'క్షణం' మూవీ రివ్యూ | Kshanam Movie Review | Sakshi
Sakshi News home page

'క్షణం' మూవీ రివ్యూ

Published Fri, Feb 26 2016 12:28 PM | Last Updated on Sun, Jul 14 2019 4:31 PM

'క్షణం' మూవీ రివ్యూ - Sakshi

'క్షణం' మూవీ రివ్యూ

టైటిల్ : క్షణం
జానర్ : ఇన్వస్టిగేషన్ థ్రిల్లర్
తారాగణం : అడవి శేష్, అదాశర్మ, అనసూయ, సత్యం రాజేష్
సంగీతం : పాకల శ్రీచరణ్
దర్శకత్వం : రవికాంత్
నిర్మాత : పివిపి సినిమా


కర్మ, కిస్ లాంటి సినిమాలతో తన మార్క్ చూపించిన అడవి శేష్ మరోసారి సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చేసిన ప్రయత్నం క్షణం. టాలీవుడ్లో చాలా అరుదుగా కనిపించే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లేను కూడా అందించిన శేష్, అంతా తానే అయి సినిమాను తెరకెక్కించాడు. అదాశర్మ గ్లామర్, అనసూయ పోలీస్ లుక్ లాంటి అంశాలతో పాటు పీవీపీ లాంటి భారీచిత్రాల నిర్మాణ సంస్థ కూడా తోడవ్వటంతో క్షణం సినిమా రిలీజ్కు ముందే భారీ హైప్ క్రియేట్ చేసింది. మరి ఆ అంచనాలను ఈ క్షణం అందుకుందా..?

కథ :
ఇండియాలో మెడిసిన్ చదవడానికి వచ్చిన ఎన్నారై కుర్రాడు రిషి (అడవి శేష్), అదే కాలేజ్లో చదివే శ్వేత (అదాశర్మ)తో ప్రేమలో పడతాడు. తనను ప్రేమించిన వెంటనే ఆ విషయాన్ని ఆమె తండ్రి ముందే శ్వేతకు చెబుతాడు. రిషి పద్ధతి శ్వేత తండ్రికి నచ్చదు. తను ఇక్కడివాడు కాదన్న కారణంతో వారి ప్రేమను అంగీకరించడు. శ్వేతను కార్తీక్ (సత్యదేవ్)కు ఇచ్చి పెళ్లి చేస్తాడు. దీంతో తన చదువు మధ్యలోనే ఆపేసి రిషి అమెరికా వెళ్లిపోతాడు. ఈ సంఘటన జరిగిన నాలుగేళ్ల తరువాత శ్వేత, రిషికి ఫోన్ చేసి తనను కలవాలంటుంది. వెంటనే ఇండియా బయలుదేరి వచ్చిన రిషితో తన కూతురు రియా కిడ్నాప్ అయ్యిందని, తనను వెతకడానికి సాయం చేయాలని అడుగుతుంది. రిషి కూడా శ్వేతకు సాయం చేయడానికి అంగీకరిస్తాడు.

ఈ కిడ్నాప్ మిస్టరీని ఛేదించే క్రమంలో పోలీసులు, స్కూల్ ప్రిన్సిపల్, శ్వేత ఇరుగుపొరుగులను కలిసిన రిషి, వాళ్లు చెప్పిన సమాధానంతో షాక్ అవుతాడు. అసలు రియా అనే అమ్మాయే లేదని, శ్వేత మెంటల్ కండిషన్ సరిగ్గా లేకపోవటం వల్లే తనకు కూతురు ఉన్నట్టు ఊహించుకుంటుందని తెలుస్తుంది. ఇదే విషయాన్ని శ్వేతతో చెబుతాడు రిషి. తను ఎంతో నమ్మకంగా సాయం చేస్తాడనుకున్న రిషి కూడా తన మాట నమ్మకపోవటంతో శ్వేత ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ తరువాత రిషి ఏం చేశాడు..? అసలు నిజంగా శ్వేతకు కూతురు ఉందా..? ఉంటే ఏమయ్యింది..? తనకు సాయం చేయమని శ్వేత, రిషినే ఎందుకు అడిగింది..? లాంటి అంశాలన్ని తెర మీద చూసి తెలుసుకోవాల్సిందే


నటీనటులు:

ప్రతి సినిమాకు ఎంతో మెచ్యూరిటీ చూపిస్తున్న అడవి శేష్, ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. థ్రిల్లింగ్ ఎపిసోడ్స్తో పాటు రొమాంటిక్ సీన్స్లోనూ మంచి వేరియేషన్స్ చూపించి, సినిమా అంతా వన్ మేన్ షోలా నడిపించాడు. ముఖ్యంగా లుక్ విషయంలో కూడా మంచి వేరియేషన్స్ చూపించాడు. క్యూట్ లుక్స్తో ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలకే పరిమితమైన అదాశర్మ ఈ సినిమాతో నటిగా కూడా మంచి మార్కులు సాధించింది. కూతురి్న పొగొట్టుకున్న తల్లి బాధను మనసుకు హత్తుకునేలా చూపించింది. తొలిసారి ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపించి అనసూయ ఫరవాలేదనిపించింది. తన నుంచి అద్భుతమైన నటన ఆశించేవారికి మాత్రం నిరాశ తప్పదు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా సత్యం రాజేష్ ఆకట్టుకున్నాడు. తన పాత్రతో సినిమాకు కాస్త కామెడీ యాడ్ చేసే ప్రయత్నం చేశాడు.

సాంకేతిక నిపుణులు:
ఈ సినిమాలో నటుడిగానే కాదు సాంకేతిక నిపుణుడిగా కూడా అడవి శేష్, మంచి మార్కులు సాధించాడు. తెలుగు తెరకు చాలా కొత్త కథను అందించటంతో పాటు అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు. ఏ ఒక్క సీన్ను ప్రేక్షకుడు ముందుగానే ఊహించే అవకాశం లేకుండా పర్ఫెక్ట్ థ్రిల్లర్గా సినిమాను నడిపించాడు. దర్శకుడు రవికాంత్ టేకింగ్ బాగుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒకే మూడ్లో సినిమాను నడిపించటంలో రవికాంత్ సక్సెస్ అయ్యాడు. పాకల శ్రీచరణ్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా, నేపథ్య సంగీతంతో మెప్పించాడు. ప్రతీ సీన్ను తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్తో మరింత థ్రిల్లింగ్ మార్చాడు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీలు కూడా సినిమాకు హెల్ప్ అయ్యాయి.

ప్లస్ పాయింట్స్ :
అడవి శేష్
కథ
స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్ :
రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం
పాటలు

ఓవరాల్గా క్షణం, ప్రేక్షకుణ్ని తల తిప్పకుండా కూర్చోపెట్టే ఫర్ఫెక్ట్ థ్రిల్లర్

- సతీష్ రెడ్డి, ఇంటర్ నెట్ డెస్క్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement