... అయితే నాట్ ఓకే!
పొట్టిరాజుకు భార్యంటే భయం. కాని పైకి పెద్ద లెక్కలేని మగరాయుడిలా తిరుగుతూ ఉంటాడు. భార్య ఏదైనా చెప్తే అతని నోటి గుండా మొదటగా వచ్చే మాట- నో... నేనొప్పుకోను. కాని భార్య వెంటనే చీపురు తిరగేస్తే అతని జవాబు
- అయితే ఓకే.
ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చాలా మంది భర్తలను వర్ణించడానికి జన సామాన్యం వాడే మాట ‘అతనా... అతను అయితే ఓకే టైపు’... భార్య చాటు భర్తలను వర్ణించడానికి పుట్టిన ఈ మాట కేవలం కొండవలస లక్ష్మణరావు వాచికం వల్లే పాపులర్ అయ్యింది. వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ (2002)లో పొట్టిరాజు పాత్ర పోషించిన కొండవలస ‘అయితే ఓకే’ అనే మేనరిజంతో తెలుగు తెరపైకి తాజా శ్రీకాకుళ హాస్యాన్ని తీసుకువచ్చాడు. తెలుగులో లేటు వయసులో సినిమాల్లో గొప్ప పేరును సంపాదించినవాళ్లలో జె.వి.సోమయాజులు ముందు వరుసలో ఉంటారు. ఆ తర్వాత కొండవలసను చెప్పుకోవచ్చు. విశాఖలో చేస్తున్న ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి 2001లో హైదరాబాద్‌లో ఉన్న కొడుకు దగ్గరకు వచ్చి స్థిరపడ్డాకే ఆయనకు సినిమాల్లో అవకాశం వచ్చింది. అప్పటి వరకూ నాటకాల్లో ఆయన చెరిగేశాడని చెప్పాలి.
దాదాపు 250 నాటకాలు వేస్తే దాదాపు 2,500 ప్రదర్శనలు ఇస్తే 200కు పైసార్లు ఉత్తమ రంగస్థల అవార్డును అందుకుంటే ఆ తృప్తి, సీనియారిటీ వేరు. దానిని వాడుకోవాలని వంశీ అనుకోవడం వేరు. నాటకాల్లో సీరియస్ నటుడిగా ముద్ర పడిన కొండవలను పొట్టి క్రాఫు చేయించి ఫేక్ వాయిస్‌తో మాట్లాడమని చెప్పి వంశీ ఆయనకు తెర మీద గట్టి ముద్ర వేయగల కామెడీ నటుడిగా తీర్చిదిద్దారు. ఆ వెంటనే వంశీ ‘దొంగరాముడు అండ్ పార్టీ’... ఎస్.వి.కృష్ణారెడ్డి ‘పెళ్లాంతో పనేంటి’ సినిమాల్లో కొండవలస ఒక ఊపు ఊపారు. పెళ్లాంతో పనేంటి సినిమాలో భార్యను బెదరగొట్టే పాత్రలో ‘అమంతా.. అమంతా’ అంటూ ఆయన ఆకట్టుకుంటారు. చివరకు ఆ అమంత పాత్ర పోషించిన తెలంగాణ శకుంతల ఆయనకు తాడు కట్టి బావిలో దింపి తగిన శాస్తి చేస్తుంది.
బాంబుల బక్కిరెడ్డిగా నవ్వించారు
కొండవలస రాకతో సరదాగా, చనువుగా ఉండే దిగువ శ్రేణి పాత్రలకు కొత్త ఊపు వచ్చినట్టయ్యింది. ఆర్‌ఎంపీ డాక్టర్, పోస్ట్‌మేన్, హౌస్ ఓనర్, పక్కింటి బాబాయ్... ఇవన్నీ కొండవలస పోషణతో ప్రేక్షకులకు రిలీఫ్ ఇస్తూ కథను మరీ బరువెక్కకుండా కాపాడాయి. స్వయంగా ఎందరో కమెడియన్లను తయారు చేసిన ఈవీవీ సత్యనారాయణ మరో దర్శకుడు తయారు చేసిన ఈ నటుణ్ణి భేషజంతో దూరం పెట్టకుండా ‘ఎవడి గోల వాడిదే’లో ‘బాంబుల బక్కిరెడ్డి’ పాత్ర ఇచ్చి ఆ పాత్రను హిట్ చేయడమే కాకుండా సినిమాను కూడా సూపర్‌హిట్ చేసుకోగలిగారు. అందులో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌గా కొండవలస నవ్విస్తారు. పెళ్లికొడుకు తండ్రిగా వచ్చిన ఏవీఎస్‌కు తన భార్య- ‘నక్సలైట్ నల్లక్క’ను పరిచయం చేసి ఇంకా కంగారు పుట్టిస్తారు. పెద్ద హీరోల పక్కన చేస్తూ వారి చేత చావగొట్టించుకుంటూ అదే హాస్యంగా ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే పని కొండవలస చేయలేదు. గిలిగింతలు పెడితే నవ్వు... కొడితే ఏడుపు రావాలి కదా! అనేది ఆయన ధోరణి.
అనారోగ్యంతో..: పాత్ర కోసం మమేకం అయ్యే పని కొండవలసకు ప్రాణాంతకం అయ్యింది. ‘కబడ్డీ కబడ్డీ’ (2003) సినిమాలోని ఒక హాస్య సన్నివేశంలో పోలీసుల నుంచి పారిపోతూ చేపల చెరువులో ఈదుతారు కొండవలస. అందుకోసం నిజంగానే ఈదడం వల్ల ఆ నీళ్లు లోపలికి వెళ్లి అనారోగ్యం పాలయ్యారు. దాదాపు మృత్యువుతో పోరాడినంత పని చేశారు. అందువల్ల ఎంతో పేరు వచ్చినా వయసు రీత్యా, ఈ అనారోగ్యం రీత్యా ఎన్నో అవకాశాలను వదులుకోవాల్సి వచ్చింది. ఆయన వయసు ఇప్పుడు 69 కావచ్చు. కానీ సినీ నటుడుగా టీనేజ్‌లో ఉన్నట్టే. హాస్యాన్ని అభిమానించే తెలుగువారిని ఒక్కో హాస్యనటుడూ వదిలేసి పోతున్నాడు. ఇప్పుడు కొండవలస ఆ వరుసలోకి చేరాడు. కొండవలసా... దిసీజ్ నాట్ ఓకే.
- సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి