ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావాలి
– విజయనిర్మల
‘‘తేనె మనసులు’ సినిమాతో నా కెరీర్ స్టార్టయ్యింది. ‘అగ్ని పరీక్ష’ సినిమా సూపర్‌హిట్ అయిన సందర్భంలో అనుకోని కారణాల వల్ల ఝాన్సీ పెళ్లికి వెళ్లలేకపోయాను. నా 75 సంవత్సరాల జీవితాన్ని పుస్తకరూపంలో తీసుకురావడం ఆనందంగా ఉంది. ‘నెంబర్‌వన్’ వంటి హిట్ చిత్రాన్ని నాకు అందించిన కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డికి థ్యాంక్స్’’ అని సూపర్ స్టార్ కృష్ణ అన్నారు. కృష్ణ వీరాభిమాని ఝాన్సీ లక్ష్మీ కుమారులు రవికృష్ణ, రామకృష్ణ.. కృష్ణ 75 సంవత్సరాల జీవిత విశేషాలతో ఒక పుస్తకం రూపొందించారు.
ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం కృష్ణ, విజయనిర్మల స్వగృహంలో జరిగింది. తొలి సంచికను ఎస్వీ కృష్ణారెడ్డి ఆవిష్కరించి కృష్ణకు అందించారు. ‘‘ఇలాంటి పుస్తకాలు సంవత్సరానికి ఒకటి రావాలి. ఝాన్సీలక్ష్మీ తన అభిమానాన్ని చాటుకుంటూ గొప్ప పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయం. ఝాన్సీ లక్ష్మీ తన పిల్లలకు, మనవరాలికి కృష్ణగారి పేరు వచ్చేలా పెట్టుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు విజయ నిర్మల. ‘‘నా అభిమాన హీరో కృష్ణగారి 75 సంవత్సరాల జన్మదిన సంచిక పుస్తకాన్ని నా కుమారులు రూపొందించడం నా అదృష్టం’’ అన్నారు ఝాన్సీ లక్ష్మీ. ఈ కార్యక్రమంలో అచ్చిరెడ్డి, బాజ్జీ తదితరులు పాల్గొన్నారు.