రామ్‌చరణ్‌కు సోదరిగా...
ఢిల్లీలో పుట్టి, బెంగళూరులో పెరిగి, మోడల్‌గా మొదలై, సినిమాల్లో పేరు తెచ్చుకున్న పంజాబీ అమ్మాయి - కృతీ కర్బందా. తెలుగు చిత్రం ‘బోణీ’ (2009)తో సినీ రంగంలోకి వచ్చినా, తెలుగులో కన్నా కన్నడంలోనే ఆమె ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. గతంలో పవన్‌కల్యాణ్ ‘తీన్‌మార్’, రామ్ ‘ఒంగోలు గిత్త’, కల్యాణ్‌రామ్ ‘ఓం - 3డి’లో నటించిన ఈ బెంగళూరు యువతి కొంత విరామం తరువాత ఇప్పుడు మళ్ళీ ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో, హీరోకు సోదరి పాత్రను ఆమె పోషిస్తున్నారు.
హీరోయిన్‌గా చేస్తూ, సోదరి పాత్ర ఒప్పుకోవడం కెరీర్‌కు దెబ్బ కాదా? ‘‘నిజం చెప్పాలంటే, ఈ పాత్ర నా కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆలోచించలేదు. నా కన్నా నా చుట్టూ ఉన్నవాళ్ళే ఎక్కువ ఆలోచిస్తున్నట్లున్నారు’’ అని కృతి నవ్వేశారు. ‘‘ఆ పాత్ర స్వరూప స్వభావాలు నచ్చడంతో ఒప్పుకున్నా’’ అని పేర్కొన్నారామె. ‘‘ఈ ఆఫర్ గురించి కన్నడంలో పెద్ద స్టార్ అయిన ఉపేంద్ర గారికి చెప్పాను. ఈ మధ్యే ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో క్యారెక్టర్ రోల్‌కు ఒప్పుకున్న ఆయన ఏమని చెబుతారా అని చూశాను. ‘నీ మీద నీకు నమ్మకం ఉంచుకో. పాత్ర నచ్చితే చేసేయ్!’ అన్నారు. అంత పెద్ద నటుడే మరో భాషా చిత్రంలో నటిస్తుంటే, నేనెందుకు వెనక్కి తగ్గాలని ఈ పాత్ర చేస్తున్నా’’ అని కృతీ కర్బందా వివరించారు.
ఆ మధ్య ‘గూగ్లీ’ చిత్రంతో కన్నడంలో ఒక ఊపు ఊపేసిన కృతి ప్రస్తుతం అయిదు భారీ కన్నడ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ‘‘రామ్‌చరణ్ - శ్రీను వైట్ల సినిమాలో బోలెడంత బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ఉంది. సినిమాలోని ఈ ప్రధాన ఉపకథ ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నా. నిజజీవితంలో నేనున్నట్లే, పక్కింటి అమ్మాయిలా, వాగుడుకాయలా ఉండే పాత్ర నాది. ప్రస్తుతానికి అంతకు మించి వివరాలు వెల్లడించలేను’’ అన్నారీ అమ్మాయి. మునుపటి తెలుగు సినిమా ఆశించినంతగా ఆడకపోవడంతో, నాలుగు నెలల పాటు ఏ సినిమానూ ఒప్పుకోని కృతి మొత్తానికి ఇప్పుడు ఆచితూచి చక్కటి సినిమా, పాత్ర ఎంచుకున్నట్లున్నారు. ఇంకేం! శుభం!!