కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్‌లో పెట్టుబడులు
50 శాతం వాటా కొనుగోలుకి రూ.1,000 కోట్లు
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్‌తో చిరపరిచితమైన వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సినిమాల నిర్మాణంలోకి ప్రవేశిస్తోంది. కంపెనీ సీఈవో అదార్ పూనావాలా ఏర్పాటు చేసిన సిరీన్ ప్రొడక్షన్స్ కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్‌లో 50 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 1,000 కోట్లు వెచ్చించనుంది.
ధర్మ ప్రొడక్షన్స్, ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్‌లలో రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సిరీన్ ప్రొడక్షన్స్ వెల్లడించింది. దీంతో ధర్మలో 50 శాతం వాటాను సిరీన్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకోనుంది. మిగిలిన 50 శాతం వాటాతోపాటు యాజమాన్యాన్ని కరణ్ జోహార్ కలిగి ఉంటారని సిరీన్ స్పష్టం చేసింది.
వెరసి పూనావాలా పెట్టుబడులు ధర్మ విలువను రూ. 2,000 కోట్లుగా నిర్ధారించాయి. ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమలోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ధర్మ, సిరీన్ సంస్థల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటైనట్లు సిరీన్ పేర్కొంది.
సినిమాల నిర్మాణంలో ధర్మకున్న నైపుణ్యం, అదార్ పూనావాలాకున్న వనరులు ఇందుకు తోడ్పాటునివ్వగలవని అభిప్రాయపడింది. ధర్మ మరింత పురోభివృద్ధిని సాధిస్తుందని, మరింత ఎత్తుకు ఎదుగుతుందని ఆశిస్తున్నట్లు తాజా పెట్టుబడులపై స్పందిస్తూ పూనావాలా పేర్కొన్నారు. భవిష్యత్ దృక్పథ వ్యూహాలు, నైపుణ్యంతోకూడిన సినిమాల నిర్మాణాల సక్రమ కలయికను తాజా భాగస్వామ్యం ప్రతిఫలిస్తున్నదని కరణ్ జోహార్ వ్యాఖ్యానించారు.
బాధ్యతలు ఇలా: కంపెనీ నూతన ఏర్పాటులో భాగంగా ధర్మకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో కరణ్ జోహార్ సృజనాత్మక కార్యక్రమాలను రూపొందిస్తారు. సీఈవోగా అపూర్వ మెహతా వ్యూహాత్మక మార్గదర్శకుడిగా కరణ్‌తో కలిసి బాధ్యతలు నిర్వహిస్తారు. కంటెంట్ నిర్మాణం, పంపిణీ, ఆధునిక టెక్నాలజీలను ఏకీకృతం చేయడం, ప్రొడక్షన్ విధానాలను మెరుగుపరచడం, ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం తదితర కార్యకలాపాలపై దృష్టి పెట్టనున్నట్లు సిరీన్ వివరించింది. దేశీయంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో తాజా డీల్‌కు ప్రాధాన్యత ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment