
నో షార్ట్‌కట్స్!
రంగు మాత్రమేనా... తమన్నా రూపంలోనూ పదేళ్లుగా ఏ మార్పులూ లేవు. ఈ పదేళ్లలో మార్పుల గురించి ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే... తెలుగు తెరపై తమన్నా నాయికగా అడుగుపెట్టి పదేళ్లు పైనే అయింది. అప్పటి ‘శ్రీ’ నుంచి తాజా సినిమాల వరకూ తమన్నా శరీరాకృతిలో పెద్దగా మార్పులు లేవనే చెప్పుకోవాలి. అసలు మీ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో? చెప్పండి అని తమన్నాను అడిగితే – ‘‘ఏం లేదు. డైట్.. మనం తీసుకునే ఆహారమే నా ఫిట్‌నెస్ రహస్యం. మీరు శుభ్రమైన ఆహారం తీసుకున్నట్లయితే.. సన్నగా మంచి శరీరాకృతితో ఉంటారు. అంతే తప్ప... ఫిట్‌నెస్‌కి దగ్గర దారులంటూ ఏవీ లేవు’’ అన్నారు.
తమన్నాకు స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టమట! ‘‘నా బలహీనత ఏంటో తెలుసా? పానీపూరి. అదొక్కటే కాదు.. చాట్స్, స్ట్రీట్ ఫుడ్ అన్నీ ఇష్టమే. చిన్నప్పుడు స్కూల్‌లో సమోసాల కోసం లైన్‌లో నిలబడేదాన్ని. ఇప్పుడు నాకిష్టమైన ఫుడ్స్ అన్నిటినీ పక్కన పెట్టేశా. డైట్ పట్ల శ్రద్ధ వహించడం, ఎక్కువ మంచినీళ్లు తాగడం నా స్కిన్ సీక్రెట్ అనుకుంటున్నా’’ అన్నారీ సుందరి. అన్నట్టు... బుధవారం తమన్నా పుట్టినరోజు జరుపుకొన్నారు. మరి, ఈ బర్త్‌డే స్పెషల్ ఏంటి? అని అడిగితే.. ‘‘ఈ శుక్రవారం విడుదల కానున్న విశాల్ ‘ఒక్కడొచ్చాడు’ నాకు స్పెషల్. ఈ సినిమాలో పాటలన్నిటినీ లేడీ రైటర్ చల్లా భాగ్యలక్ష్మి రాశారు. తెలుగులో ప్రత్యేకంగా నా పేరుపై ‘దిల్ చాహ్‌తాహై నిన్ను చూసి తమన్నా’ అని ఏకంగా ఓ పాట రాయడంతో హ్యాపీ ఫీలయ్యా. ఈ సినిమాను నా పుట్టినరోజు బహుమతిగా భావిస్తున్నా’’ అన్నారు.