గాజు పెంకుల మీద డాన్సు చేయబోయిన దర్శకుడు!
అవి షోలే సినిమా విడుదలైన రోజులు.. అందులో హీరోయిన్ బసంతి (హేమమాలిని) 'ఓ.. జబ్ తక్ హై జాన్.. మై నాచూంగీ' అంటూ గాజు పెంకుల మీద డాన్సు చేస్తోంది. ఆమె కాళ్లకు గాజుపెంకులు గుచ్చుకుంటున్నాయి. రక్తం ధారలుగా కారుతోంది.. సినిమా చూసి వచ్చిన చిన్న కుర్రాడు ఆ డాన్సును మర్చిపోలేకపోయాడు. ఇంట్లో ఉన్న ఓ ఖాళీ సీసా తీసుకుని, దాన్ని పగలగొట్టాడు. జబ్ తక్ హై జాన్ అని పాడుతూ ఆ గాజు పెంకుల మీద డాన్సు చేయడానికి దాదాపు సిద్ధమైపోయాడు. అంతే.. ఆ కుర్రాడి తల్లి వచ్చి లాగి ఒక్కటి లెంప మీద ఇచ్చుకుంది.
ఆ కుర్రాడు ఎవరో కాదు.. ప్రస్తుత హిట్ సినిమాల దర్శకుడు కరణ్ జోహార్! ఆ సినిమా విడుదలై తామంతా చూస్తుండే సరికి షాహిద్ కపూర్, ఆలియా భట్ లాంటివాళ్లు అసలు ఇంకా పుట్టనే లేదని కరణ్ జోహార్ అన్నాడు. తనకు ఆరేళ్ల వయసున్నప్పుడు ఆ సినిమా చూశానని, వెంటవెంటనే రెండు షోలకు వెళ్లానని తెలిపాడు. మ్యాట్నీకి వెళ్లి బయటకు రాగానే మళ్లీ చూస్తానని ఏడవడంతో ఫస్ట్ షోకు కూడా తీసుకెళ్లారని అన్నాడు. షోలే సినిమాను ఇప్పటికి కనీసం 100 సార్లు చూసి ఉంటానని గుర్తుచేసుకున్నాడు. ఆ సినిమా బాలీవుడ్కు ఓ పాఠ్యపుస్తకం లాంటిదన్నాడు.