
నాకు బిరుదులు వద్దు - విశాల్
‘‘నేను తీసిన ‘బొమ్మరిల్లు’ చిత్రాన్ని హరి చెన్నైలో రిలీజ్ చేశాడు. ఇప్పుడు తను నిర్మించిన ‘ఒక్కడొచ్చాడు’ హిట్ కావాలని కోరుకుంటున్నా. ‘పందెంకోడి’ చిత్రంలో విశాల్ నటన సూపర్బ్. హార్డ్‌వర్క్ కారణంగానే తను సక్సెస్ అవుతున్నాడు’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. విశాల్, తమన్నా జంటగా సురాజ్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన ‘కత్తి సండై’ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై ‘ఒక్కడొచ్చాడు’ పేరుతో జి.హరి ఈ నెల 18న తెలుగులో విడుదల చేస్తున్నారు. జగపతిబాబు విలన్‌గా నటించారు. ‘హిప్ హాప్’ తమిళ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ‘దిల్’ రాజు విడుదల చేశారు. విశాల్ మాట్లాడుతూ- ‘‘లవ్, యాక్షన్, కామెడీ అన్నీ ఉన్న చిత్రమిది. సమాజంలోని ప్రతి మనిషి మైండ్‌కు ఓ వాయిస్ ఉంటుంది.
ఆ వాయిస్‌తో మాట్లాడే అవకాశం ఈ చిత్రంలో వచ్చింది. ఐదేళ్ల తర్వాత వడివేలు గారు ఈ చిత్రంతో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. అభిమానులు నాకు ‘యాక్షన్ లెజెండ్’ బిరుదు ఇవ్వాలనుకుంటున్నారు. నాకు అవేవీ వద్దు.. విశాల్‌గానే ఉండాలనుకుంటున్నా’’ అని చెప్పారు. ‘‘విశాల్ మంచి నటుడే కాదు. మంచి మనసున్న వ్యక్తి కూడా. తను నాకు స్ఫూర్తి’’ అని తమన్నా చెప్పారు. చిత్ర నిర్మాత హరి, నిర్మాతలు బెల్లంకొండ సురేశ్, సి. కల్యాణ్, మిర్యాల రవీందర్ రెడ్డి, టి.ప్రసన్నకుమార్, కొడాలి వెంకటేశ్వరరావు, దర్శకులు శ్రీవాస్, మెహర్ రమేశ్, హీరోయిన్లు శ్రీదివ్య, మెహరీన్ పాల్గొన్నారు.