
సాక్షి, తమిళసినిమా : బాహుబలి చిత్రంలో అవంతికగా విజృంభించిన మిల్కీ బ్యూటీ తమన్నాకు.. ఆ తరువాత కోలీవుడ్‌లో సరైన అవకాశాలు రాలేదు. ఇక, శింబుతో రొమాన్స్ చేసిన ‘అన్భానవన్ అసరాధవన్ అడంగాధవన్’ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఉదయనిధిస్టాలిన్‌కు జంటగా శీనూరామస్వామి దర్శకత్వంలో కన్నె కలైమానే చిత్రంలో నటించినా.. అది ఇంకా విడుదలకు నోచుకోలేదు. దీంతో ఈ అమ్మడు ఐటమ్ సాంగులకు సై అంటోందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంలో తమన్నా చెప్పే వెర్షన్ వేరేవిధంగా ఉంది. డాన్స్ అంటే తనకు ఇష్టమని, అందుకే ఐటమ్ సాంగ్స్ అవకాశాలను వదులుకోవడం లేదన్నది ఆమె అంటోంది.
ఏదేమైనా కోలీవుడ్‌లో తమన్నా పనైపోయిందనే ప్రచారం సాగింది. అలాంటి తరుణంలో ఈ మిల్కీబ్యూటీని భారీ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. దర్శకుడు సుందర్.సీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఈ భామకు నటించే అవకాశం దక్కింది. శింబు హీరోగా పవన్ కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ని సుందర్ ప్రస్తుతం రీమేక్ చేస్తున్నారు. ఇందులో శింబుకు జంటగా మేఘా ఆకాశ్ నటించనుంది. ఈ చిత్రం తరువాత సుందర్ విశాల్ హీరోగా ఒక చిత్రం చేయనున్నారు. ఈ చిత్రంలో విశాల్‌తో జోడీ కట్టే అవకాశం తమన్నాకు దక్కింది. ఈ విషయమై తమన్నా స్పందిస్తూ.. మొదటినుంచి సుందర్ సీ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన దర్శకత్వంలో నటించాలన్న కోరిక ఇన్నాళ్లకు తీరినందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేసింది. ఇది కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ కథాచిత్రమని, ఇందులో తన పాత్ర కూడా యాక్షన్ సీన్లలో నటించాల్సి ఉంటుందని తెలిపింది. ఇంతకుముందు ఈ అమ్మడు ‘కత్తిసండై’ చిత్రంలో విశాల్‌తో రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిన్నది ప్రస్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో ఒక కీలక పాత్రను పోషిస్తోంది.