‌ ΄్యాక్డ్‌ మూవీని కొత్త దర్శకుడు రోహిత్‌ కేపీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం తొలి భాగం సెప్టెంబరు 25న రిలీజ్‌ కానుంది.

రాజకీయం... ప్రతీకారం 
అప్సరా రాణి, విజయ్‌ శంకర్, వరుణ్‌ సందేశ్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన చిత్రం ‘రాచరికం’. సురేశ్‌ లంకలపల్లి దర్శకత్వంలో ఈశ్వర్‌ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 1న విడుదల కానుంది. పూర్తిగా రాయలసీమ నేపథ్యంలో సాగే ఫిల్మ్‌ ఇది. లవ్, యాక్షన్, రాజకీయాలు, ప్రతీకారం వంటి అంశాలతో ఈ చిత్రం రూపొందింది.  
రాయలసీమ నేపథ్యంలో మరికొందరు కుర్ర హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఇంకొందరు రాయలసీమ కథలు వింటున్నారు.          

– ముసిమి శివాంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement