
నిర్మాతగా మారిన యువ దర్శకుడు
తమిళ దర్శకులు డైరెక్షన్ తో పాటు నిర్మాణ రంగంలోనూ సత్తాచాటుతున్నారు. యువ దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ కూడా అదే బాటలో పయనించడానికి సిద్ధమయ్యాడు. 2014లోనే స్టోన్ బెంచ్ సంస్థను ప్రారంభించిన కార్తీక్ ఈ సంస్థ ద్వారా బెంచ్ ఫ్లిక్స్, షార్ట్ ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్, బెంచ్ క్యాస్ట్ అనే విభాగాల్లో సినీ సేవలందిస్తున్నారు. ఈ శాఖల ద్వారా ఇప్పటికే 150 చిత్రాలకు సబ్‌టైటిల్స్‌ను, 200 లఘు చిత్రాల డిస్ట్రిబ్యూషన్, 25 చిత్రాలకు క్యాస్టింగ్‌ను సమకూర్చారు.
యూఎస్‌ఏకు చెందిన కల్‌రామన్, సోమశేఖరలతో కలిసి స్టోన్ బెంచ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై రెండు సినిమాలను, ఒక వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. అందులో ఒక చిత్రానికి మెయ్యాద మాన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. కొత్త దర్శకుడు రత్నకుమార్ పరిచయం అవుతున్న ఈ సినిమాలో నటుడు వైభవ్, ప్రియ భవానీశంకర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రెండో చిత్రానికి మెర్కురీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో డాన్సింగ్‌స్టార్ ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తున్నాడు.
ప్రభుదేవా హీరోగా నటించనున్న సినిమాకు కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలకు జాతీయ అవార్డు గ్రహీత తిరు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. వీటితో పాటు కళ్లసిరిప్పు అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఈ వెబ్ సీరీస్ లో రోహిత్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాల పరిచయ కార్యక్రమం శుక్రవారం చెన్నై గిండీలోని ఒక స్టార్ హోటల్‌లో నిర్వహించారు. దర్శకుడు మణిరత్నం, భారతీరాజ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.