ఖల్‌నాయక్ రిటర్న్స్ | "Khal Nayak Returns' Sequel | Sakshi
Sakshi News home page

ఖల్‌నాయక్ రిటర్న్స్

Published Sun, Jul 10 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 4:33 AM

ఖల్‌నాయక్ రిటర్న్స్

ఖల్‌నాయక్ రిటర్న్స్

‘నాయక్ నహీ.. ఖల్‌నాయక్ హు మే’... 1993లో విడుదలైన సూపర్‌హిట్ సినిమా సంజయ్ దత్ ‘ఖల్‌నాయక్’లోని సూపర్‌హిట్ సాంగ్ ఇది. అప్పట్లో సంజయ్ పరిస్థితికి ఈ లిరిక్స్ అద్దం పట్టాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. అక్రమ ఆయుధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఏప్రిల్ 19, 1993న అరెస్ట్ అయ్యారు. ఒక్కసారిగా సంజయ్ జీవితంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. రీల్ లైఫ్‌లో ‘నాయక్’ అన్పించుకున్న ఈ హీరో, రియల్ లైఫ్‌లో ‘ఖల్‌నాయక్’ అంటూ విమర్శలపాలయ్యారు. అదే ఏడాది మే 26న ‘ఖల్‌నాయక్’ విడుదలై, భారీ విజయం సాధించింది.


ఆ సంగతలా ఉంచితే.. అక్రమాయుధాల కేసులో సంజయ్ జైలు జీవితం గడపడం, ఆ మధ్య బయటకు రావడం తదితర విషయాలన్నీ తెలిసిందే. ఇప్పుడు సంజయ్ నాన్‌స్టాప్‌గా సినిమాలు చేయాలనుకుంటున్నారు. విశేషం ఏంటంటే... ‘ఖల్‌నాయక్’ సినిమా సీక్వెల్‌తోనే హీరోగా రీ-ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ మొదలు కానుంది. ఈ సందర్భంగా ‘ఖల్‌నాయక్’, ఈ చిత్రం సీక్వెల్ గురించి కొన్ని విశేషాలు...

 

సంజయ్ దత్ జైలు జీవితం పూర్తవ్వక ముందే ‘ఖల్‌నాయక్ రిటర్న్స్’లో తనను తాను కథానాయకునిగా ఊహించుకున్నారు. జైలు జీవితం గడిపిన సమయంలో పెరోల్ మీద బయటకొచ్చిన ఓ సందర్భంలో ఆయన్ను కలసిన దర్శక-నిర్మాత సుభాశ్ ఘై సీక్వెల్ స్టోరీ ఐడియా చెప్పగా.. సంజయ్ వాయిస్ ఓవర్‌తో కూడిన ఓ సౌండ్ ట్రాక్ రెడీ చేయించారట. ‘‘అది విన్న తర్వాత సంజయ్ ఈ చిత్రంపై ఎంత ప్యాషన్‌తో ఉన్నాడో అర్థమైంది. మరో ఆలోచన లేకుండా సీక్వెల్ తీయాలనే నిర్ణయం తీసుకున్నా’’ అని సుభాశ్ తెలిపారు. ‘ది గాడ్ ఫాదర్’ పార్ట్ 3 తరహాలో ఈతరం ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఈ సీక్వెల్ తీస్తామంటున్నారాయన.

‘ఖల్‌నాయక్’లో సంజయ్ దత్ హీరోగా నటించగా, పోలీసాఫీసర్‌గా కీలక పాత్రలో జాకీ ష్రాఫ్  పోషించారు. ఈ సీక్వెల్‌లో జాకీ తనయుడు టైగర్ ష్రాఫ్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై సుభాశ్ ఘైను ప్రశ్నించగా.. ‘‘నటీనటులు ఎవర్నీ ఎంపిక చేయలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సీక్వెల్‌కి నేను దర్శకత్వం వహించను. త్వరలో దర్శకుణ్ణి ఎంపిక చేసి, మిగతా వివరాలు ప్రకటిస్తాం’’ అన్నారు.  


