హాస్యనటుడు కొండవలస ఇకలేరు
హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు (69) కన్నుమూశారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. గతకొంత కాలంగా చెవికి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయనకు వ్యాధి తీవ్రత ముదిరి... మెదడుకు పాకడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
'నేనొప్పుకోను.. అయితే ఓకే' అనే డైలాగ్‌తో పాపులర్ అయిన కొండవలస.. దాదాపు 300 చిత్రాలకు పైగా నటించి ప్రేక్షక్షుల హృదయాలను తన నటన శైలితో ఆకట్టుకున్నారు. నాటక రంగంలో వెయ్యికి పైగా నాటకాలు వేసిన కొండవలసకు.. మొత్తం 378 అవార్డులతో పాటు రెండు నంది అవార్డులు కూడా లభించాయి. వంశీ దర్శకత్వంలో 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' అనే చిత్రంతో సినిమారంగంలోకి ప్రవేశించారు. సినిమాల్లోకి రాకముందు విశాఖ పోర్టు ట్రస్టులో కొండవలస ఉద్యోగిగా పనిచేశారు.
ఆగస్టు 10, 1946వ సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా, కొండవలస గ్రామంలో లక్ష్మణరావు జన్మించారు. కొండవలస లక్ష్మణరావు కూతురు అమెరికా నుంచి రావలిసి ఉంది. ఆమె వచ్చిన తరువాత కొండవలస అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఆయన భౌతికకాయాన్ని నిమ్స్ మార్చురీలో భద్రపరిచారు.
కొండవలస నటించిన చిత్రాలు...
⇒ కబడ్డీ, కబడ్డీ
⇒ ఎవడి గోల వాడిదే
⇒ రాధాగోపాలం
⇒ కాంచనమాల కేబుల్ టీవీ
⇒ రాఖీ
⇒ అందాల రాముడు
⇒ శ్రీరామచంద్రులు