ఒకే వేదికపై శింబు, విశాల్, కార్తీ
చెన్నై : యాక్షన్ హీరో అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నానని నటుడు, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ అన్నారు. ఉరు చిత్ర నిర్మాత వీపీ.విజీ దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ఎళుమిన్. ఆత్మరక్షణ విద్యల్లో సత్తాచాటే ఆరుగురు చిన్నారుల ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రం ఇది. హాస్యనటుడు వివేక్, నటి దేవయాని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర ట్రైలర్ విడుదల సోమవారం వడపళనిలోని ఆర్‌కేవీ స్టూడియోలో జరిగింది. నటులు విశాల్, కార్తీ, శింబు అతిథులుగా పాల్గొని ట్రైలర్‌ను ఆవిష్కరించారు. విశాల్ మాట్లాడుతూ తాను యాక్షన్ హీరో అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నానని, ఈ చిత్రంలో చిన్నారులు యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టారన్నారు. ఈ చిత్ర జెండా ఊపడానికి తాను రాకూడదనీ, జాకీఛానే రావాలని పేర్కొన్నారు. ఇందులో నటించిన చిన్నారులు తననే ఇన్‌స్పైర్ చేశారని అన్నారు. చిత్ర మ్యూజిక్ చాలా బాగా వచ్చిందనీ, ఇందులో నటుడు వివేక్ రాసిన పాట బాగుందని చెప్పారు.
ఆయన నిజాలను ధైర్యంగా మాట్లాడతారని, ఎన్నికల్లో పోటీ చేస్తే కచ్చితంగా ఎమ్మెల్యే అవుతారని అన్నారు. ఇందులో నటించిన బాల తారలకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. నటుడు శింబు మాట్లాడుతూ.. వివేక్ ఒక చిత్రంలో నటిస్తున్నప్పుడు ఒకతన్ని ఒక డైలాగ్ చెప్పమని అడిగారన్నారు. దానికి అతను వెంటనే అంగీకరించాడన్నారు. అప్పుడు అతడు చెప్పకపోతే నేడు సంతానం అనే నటుడు ఉండేవాడు కాదని శింబు వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు పిల్లల ఆసక్తికనుగుణంగా వారిని ఎదగనివ్వాలని కోరారు. కార్యక్రమంలో నటి దేవయాని, నటుడు ఉదయ, ఎళుమిన్ చిత్ర యూనిట్ పాల్గొన్నారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌కు శింబు తండ్రి, నటుడు, దర్శకుడు టీ.రాజేందర్ మధ్య వర్గ పోరు జరుగుతోంది. ఇటీవల టీ.రాజేందర్ ఓ కార్యక్రమంలో విశాల్‌పై ఆవేశంగా విరుచుకుపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతల మండలి అ«ధ్యక్షుడు విశాల్, వ్యతిరేక వర్గానికి చెందిన శింబు ఒకే వేదికపై పాల్గొనడంతో వివాదాస్పద వ్యాఖ్యలకు అవకాశం ఉంటుందని మీడియా ఆసక్తిని చూపింది. అయితే అలాంటి సంఘటనలేమీ జరగకపోవడం విశేషం. చిత్ర నిర్మాత ఈ సందర్భంగా తిరుపత్తూర్‌లోని వీరవిలైయాట్టు కలైకూట్టంకు రూ.25 వేలను విరాళంగా అందించారు.
Comments
Please login to add a commentAdd a comment