గ్లామర్ పాత్రలు చేయను
‘‘నేటి తరం హీరోయిన్లు గ్లామర్, యాక్టింగ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. పాత్ర డిమాండ్‌ను బట్టి వారు నటిస్తారు. నా వరకు నేను గ్లామర్ పాత్రల్లో నటించేందుకు ఇష్టపడటం లేదు. నేను కథ ఎంపిక చేసుకునేటప్పుడు నాన్నగారిని (నటుడు నాగబాబు), మెగా అభిమానులను దృష్టిలో పెట్టుకుంటాను. వాళ్లు చూడటానికి ఇబ్బంది పడే పాత్రల్లో నటించను’’ అని కథానాయిక నీహారిక స్పష్టం చేశారు.
నాగశౌర్య, నీహారిక జంటగా రామరాజు దర్శకత్వంలో‘మధుర’ శ్రీధర్‌రెడ్డి నిర్మించిన ‘ఒక మనసు’ ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నీహారిక పలు విశేషాలు చెప్పారు.
స్వచ్చమైన ప్రేమకథతో తీసిన సినిమా ‘ఒక మనసు’. ప్రేమకథా చిత్రాలంటే ‘మరోచరిత్ర’, ‘గీతాంజలి’ వంటి వాటిని చెబుతారందరూ. ఆ రెండు చిత్రాల తర్వాత ఇకపై ‘ఒక మనసు’ను గుర్తు పెట్టుకుంటారు. ప్రేమకథ అంటే పిల్లలతో కలిసి చూడ్డానికి తల్లిదండ్రులు, పెద్దలతో కలిసి చూడ్డానికి పిల్లలూ ఇబ్బంది పడతారు. ఇందులో అటువంటి సన్నివేశాలు ఉండవు హీరోయిన్‌గా రావాలనుకున్నప్పుడు చాలా కథలు విన్నా. ఏదీ నచ్చలేదు. ‘ఒక మనసు’ చిత్రంలోని సంధ్య పాత్ర వినగానే మనసుకు నచ్చి ఓకే చెప్పేశా.
నా కుటుంబ సభ్యులు, మెగా అభిమానులందరికీ నా పాత్ర నచ్చుతుంది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా హీరోయిన్స్‌గా నాకంటే ముందు వేరే కుటుంబాల నుంచి వచ్చిన వారు కొనసాగలేకపోయారు. తొలుత ప్రొడక్షన్ వ్యవహారాలు చూసిన నాకు యాక్టింగ్ ఎందుకు చేయకూడదు? అనిపించి, నాన్నగారికి చెబితే ఆయన ఆలోచించి సరే అన్నారు.
ఆ తర్వాత పెదనాన్న చిరంజీవి, బాబాయ్ పవన్‌కల్యాణ్, అన్నయ్యలు అందరితో మాట్లాడాను. ఇండస్ట్రీలోని ప్లస్‌లు, మైనస్‌లు వారు చెప్పారు. ఫైనల్‌గా ‘ఇది నీ లైఫ్.. నీకు కరెక్ట్ అనిపించింది చెయ్’ అని ప్రోత్సహించారు పెదనాన్న చిరంజీవిగారి ఇమేజ్ వల్ల నా ఫస్ట్ చిత్రానికి ఇంత అటెన్షన్ ఉందే కానీ, రెండో చిత్రానికి ఉండదు. ఫస్ట్ సినిమాలో ఎలా నటించానా? అని చూసేందుకు అభిమానులు వస్తారు. సరిగ్గా నటించకపోతే రెండో చిత్రానికి రారు.
సినిమా బాగాలేకపోతే నా సొంత అన్నయ్య చిత్రమే నేను రెండోసారి చూడను. టాలెంట్‌ను నిరూపించుకుని ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాలి ఎక్కువకాలం ఇండస్ట్రీలో ఉండాలని ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేయను. ఎన్ని సినిమాలు చేశాం అని కాదు.. ఎన్ని మంచి చిత్రాలు చేశామన్నదే నాకు ముఖ్యం. మంచి పాత్రలు వస్తే తమిళ, కన్నడం, మలయాళ భాషల్లో నటిస్తాను. నటన పరంగా నాకు రోల్‌మోడల్ పెదనాన్నగారే. కమల్‌హాసన్‌గారు, కాజోల్ అంటే ఇష్టం నాగశౌర్య మంచి కోస్టార్. మొదట్లో కామ్‌గా ఉండేవాడు. ఆ తర్వాత మంచి ఫ్రెండ్ అయ్యాడు. కొన్ని సన్నివేశాల్లో నటించేందుకు ఇబ్బంది పడుతుంటే తను బాగా సపోర్ట్ చేశాడు. రామరాజుగారి దర్శకత్వంలో నటించడం చాలా కంఫర్టబుల్ అనిపించింది.