ఈ సీక్వెల్ కథ టూకీగా చెప్పారు సుభాశ్. ‘‘గ్యాంగ్‌స్టర్ బాలు ఇరవై ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలై సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెడతాడు. పరిస్థితుల ప్రభావం వలన మళ్లీ క్రైమ్ వరల్డ్‌లోకి వెళతాడు. అక్కడ మరో ‘ఖల్‌నాయక్’ ఎదురయ్యాడా? ఏం జరిగింది?’’ అనేది కథ. మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కనుందట. ఈ కథలో కొత్త పాత్రలు ఎంటరవుతాయని సమాచారం.  


అప్పట్లో మార్మోగిన ‘చోళీ కే పీచే క్యా హై...’ పాట ‘ఖల్‌నాయక్’ చిత్రంలోనిదే. ఆ సాహిత్యం మీద తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. సంజయ్ జైలుకి వెళ్లడం, ఈ పాట సృష్టించిన అలజడి చిత్రానికి విపరీతమైన ప్రచారం తీసుకొచ్చాయి. అసలు చిత్రంలో ఏముందో? తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. మరి.. ఇప్పుడు కూడా ‘చోళీ కే పీచే క్యా హై..’లాంటి పాట పెడతారా? లేక క్రేజ్ కోసం ఆ పాటనే రీమిక్స్ చేస్తారా? అనేది చూడాలి. టైటిల్ ట్రాక్ ‘నాయక్ నహీ ఖల్‌నాయక్ హు మే..’ని మాత్రం వాడాలనుకుంటున్నారు.


వాస్తవానికి ‘ఖల్‌నాయక్’లో ముందు అనుకున్నది వేరే హీరోని. ప్రముఖ హిందీ నటుడు నానా పటేకర్‌ను దృష్టిలో పెట్టుకుని సుభాశ్ ఘై ‘ఖల్‌నాయక్’  కథ రాశారు. కానీ, అనుకోని కారణాల వలన చిత్రం పట్టాలు ఎక్కలేదు. అప్పుడు సంజయ్‌దత్ కోసం కథలో మార్పులు చేసి తీశారు. ఈ చిత్రం తెలుగులో ‘ఖైదీ నంబర్ 1’గా రీమేక్ అయ్యింది. వినోద్‌కుమార్ హీరోగా, మాధురీ దీక్షిత్ పాత్రలో సుకన్య నటించారు.

 

‘ఖల్‌నాయక్ రిటర్న్స్’తో పాటు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమాలో నటించడానికి సంజయ్ దత్ అంగీకరించారు. స్క్రిప్ట్ రెడీ కావడానికి కొంత సమయం కావాలని దర్శకుడు కోరడంతో సినిమా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని ముంబయ్ సమాచారం.సంజయ్‌తోనే ‘ఢమాల్’ ఫ్రాంచైజీలో మూడో సినిమా తీయాలనుకుంటున్నట్లు దర్శకుడు ఇంద్ర కుమార్ ప్రకటించారు. సంజయ్ ఓకే అంటే.. వచ్చే ఏడాది ఆరంభించాలనుకుంటున్నారట.  ఓ కమర్షియల్ సినిమాకి అవసరమైన కథ, మలుపులు, భావోద్వేగాలు.. అన్నీ సంజయ్ దత్ జీవితంలో ఉన్నాయని దర్శకుడు రాజ్‌కుమార్ హిరాని అభిప్రాయం. సంజయ్‌ను ‘మున్నాభాయ్’గా, ‘పీకే’ సినిమాలో భైరాన్ సింగ్‌గా చూపించిన ఈ దర్శకుడు, సంజయ్ జీవితకథతో సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. సంజయ్ జీవితంలో చీకటి కోణాలతో పాటు 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వరకూ వివిధ దశలను చూపించనున్నారు. రణ్‌బీర్ కపూర్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement