రెండేళ్ల తర్వాత ఛాన్స్!
‘‘నా ప్రతిభను గుర్తించి అవకాశాలిస్తే ఆనందంగా ఉంటుంది. సానుభూతితో ఇచ్చే అవకాశాలు నాకు అవసరం లేదు’’ అని దాదాపు రెండేళ్ల క్రితం శ్వేతాబసు ప్రసాద్ చెప్పిన మాటలను ఎవరూ అంత సులువుగా మర్చిపోలేరు. హిందీ చిత్రం ‘మక్డీ’తో ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు సాధించి, అందరి దృష్టినీ ఆకట్టుకున్న శ్వేత, ‘కొత్త బంగారు లోకం’ ద్వారా తెలుగు తెరకు పరిచయమై, తనలో మంచి హీరోయిన్ మెటీరియల్ ఉందని నిరూపించుకున్నారు. కథానాయికగా మొదటి చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ, ఆ తర్వాత చేసిన చిత్రాలు శ్వేత కెరీర్‌కి పెద్దగా ఉపయోగపడలేదు.
పైగా వ్యభిచారం కేసు తలకు చుట్టుకోవడంతో నలుగురి నోళ్లలో నానాల్సిన పరిస్థితి. కొన్ని నెలల పాటు రెస్క్యూ హోమ్‌లో ఉన్న శ్వేతాబసు ప్రసాద్‌కు చివరకు న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చి, విడుదల చేసింది. ఆ సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలోనే శ్వేత పై విధంగా పేర్కొన్నారు. శ్వేతకు అవకాశాలిస్తామని అప్పట్లో కొంతమంది స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. కానీ, అది జరగలేదు. గత రెండేళ్లల్లో ఆమె సినిమాలు అంగీకరించిన దాఖలాలు లేవు. ఇప్పుడు శ్వేతకు ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ అవకాశం ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం హిందీ రంగంలో దీని గురించే చర్చ.
శ్వేతతో కరణ్ జోహార్ ఎలాంటి సినిమా చేయనున్నారు? ఈ చిత్రం మళ్లీ ఈ బ్యూటీకి నటిగా మంచి బ్రేక్ అవుతుందా? అనే చర్చ జరుగుతోంది. ఈ చిత్రవిశేషాలు తెలియజేయమని శ్వేతాబసు ప్రసాద్‌ను కోరగా, ఆమె మౌనం వహించారు. మౌనం అర్ధాంగీకారం అంటారు కాబట్టి... శ్వేతకు కరణ్ జోహార్ అవకాశమిచ్చినట్లేనని ఫిక్స్ అయిపోవచ్చు. బహుశా ఓ శుభముహూర్తాన అధికారికంగా ప్రకటించాలనుకుంటున్నారేమో!